జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వస్తే మార్కెట్ లోకి 2 లక్షల కోట్ల రూపాయలు వచ్చి చేరతాయనేది కేంద్రం అంచనా. నిజంగానే రూ. 2 లక్షల కోట్ల మేర ప్రజలకు మేలు జరుగుతుందా? పోనీ ప్రజలకు జరగకపోయినా వ్యాపారులకయినా జరుగుతుందా? లేక ఇదంతా కేవలం ప్రచారమేనా? అసలు సెప్టెంబర్ 22 తర్వాత ఏం జరుగుతుంది, సగటు మధ్యతరగతి జీవికి నెలవారీ ఎంత మిగులుతుంది? దీనిపై జరిగిన సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలివే.
మిగిలేది ఎంత?
ఈనెల 22 నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వస్తున్నాయి. అయితే అంతకు ముందే కొన్ని కంపెనీలు జీఎస్టీ తగ్గింపులకు అనుగుణంగా ఆఫర్లు మొదలు పెట్టాయి. వీటివల్ల సగటు మధ్యతరగతి మనిషికి లాభమేంటి? అసలు జీఎస్టీ సంస్కరణల వల్ల గృహస్తులకు ఎంత మేలు జరుగుతుంది? నెలవారీ ఎంత మిగులు కనపడుతుంది? నిత్యావసరాల విషయంలో జీఎస్టీ లెక్కలు తీస్తే సగటు కుటుంబానికి ఎంత మిగులుతుందనేది తెలుస్తుంది. ప్రస్తుతం జీఎస్టీ 5 శాతం పన్ను పరిధిలోని వస్తువుల వాటా దాదాపు మూడు రెట్లు పెరిగింది. వీటి సంఖ్య గతంలో 54 కాగా, ఇప్పుడు ఎక్కువ పన్ను ఉన్నవాటిని కూడా 5 శాతం లిస్ట్ లో చేర్చారు. దీంతో ఆ వస్తువుల సంఖ్య 149కి పెరిగింది. దీనివల్ల గ్రామీణ వినియోగదారుపై జీఎస్టీ భారం 6.03 శాతం నుంచి 4.27 శాతానికి తగ్గుతుంది. అదే సమయంలో పట్టణ వినియోగదారులపై జీఎస్టీ భారం 6.38 శాతం నుంచి 4.38 శాతానికి తగ్గుతుంది. అంటే దీన్నిబట్టి ప్రతి వ్యక్తికి నెలకు రూ.58 నుంచి రూ.88 మిగులుతుందని అర్థం.
వ్యాపార వర్గాలకు కూడా లాభం..
MSMEల కోసం, ట్రాక్టర్లు, ఎరువులు, వస్త్రాలు, హస్తకళలు, ఆటోమొబైల్ విడిభాగాలపై కూడా జీఎస్టీ సంస్కరణల ప్రభావం కనపడుతుంది. విలోమ సుంకాలనేవి ఉండకపోవడంతో MSMEలకు వర్కింగ్ కేపిటల్ పెరుగుతుంది. దేశీయ, ప్రపంచ మార్కెట్లలో వ్యాపారుల మధ్య పోటీ తత్వం పెరుగుతుంది. జీఎస్టీ వల్ల గతంలో అధిక పన్నురేట్లు ఉండటంతో అక్రమ వాణిజ్యం జరిగిందని, స్మగ్లింగ్ అనేది పెరిగిందనే అంచనాలున్నాయి. పన్ను శ్లాబ్ లు తగ్గించడంతోపాటు, ధరల అంతరాలను తగ్గించడంతో అక్రమ వాణిజ్యం ఉండదని, చట్టబద్ధమైన వ్యాపారలకు ఇది మార్గం సుగమం చేస్తుందని అంటున్నారు.
నష్టం ఎవరికి?
జీఎస్టీ సంస్కరణల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని కోల్పోతాయని ప్రాథమిక అంచనా. అయితే సంస్కరణల వల్ల పన్ను వసూళ్లు తగ్గినా, పన్ను కట్టవారి సంఖ్య పెరుగుతుంది. అంటే ఆదాయం విషయంలో ప్రభుత్వాలు పెద్దగా నష్టపోయేదేమీ ఉండదని అంటున్నారు. 2018–19లో జీఎస్టీ వసూళ్లు రూ. 11.78 లక్షల కోట్లు కాగా, 2024–25 నాటికి అవి రూ.22.09 లక్షల కోట్లకు పెరిగాయి. పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2017లో 66.5 లక్షలు కాగా, 2025లో ఆ సంఖ్య 1.51 కోట్లకు పెరిగింది. వినియోగదారుల వ్యయం పెరగడంతో ప్రభుత్వాలకు ఆమేర లాభం వస్తుందని అంచనా వేస్తున్నారు.
మొత్తానికి జీఎస్టీ సంస్కరణల వల్ల ఏవేవో అద్భుతాలు జరిగిపోతాయని అనుకోలేం. కార్ల ధరలు, బైక్ ల ధరలు తగ్గుతున్నాయని సంబరపడలేం. టీవీలు, ఫ్రిడ్జ్ లు మరింత చౌకగా వస్తాయని మురిసిపోలేం. రాగా పోగా సగటు వినియోగదారుడికి నెలకు రూ.58 నుంచి రూ.88 వరకు మిగులు కనపడుతుందనేది మాత్రం వాస్తవం.