Success Story| వేసవి వచ్చిందంటే చాలు.. చాలామందికి ముందుగా గుర్తొచ్చేది చల్లని కూల్‌డ్రింక్. కోకాకోలా, పెప్సీ, స్ప్రైట్ వంటి విదేశీ బ్రాండ్లు భారతీయ మార్కెట్‌ను ఏళ్లుగా ఏలుతున్నాయి. కానీ మన వీధుల్లో, చిన్న హోటళ్లలో దొరికే జీరా సోడా, లెమన్ వాటర్, శికంజీ వంటి డ్రింక్స్ కోరుకునే వారు ఎక్కువ మంది ఉన్నారు. ఈ చిన్న అవకాశాన్నే వ్యాపారంగా మార్చుకున్నారు ముగ్గురు కజిన్స్. కేవలం రూ.10 ధరతో ప్రారంభమైన లహోరి జీరా ఇప్పుడు సుమారు రూ.775 కోట్ల ఆదాయం సాధించే స్థాయికి చేరింది. అసలు ఈ ముగ్గురు యువకులు సంప్రదాయ పానీయాలతో ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు?
సౌరభ్ ముంజాల్, సౌరభ్ భుట్నా, నిఖిల్ దోడా అనే ముగ్గురు కజిన్స్ 2017లో లహోరి జీరా బ్రాండ్‌ను ప్రారంభించారు. వీరంతా పంజాబ్‌లో పుట్టి పెరిగారు. చిన్నప్పటి నుంచి జీరా సోడా, శికంజీ, లెమన్ వాటర్ వంటి సంప్రదాయ పానీయాలను ఆస్వాదించేవారు.
అయితే మార్కెట్లో విదేశీ కూల్‌డ్రింక్స్ ఎక్కువగా కనిపించేవి. దీనికి కారణం వాటి బ్రాండ్ అని ఈ ముగ్గురూ గుర్తించారు. మన దేశీయ పానీయాలకు పెద్దగా బ్రాండెడ్ గుర్తింపు ఉండేది కాదు. ఈ పరిస్థితిలోనే ముగ్గురికీ ఒక కొత్త వ్యాపార ఆలోచన వచ్చింది.
2016లో నిఖిల్ దోడా నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, నిమ్మరసంతో కొత్త పానీయం తయారు చేశారు. ఆయనకు పానీయాల తయారీలో గతంలో ఎలాంటి అనుభవం లేదు. అయినప్పటికీ, రుచి విషయంలో అనేక ప్రయోగాలు చేశారు. తర్వాత స్థానిక కిరాణా దుకాణదారులు, టీ స్టాల్ నిర్వాహకులు, కాలేజీ విద్యార్థులు, ఆటో డ్రైవర్లకు పానీయాలను రుచి చూపించారు. వారి అభిప్రాయాలతో రుచిని మెరుగుపరిచారు.
సెకండ్‌హ్యాండ్ యంత్రాలు కొనుగోలు చేసి రిపేర్ చేయించారు. పంజాబ్‌లో చిన్న తయారీ కేంద్రంతో ఉత్పత్తిని ప్రారంభించారు. 160 మిల్లీలీటర్ల బాటిల్‌ను కేవలం రూ.10కే విక్రయించారు.
పాకిస్తాన్‌లోని ఓ నగరం పేరు లాహోర్. లహోర్, భారత పంజాబ్‌కు చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. ఈ అనుబంధాన్ని గుర్తుచేసేలా వ్యవస్థాపకులు తమ బ్రాండ్‌కు లహోరి జీరా అనే పేరు పెట్టారు. ఇందులోని ‘జీరా’ అంటే జీలకర్ర. భారతీయ వంటకాల్లో ఇది ముఖ్యమైన పదార్థం. ఈ పేరు సంప్రదాయ రుచిని, పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది.
ఎన్‌ట్రాకర్ నివేదిక ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.312 కోట్ల ఆదాయం సాధించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం రూ.540 కోట్లకు చేరింది. 2025 మేలో మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ నుంచి రూ.200 కోట్ల పెట్టుబడిని సేకరించింది. ఈ పెట్టుబడితో కంపెనీ విలువ సుమారు రూ.2,800 కోట్లకు చేరింది. ది క్యాప్టేబుల్ నివేదిక ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు రూ.775 కోట్ల ఆదాయం, రూ.60 కోట్ల గ్రాస్ ప్రాఫిట్ నమోదు చేసింది. ఇప్పుడు కంపెనీ బ్రాండ్ విలువ రూ.2800 కోట్లు.
Also Read: ఇల్లు కొనుగోలు చేస్తున్నారా? బిల్డర్లు ఈ విషయాల్లో మోసం చేస్తారు.. జాగ్రత్త
లహోరి జీరా ప్రస్తుతం శికంజీ, నింబూ, కచ్చా ఆమ్, గింబూ, ఇమ్లీ బంటా వంటి డ్రింక్స్ విక్రయిస్తోంది. ఆర్చియన్ ఫుడ్స్ ఈ బ్రాండ్‌కు చెందిన జీరా బేస్ డ్రింక్స్ తయారు చేస్తోంది. ప్రారంభంలో 20 మందితో మొదలైన సంస్థ ఇప్పుడు 1,800 మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందితో విస్తరించింది. ప్రస్తుతం కంపెనీ ప్రధాన లక్ష్యం తయారీ సామర్థ్యాన్ని పెంచడం, పంపిణీ వ్యవస్థను విస్తరించడం. డిమాండ్‌కు తగినంత ఉత్పత్తి చేయలేకపోతున్నామని వ్యవస్థాపకుడు సౌరభ్ ముంజాల్ 2026 ఏప్రిల్‌లో వెల్లడించారు.
చిన్ననాటి రుచులను ఆధునిక బాటిళ్లలో అందించడం ద్వారా లహోరి జీరా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. సరైన ఆలోచన, నాణ్యత, అందుబాటు ధర ఉంటే సంప్రదాయ ఉత్పత్తులతో కూడా భారీ వ్యాపారం నిర్మించవచ్చని ఈ సంస్థ నిరూపించింది.