ప్రతి మనిషి జీవితంలో ఆర్థిక క్రమశిక్షణ అనేది తప్పనిసరి లేకపోతే వారి జీవితం అగమ్య గోచారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక మనిషి జీవితంలో రాబోయే కాలంలో ప్రణాళిక బద్ధంగా చక్కటి ప్లానింగ్ తో జీవించాలి అనుకున్నట్లయితే, పొదుపుతో పాటు మదుపు కూడా చేయడం వల్ల భవిష్యత్తు అవసరాలకు డబ్బులు సమకూర్చుకోవచ్చు. ఉదాహరణకు ఈ సంవత్సరం ఒక లక్ష రూపాయలకు ఉన్న విలువ, సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత ఆ ఒక లక్ష రూపాయలకు విలువ తగ్గిపోతుంది, దీనినే ద్రవ్యోల్బణ ప్రభావం అని పిలుస్తారు. అంటే మీరు పొదుపు చేసిన మొత్తం భవిష్యత్తులో విలువ తగ్గిపోవడం వల్ల మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అదే సమయంలో మీరు పొదుపుతో పాటు మదుపు కూడా చేసినట్లయితే, కాంపౌండింగ్ ఎఫెక్ట్ ద్వారా మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు అనేక రెట్లు పెరుగుతుంది. తద్వారా మీరు ద్రవ్యోల్బణం ప్రభావం నుంచి బయటపడవచ్చు. మదుపు చేయాలి అనగానే అందరికీ గుర్తొచ్చేది స్టాక్ మార్కెట్ మాత్రమే. నిజానికి స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టినట్లయితే, ఇబ్బందులు తలెత్తడం సహజం. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్ రూపంలో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించినట్లయితే, రిస్క్ తక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు.
మార్కెట్ పట్ల మీరు పూర్తిస్థాయిలో . అవగాహనతో పోర్టుఫోలియాను నిర్మించుకోవాల్సిన అవసరం ఉండదు. మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు పోర్టుఫోలియో నిర్మించి మీ డబ్బును ఎంపిక చేసిన షేర్లు పెట్టుబడి పెడతారు. తద్వారా ఈక్విటీ మార్కెట్ల నుంచి మీరు పరోక్షంగా లాభాలను పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి అనేది ఒకే సారి లంప్సం రూపంలోనూ, అదే సమయంలో మొత్తంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
రూ. 10 కోట్ల ఫండ్ కోసం నెలకు ఎంత SIP చేయాలి…
ప్రస్తుతం ఒక వ్యక్తి జీవితంలో 10 కోట్ల రూపాయలు కూడా పెట్టాలంటే ప్రతినెలా ఎంత డబ్బు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం. ఉదాహరణకు ప్రతినెల పదివేల రూపాయలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే 10 కోట్ల రూపాయలు సంపాదించగలిగే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం 12 శాతం రాబడి లెక్కన చూసినప్పటికీ, మీ కెరీర్ ప్రారంభం నుంచి రిటైర్మెంట్ వరకు 35 సంవత్సరాలు గనుక ప్రతినెల పదివేల రూపాయల చొప్పున సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు 10 కోట్ల రూపాయల ఫండ్ తయారు చేసుకోవచ్చు.
నిజానికి కెరీర్ ప్రారంభంలో ప్రతినెల పదివేల రూపాయలు మదుపు చేయడం అనేది కాస్త సవాలే అని చెప్పవచ్చు. కానీ రాను రాను ఆర్థిక భారం వేతనం పెరిగే కొద్దీ తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు క్రమశిక్షణతో తప్పనిసరిగా పెట్టుబడులు పెట్టినట్లయితే, 10 కోట్ల రూపాయల ఫండ్ లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమైతే కాదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ మార్కెట్స్ తో అనుసంధానమై ఉంటాయి కనుక మీ పెట్టుబడులపై రిస్క్ అనేది ఉంటుంది. కనుక మ్యూచువల్ ఫండ్స్ లో కూడా పెట్టుబడి పెట్టే ముందు, ఆర్థిక సలహాదారుడు సలహాలు తీసుకుంటే మంచిది.