ఫాల్స్ ప్రిస్టేజ్. భారత్ లో ముఖ్యంగా మిడిల్ క్లాస్ లో చాలామందికి అనుభవంలోని విషయమే ఇది. అవసరాన్ని మించి ఆడంబరాలకు పోవడం, అవసరాన్ని మించి అప్పులు చేయడం, అవసరాన్ని మించి ఖర్చులు పెంచుకోవడం. దీనివల్ల మిడిల్ క్లాస్ మునిగిపోతుందనే విషయం అందరికీ తెలిసిందే. తప్పని తెలిసినా ఎవరూ తగ్గరు, తమని తాము తగ్గించుకోవాలనుకోరు. తెలిసి తెలిసీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు, ఇంకా కూరుకుపోతూనే ఉన్నారు. మోనిష్ గోసర్ అనే ప్రముఖ ఆర్థిక వేత్త ఈ విషయాలను మరింత కఠినంగా మనకి చెబుతున్నాడు. ఆయన మాటలు వింటే మిడిల్ క్లాస్ ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిందే. లేకపోతే మన తప్పులకు మనల్ని మనమే నిందించుకుంటూ జీవితం గడపాల్సిందే.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రోజు రోజుకీ పెరిగిపోతున్న రేట్లు, పెరుగుతున్న అద్దెలు, నిత్యావసరాల ధరులు… ఇవే మనకు జీవితంలో పెద్ద సమస్యలు. కానీ వీటికంటే పెద్ద సమస్యలు వేరే ఉన్నాయని, వాటిని మనం కొని తెచ్చుకుంటున్నామని అంటున్నారు గోసర్. ఇబ్బడిముబ్బడిగా స్వైప్ చేస్తున్న క్రెడిట్ కార్డ్ లు, అవసరం లేకపోయినా తీసుకుంటున్న పర్సనల్ లోన్స్, ఆడంబరాలకోసం ఖరీదు చేస్తున్న కాస్ట్ లీ కార్లు.. ఇవే మిడిల్ క్లాస్ కి ఉన్న ప్రధాన సమస్యలు. వీటి విషయంలో మనల్ని ఎవరూ బలవంతం చేయడం లేదు. మనకు మనమే కొరివితో తల గోక్కుంటున్నాం. ఆ తర్వాత తీరిగ్గా అందర్నీ నిందిస్తున్నాం. గోసర్ మాటల్లో చెప్పాలంటే.. “బ్యాంకులు మనకు కేవలం తాళ్లు మాత్రమే ఇస్తున్నాయి. వాటితో మన ఉరిని మనమే సిద్ధం చేసుకుంటున్నాం.”
ఈఎంఐ – ఈగో.. ఈ రెండిట్నీ జంట పదాలుగా వాడుతున్నారు గోసర్. ఈగో వల్ల మనం ఈఎంఐలు పెంచుకుంటూ పోతున్నాం. ఒకానొక దశలో మనకు వచ్చే ఆదాయం అంతా ఈఎంఐలకే సరిపోయేలా చేసుకుంటున్నాం. లెక్కకు మించి మనం అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ ఆదాయాన్ని పోగొట్టుకుంటున్నామని చెబుతున్నారు గోసర్. భారతీయులు చేసిన క్రెడిట్ కార్డ్ అప్పు నాలుగేళ్లలో రూ.2.92 లక్షల కోట్లకు పెరిగిందని, పర్సనల్ లోన్స్ 75శాతం పెరిగాయని.. ఇవి ప్రమాదకరమైన గణాంకాలని అంటున్నారు గోసర్. అయితే ఇక్కడ ఏ బ్యాంక్ కూడా పర్సనల్ లోన్ తీసుకోవాలని బలవంతం చేయలేదని, ఏ క్రెడిట్ కార్డ్ వ్యవస్థ కూడా బలవంతంగా ఎవర్నీ ఫలానా వస్తువు కొనాలని చెప్పలేదని.. ఇది మనకై మనం చేసుకున్నదేనని ఆయన అంటున్నారు.
మిడిల్ క్లాస్ కి నిజమైన ఇబ్బంది ద్రవ్యోల్బణంతో కాదని, అవసరం లేకపోయినా కొనే వస్తువులతోనేనని గోసర్ అంటున్నారు. ఏడాదికి 15 లక్షల రూపాయలు సంపాదించే తన స్నేహితుడు.. ఇప్పుడు మంచి కారే వాడుతున్నాడని, కానీ దానికి మింజి లగ్జరీ కారు కోసం అతను రూ.10లక్షలు అప్పు చేశాడని ఉదాహరణగా చెప్పాడు గోసర్. అంటే తన ఏడాది జీతాన్ని కారుకోసం, దాని మెయింటెనెన్స్ కోసం ఖర్చు చేయడానికి అతడు సిద్ధపడ్డాడని అక్కడే అతను అప్పుల ఊబిలో కూరుకుపోడానికి రెడీ అయ్యాడని వివరించాడు.
ఇన్వెస్టర్ సౌరభ్ ముఖర్జియా కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. భారతదేశంలోని 5 నుంచి 10శాతం మంది మధ్యతరగతి ప్రజలు అప్పుల చక్రంలో చిక్కుకున్నారని ఆయన హెచ్చరించారు. అయితే ఈ అప్పులు, ఆస్తుల్ని పెంచుకోడానికి చేయడం లేదని, కేవలం లగ్జరీ కోసం మాత్రమే చేస్తున్నారని అన్నారు. వ్యక్తిగత జవాబుదారీ తనం పెరిగితేనే ఇలాంటి వాటిని కట్టడి చేయొచ్చని అంటున్నారు ఆర్థిక వేత్తలు.