ఒక వ్యక్తి ధనవంతుడా, పేదవాడా అని చెప్పేందుకు అతడి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలిస్తే సరిపోతుంది. కానీ అమెరికాలో మాత్రం చాలామందికి బ్యాంక్ బ్యాలెన్స్ లు పెద్దగా ఉండవు. ఉండవు అంటే సేవింగ్స్ ఖాతాల్లో పెద్దగా డబ్బులు దాచుకోరు అని దానర్థం. ఆ డబ్బునంతా వివిధ పెట్టుబడి పథకాల్లో పెడుతుంటారు. అందుకే అక్కడ ద్రవ్యోల్పణం పెరిగినా వారి జీవనానికి పెద్దగా ఇబ్బందులుండవు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రిటర్న్స్ ఇచ్చే పథకాల్లోనే వారు పెట్టుబడులు పెడుతుంటారు. అంతే కానీ ద్రవ్యోల్బణం కంటే తక్కువ వడ్డీని ఇచ్చే సేవింగ్స్ ఖాతాల్లో డబ్బుని ఎంతమాత్రం ఉంచరు.
ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి..
అమెరికాలో ప్రస్తుతం ద్రవ్యోల్బణం 2.7 శాతంగా ఉంది. అయినా కూడా అమెరికాలో సగటు వ్యయ పరిమాణం ఎక్కువగానే ఉంది. పొదుపు నిల్వలు తక్కువగా ఉన్నా అమెరికన్లకు డబ్బు ఎక్కడినుండి వస్తుందనేది అసలు రహస్యం. అది రహస్యమేమీ కాదు, అయితే వారు తమ డబ్బుని సాధారణ సేవింగ్స్ అకౌంట్స్ లో ఉంచరు. కచ్చితంగా ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ రాబడి వచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. JP మోర్గాన్ చేజ్ సంస్థ హౌస్‌హోల్డ్ ఫైనాన్స్ పల్స్ విశ్లేషణ అమెరికన్ల పొదుపు మార్గాలను విశ్లేషిస్తుంది. 47 లక్షల మంది పొదుపు మార్గాలను విశ్లేషిస్తే సాంప్రదాయ బ్యాంకు నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ, మనీ మార్కెట్ నిధులు, ట్రేడింగ్ అకౌంట్లు, డిపాజిట్ సర్టిఫికెట్లలో అమెరికన్లు ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారని తేలింది. ఈ పెట్టుబడి ఏటా 3 నుంచి 5 శాతం పెరుగుతోందని తెలుస్తోంది.
మనీ మార్కెట్ అకౌంట్స్..
అధిక రాబడినిచ్చే పెట్టుబడి సాధనాలవైపు మాత్రమే అమెరికన్లు మొగ్గు చూపుతున్నారు. ఇందులో మొదటిది అధిక దిగుబడినిచ్చే పొదుపు ఖాతా. హై ఈల్డ్ సేవింగ్స్ అకౌంట్స్ (HYSA) అని వీటిని పిలుస్తారు. సాంప్రదాయ పొదుపు ఖాతాలవలె కాకుండా ఇవి అధిక వడ్డీరేటుని ఇస్తాయి. స్థిర కాలానికి పెట్టుబడిని లాక్ చేసేవి డిపాజిట్ సర్టిఫికెట్లు. వీటిని CDలు అని అంటారు. పెట్టుబడి కాలవ్యవధిని బట్టి వడ్డీరేటు మారుతూ ఉంటుంది. మూడోది మనీ మార్కెట్ ఖాతాలు (MMA). బ్యాంకులు అందించే MMAలు HYSAల కంటే కొంచెం తక్కువ వడ్డీనిస్తాయి. కానీ పెట్టుబడికి భరోసా ఉంటుంది కాబట్టి ఎక్కువమంది వీటివైపు మొగ్గు చూపుతుంటారు. బ్రోకరేజ్ ఖాతాలు మరో ప్రత్యామ్నాయం. ఈ ఖాతాల ద్వారా స్టాక్‌లు, ETFలు, మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం అమెరికా మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పటికీ, అవి అధిక దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
రిటైర్మెంట్ బెనిఫిట్ పథకాలు..
రిటైర్మెంట్ బెనిఫిట్ లు అందించే పదవీ విరమణ ఖాతాల్లో కూడా అమెరికన్లు భారీగా పెట్టుబడులు పెడుతుంటారు. దీర్ఘకాలిక పొదుపు కోసం రూపొందించబడినప్పటికీ, వీటిని ఎక్కువగా పన్ను-ప్రయోజనకరమైన ఖాతాలుగా వినియోగిస్తున్నారు. అనేక కుటుంబాలు భవిష్యత్తు ఆర్థిక భద్రతపై దృష్టి సారిస్తూ ఈ పదవీ విరమణ ఖాతాలవైపు మొగ్గు చూపుతున్నాయి. మొత్తమ్మీద అమెరికన్లు డబ్బుని మనలాగా సేవింగ్స్ అకౌంట్లలో దాచుకుని సంతృప్తి పడరు. డబ్బుతో మరింత డబ్బుని సంపాదించడం ఎలా అనే దాని గురించి నిరంతరం ఆలోచిస్తుంటారు. అందుకే వైవిధ్యమైన పెట్టుబడుల్లో వారు ఇన్వెస్ట్ చేస్తుంటారు. ద్రవ్యోల్బణం పెరిగినా కూడా వారు చింత లేకుండా జీవిస్తుంటారు.