AI Bubble And Economic Recession| ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో భారీ మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు ఏఐ అభివృద్ధి కోసం వేల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. డేటా సెంటర్లు, కంప్యూటర్ చిప్స్, అడ్వాన్స్ ఏఐ మోడల్స్ తయారీకి భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే ఈ పెట్టుబడులు ఆశించిన స్థాయిలో లాభాలను అందిస్తాయా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) చైర్మన్ గ్యారీ జెన్స్లర్ కీలక హెచ్చరిక చేశారు. ఏఐ రంగంలో ఏర్పడుతున్న బబుల్ పగిలితే 2028కు ముందే ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
గ్యారీ స్కాట్ జెన్స్లర్ ఒక అమెరికన్ మాజీ ప్రభుత్వ అధికారి, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. 2021 నుంచి 2025 వరకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. జెన్స్లర్ ప్రకారం.. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం బబుల్ పరిస్థితికి చేరుకుంటోంది. ఈ విషయంపై ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఏఐ మౌలిక సదుపాయాల కోసం కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని అంచనాల ప్రకారం.. ఈ రంగంలో వార్షిక పెట్టుబడులు 800 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మూడేళ్ల క్రితంతో పోలిస్తే 2026లో టెక్నాలజీ కంపెనీల ఖర్చులు 5 రెట్లు పెరిగాయని ఆయన వివరించారు.
ఏఐ బబుల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీలపై పెట్టుబడిదారులు భారీగా డబ్బు పెట్టుబడి పెట్టడం. భవిష్యత్తులో ఈ కంపెనీలు భారీ లాభాలు అందిస్తాయని పెట్టుబడి చేసిన వారు ఆశిస్తారు. దీంతో కంపెనీల విలువ, వాటి షేర్ల ధరలు వాస్తవ వ్యాపార విలువ కంటే చాలా ఎక్కువగా పెరగవచ్చు.
ఒక ఏఐ కంపెనీ వ్యాపార పనితీరు ప్రకారం.. వాస్తవ విలువ 10 బిలియన్ డాలర్లు ఉందని అనుకుందాం. అయితే పెట్టుబడిదారులు ఆ కంపెనీపై అతిగా ఆశలు పెట్టుకుని దాని విలువను 100 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తారు. ఇక్కడే ఆర్థిక బుడగ ఏర్పడుతుంది. ఎందుకంటే కంపెనీ మార్కెట్ విలువ దాని వాస్తవ ఆర్థిక స్థితి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.
1. ఏఐ కంపెనీలు ఆశించిన స్థాయిలో లాభాలు సంపాదించడం లేదని పెట్టుబడిదారులు గుర్తిస్తారు.
2. వెంటనే తమ షేర్లను విక్రయించడం ప్రారంభిస్తారు.
3. దీంతో షేర్ల ధరలు భారీగా పడిపోతాయి.
4. కంపెనీల మార్కెట్ విలువ తగ్గి, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
5. కొన్ని కంపెనీలు మూతపడవచ్చు లేదా దివాలా తీయవచ్చు.
6. బ్యాంకులు, పెట్టుబడిదారులు కూడా భారీ నష్టాలను ఎదుర్కోవచ్చు.
సులభంగా చెప్పాలంటే.. AI బబుల్ అంటే గాలిని అతిగా నింపిన బెలూన్ లాంటిది. ఆ బెలూన్ ఎప్పుడు పగులుతుందో తెలియనట్లే, AI రంగంలో అధిక పెట్టుబడుల వల్ల ఎప్పుడు సంక్షోభం వస్తుందో చెప్పలేం. ఒకవేళ ఈ బుడగ పగిలితే కంపెనీలు, పెట్టుబడిదారులు భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు అత్యాధునిక ఏఐ మోడల్స్ అభివృద్ధి చేయడానికి పోటీపడుతున్నాయి. ఇందుకోసం భారీ డేటా సెంటర్లు నిర్మిస్తూ ఖరీదైన చిప్స్ కొనుగోలు చేస్తున్నాయి.
అయితే పెట్టుబడులకు తగ్గట్టుగా ఆదాయం రాకపోతే సమస్యలు మొదలవుతాయని జెన్స్లర్ హెచ్చరిస్తున్నారు. గతంలో రైల్వే, విద్యుత్ రంగం, 1990ల ఇంటర్నెట్ బూమ్ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అధిక పెట్టుబడుల తర్వాత ఆయా రంగాలు ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. కంపెనీలు తీసుకుంటున్న రుణాలు, సంక్లిష్టమైన ఆర్థిక ఒప్పందాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి వల్ల అసలు ఆర్థిక ప్రమాదాలను అంచనా వేయడం కష్టమవుతోంది.
జెన్స్లర్ అభిప్రాయం ప్రకారం.. చిన్న క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీలు ముందుగా సమస్యలను ఎదుర్కోవచ్చు. వీటిని నియోక్లౌడ్ కంపెనీలు అంటారు. ఏఐ కంపెనీలకు అవసరమైన కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ఇవి అందిస్తాయి. ఈ కంపెనీలు మౌలిక సదుపాయాల విస్తరణ కోసం భారీగా అప్పులు చేస్తున్నాయి. ఏఐ సేవలకు డిమాండ్ తగ్గితే ఆదాయం పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో కొన్ని సంస్థలు దివాలా తీసే పరిస్థితి రావచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.
2000ల ప్రారంభంలో ఇంటర్నెట్ కంపెనీల విలువలు పడిపోవడంతో డాట్‌కామ్ సంక్షోభం ఏర్పడింది. ప్రస్తుత ఏఐ పరిస్థితి కూడా అలాంటి పరిణామాలకు దారితీయవచ్చని జెన్స్లర్ భావిస్తున్నారు. అయితే 2008 ఆర్థిక సంక్షోభం స్థాయిలో నష్టం ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 2028 నవంబర్‌కు ముందే ఆర్థిక మందగమనం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
Also Read: సామాన్యుడి జేబుకు చిల్లు.. కిరాణా సరుకులే కాదు ఈ రోజువారీ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి
ఏఐ కంపెనీ ఆంత్రోపిక్ త్వరలో స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. ఈ కంపెనీ అభివృద్ధి చేసిన క్లాడ్ ఏఐ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దీని ఐపిఓ విజయవంతమవుతుందా అనేది పెట్టుబడిదారులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ పరిణామాలే ఏఐ రంగంపై పెట్టుబడిదారుల నమ్మకాన్ని ప్రభావితం చేయవచ్చు.
Also Read: రాజీనామా చేద్దామనుకున్న ఉద్యోగి.. 15 నెలల జీతం ఇచ్చి స్వయంగా తొలగించిన కంపెనీ
అందరూ జెన్స్లర్ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. యార్డేని రీసెర్చ్ ప్రెసిడెంట్ ఎడ్ యార్డేని భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఐ షేర్ల ధరలు తగ్గడం అంటే మార్కెట్ పూర్తిగా కుప్పకూలుతుందని అర్థం కాదని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడిదారులు ఇప్పటికే టెక్నాలజీ రంగంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని వివరించారు.
ఏఐ రంగం భవిష్యత్తులో భారీ లాభాలను అందిస్తుందా? లేక అధిక పెట్టుబడుల కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటుందా? అనేది రాబోయే సంవత్సరాల్లో తేలనుంది.