Property Inheritance Bribes in India| కుటుంబంలో ఒకరిని కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఆ బాధ నుంచి కోలుకోకముందే కుటుంబ సభ్యులు ఎన్నో పనులు పూర్తి చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మరణించిన వ్యక్తి పేరుతో ఉన్న ఇల్లు, భూమి, బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, నగలు వంటి ఆస్తులను వారసుల పేర్లకు మార్చాలి. అయితే ఈ ప్రక్రియలో చాలా మందికి మరో ఊహించని భారం కూడా మోయాల్సి వస్తుంది. ఆ భారమే లంచాలు.
లోకల్ సర్కిల్స్ అనే సామాజిక సంస్థ నిర్వహించిన సర్వేలో ఆస్తుల బదిలీ చేసిన కుటుంబాల్లో 58 శాతం మంది లంచాలు చెల్లించామని తెలిపారు. ఈ సమస్య ఒక్క ప్రభుత్వ కార్యాలయానికే పరిమితం కాలేదు. అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో డబ్బు ఇవ్వాల్సి వచ్చిందని సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు. ఆస్తుల బదిలీ ప్రక్రియ సులభంగా జరిగిందని కొద్దిమంది మాత్రమే చెప్పారు.
లోకల్ సర్కిల్స్ సర్వేకు 349 జిల్లాల నుంచి 32,000 మందికి పైగా స్పందించారు. ఆస్తుల బదిలీ అనుభవం గురించి సమాధానం ఇచ్చిన 11,319 మందిలో కేవలం 32 శాతం మంది మాత్రమే ప్రక్రియ సులభంగా ఉందన్నారు. సుమారు 11 శాతం మంది రిజిస్టర్డ్ విల్ ఉండటంతో బదిలీ సులభంగా పూర్తయిందని చెప్పారు. మరో 21 శాతం మంది విల్ లేకపోయినా బదిలీ పూర్తి చేశారు. అయితే 16 శాతం మంది రిజిస్టర్డ్ విల్ ఉన్నప్పటికీ బదిలీ పూర్తి చేయలేకపోయారు. మరో 21 శాతం మంది విల్ లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ సర్వేలో మరో ఆందోళనకరమైన విషయం కూడా వెల్లడైంది. 2022లో 52 శాతం కుటుంబాలు ఆస్తుల బదిలీలో లంచాలు చెల్లించామని చెప్పాయి. తాజా సర్వేలో ఈ సంఖ్య 58 శాతానికి పెరిగింది. అంటే డిజిటలైజేషన్ పెరుగుతున్నప్పటికీ సమస్య పూర్తిగా తగ్గలేదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
లంచాలు చెల్లించిన కుటుంబాల్లో 73 శాతం మంది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ లేదా భూమి యజమాన్య హక్కుల ట్రాన్స్‌ఫర్ ఆఫీసుల్లో డబ్బు చెల్లించామని చెప్పారు. కొంతమంది ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా లంచాలు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం కుటుంబాలకు సమయం, డబ్బు రెండూ ఖర్చు అవుతాయని, మానసికంగా అలసట కలిగించే ప్రక్రియ అని తెలిపారు.
ప్రస్తుత వ్యవస్థలో కొన్ని సందర్భాల్లో పత్రాలు, ఫొటోలు, వేలిముద్రలు, వ్యక్తిగత హాజరు వంటి ప్రక్రియలు అవసరమవుతున్నాయి. ప్రభుత్వం ఆస్తుల బదిలీ, విక్రయాలక సంబంధించిన డ్రాఫ్ రిజిస్ట్రేషన్ బిల్ (Draft Registration Bill) 2025 ఈ ప్రక్రియలను మరింత డిజిటల్‌గా మార్చాలని ప్రతిపాదిస్తోంది. ఇందులో ఆన్‌లైన్ పత్రాల సమర్పణ, ఎలక్ట్రానిక్ ధృవీకరణ, డిజిటల్ సర్టిఫికెట్లు వంటి మార్పులు ఉన్నాయి. అయితే ఈ బిల్లు ఇంకా చట్టంగా మారలేదు.
Also Read: కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి
ఆస్తుల బదిలీ సమస్య కేవలం ఇల్లు, భూమికే పరిమితం కాదు. బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బ్రోకరేజ్ ఖాతాలు వంటి ఆర్థిక ఆస్తులు కూడా బదిలీ చేయాలి. నామినీ రిజిస్టర్ చేసినంత మాత్రాన ఆస్తికి తుది వారసత్వ హక్కు నిర్ణయమవుతుందని చెప్పలేం. చట్టపరమైన వారసత్వ నిబంధనలు కూడా కీలకంగా ఉంటాయి.
క్లిష్టమైన బదిలీ ప్రక్రియల కారణంగా కొంతమంది కుటుంబాలు తమకు చెందిన ఆస్తులను క్లెయిమ్ చేయలేకపోతున్నాయి. 2026 ఫిబ్రవరి 28 నాటికి బ్యాంక్ అధికారులు.. 22.95 లక్షల క్లెయిమ్‌ల ద్వారా రూ.5,777 కోట్లను తిరిగి అందించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వారసులు తిరగకుండా, ఆస్తుల బదిలీని పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించగలిగే సిస్టమ్ చాలా అవసరం. వారసత్వం కుటుంబానికి మరో సమస్యగా మారకుండా, పారదర్శకంగా, సులభంగా ఆస్తులు బదిలీ అయ్యే విధానం ఉండాలి.
Also Read: PPF vs SIP.. నెలకు రూ.10,000 పెట్టుబడి చేసేందుకు ఏది లాభదాయకం?