Gas Cylinder: రాబోయే రోజుల్లో ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరగనున్నాయా? ఆ విధంగా కేంద్రం అడుగులు వేస్తోందా? పశ్చిమాసియాలో ఎలాంటి ఉద్రిక్తతలు లేనప్పుడు కేంద్రం నిర్ణయం వెనుక కారణమేంటి? కేవలం వంటగ్యాస్, సహజ వాయువు వినియోగదారులపై పన్నులు విధించాలని ఆలోచన చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందుకు రకరకాల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఆర్థిక భారం తగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం. ఏదో విధంగా ప్రజలపై సుంకాలు పెంచేందుకు ప్లాన్ చేస్తోంది. తాజాగా వంటగ్యాస్, సహజ వాయువు వినియోగదారులపై ప్రత్యేకంగా పన్నులు విధించాలని యోచిస్తోంది మోదీ ప్రభుత్వం. అంతర్జాతీయ మీడియా కథనాల మేరకు.. దేశంలో ఇంధన భద్రతను బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తోంది కేంద్రం.
అందుకోసం దాదాపు రూ. 3.6 లక్షల కోట్లు ఖర్చు కానుంది. వంట గ్యాస్-నేచురల్ గ్యాస్ వినియోగదారులపై కొత్తగా సెస్ విధించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై వివిధ మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం లభించలేదు. ఒకవేళ అమల్లోకి వస్తే 14 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరపై సుమారు రూ.18 భారం పడనుంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతిపాదన మేరకు ఎల్పీజీపై కిలోకు రూ.1.29 చొప్పున సెస్ విధించాలన్నది ఆలోచనగా తెలుస్తోంది.
నేచురల్ గ్యాస్‌పై ప్రతి క్యూబిక్ మీటర్‌కు రూ.1.43 సెస్ విధించే అంశాన్ని పరిశీలన చేస్తున్నట్లు రాసుకొచ్చాయి. అనుకున్నట్లుగా జరిగితే ఈ రెండు సెస్‌ల ద్వారా ప్రతి ఏడాది సుమారు రూ.14 వేల కోట్లు కేంద్రానికి సమకూరే అవకాశం ఉందట. రానున్న పదేళ్లలో సుమారు రూ.4 లక్షల 30 వేల కోట్లతో భారీగా ఇంధన నిల్వలను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన.
పన్ను పేరుతో వచ్చిన నిధులను ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ, క్రూడ్ ఆయిల్ నిల్వల కోసం ప్రత్యేక స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. అత్యవసర పరిస్థితుల్లో వాటిని వినియోగించనుందట కేంద్రం. కేంద్రం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన వివిధ మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. మోడీ కేబినెట్ దీనికి ఆమోదముద్ర వేయలేదు. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ లభిస్తే దేశవ్యాప్తంగా కోట్లాది గ్యాస్ వినియోగదారుల నెల వారీ వంటగ్యాస్ ఖర్చు దాదాపు 2 శాతం వరకు పడుతుందని ఓ అంచనా.
ఆసియా దేశాలతో పోలిస్తే దేశ అత్యవసర ఇంధన నిల్వలు తక్కువగా ఉన్నాయని ఇటీవలకాలంలో గుర్తించింది కేంద్రం. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న నిల్వలు కేవలం వారం లేకుంటే 10 రోజుల అవసరాలను తీర్చనున్నాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు 60 నుంచి 100 రోజులకు వినియోగించుకునే సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది.
ALSO READ: భలే ఉద్యోగం.. ఆఫీస్‌లో కూర్చోవాల్సిన పనిలేదు! ప్రపంచాన్ని చుట్టేస్తూ చేయగల 9 అద్భుతమైన కెరీర్లు