Pahalgam Terror Attack: నెమలిలా ప్రకృతి అందాలతో విరజిమ్మే కశ్మీర్… మనసును మైమరిపించే పహల్గామ్ హిల్ స్టేషన్… అక్కడి పర్వతాల నడుమ, నదుల శబ్దాల మధ్య… ప్రశాంతతలో మునిగిపోయే ప్రదేశం ఇది. కానీ ఏప్రిల్ 22, 2025న అక్కడ విన్న శబ్దాలు మాత్రం అనేక మంది కళ్ళలో నీళ్లు తెప్పించాయి. పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనేక మందిని భయాందోళనకు గురి చేసింది. 28 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు పోయాయి.
లక్షలాది మంది
పర్యాటకుల జీవితాల్లో విషాదం నింపిన ఈ దాడి, కేవలం ఒక ఘటన మాత్రమే కాదు. అక్కడి లక్షలాది మంది ప్రజల జీవనాధారమైన పర్యాటకాన్ని కూడా తుడిచిపెట్టేసేలా ఉంది. ప్రకృతి అందాలపై ఆధారపడిన కశ్మీర్ పర్యాటక పరిశ్రమ మళ్లీ ఎలా పుంజుకుంటుందనే ప్రశ్న అక్కడి ప్రతి ఇంట్లో వినిపిస్తోంది. ఇది కేవలం ఆ ప్రాంతానికే కాదు… దేశవ్యాప్తంగా పర్యాటక అభివృద్ధిపై ఆందోళన రేకెత్తించేలా మారింది.
కశ్మీర్ పర్యాటక పరిశ్రమ
కశ్మీర్ పర్యాటక పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి సంవత్సరం దాదాపు రూ. 12,000 కోట్ల ఆదాయం ఈ పరిశ్రమ ద్వారా వస్తుంది. 2030 నాటికి ఈ పరిశ్రమ ఆదాయం రూ. 25,000 కోట్ల నుంచి రూ. 30,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. కశ్మీర్ రాష్ట్ర జీడీపీలో పర్యాటక రంగం సుమారు 7-8 శాతం వాటాను కలిగి ఉంది.
పర్యాటకుల ప్రియమైన గమ్యం
పహల్గామ్ ప్రాంతం “ఇండియాకు స్విట్జర్లాండ్” అని పిలవబడుతుంది. అల్పైన్ మైదానాలు, పైన్ అరణ్యాలు, మంచుతో కప్పబడిన కొండలు, ట్రెక్కింగ్ మార్గాలు వంటి ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతం అమర్నాథ్ యాత్ర మార్గంలో భాగంగా ఉంది. ఇది ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది.
Read Also: Redmi Watch Move: వచ్చేసింది పవర్ ఫుల్ స్మార్ట్ వాచ్.. …
ఉగ్రదాడి ప్రభావం
ఈ ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్ పర్యాటక పరిశ్రమపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. పర్యాటకులు భయంతో పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. హోటళ్లు, టాక్సీలు వంటి సేవల బుకింగ్స్ కూడా భారీగా రద్దవుతున్నాయి. ఇది స్థానికుల ఆర్థిక పరిస్థితిని మరింత కష్టతరం చేస్తుంది.
ప్రభుత్వ చర్యలు
ఈ దాడికి ప్రతిస్పందనగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలోని తన పర్యటనను మధ్యలోనే ముగించుకుని ఢిల్లీకి తిరిగి వచ్చారు. హోమ్ మంత్రి అమిత్ షా ఈ ప్రాంతాన్ని సందర్శించి, భద్రతా చర్యలను పటిష్టం చేశారు. సుమారు 100 మంది అనుమానితులను ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు. ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక విమాన సేవలు ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఈ దాడికి పాల్పడిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. కానీ ప్రజల భయాన్ని పొగొట్టేందుకు ఎలాంటి చర్యలు తీసకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
స్థానికుల జీవనాధారం
కశ్మీర్ ప్రాంతంలో 1,500కు పైగా హౌస్‌బోట్లు, 3,000 గదుల సామర్థ్యం కలిగిన హోటళ్లు ఉన్నాయి. ఈ పరిశ్రమలో వేలాది మంది స్థానికులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పనిచేస్తున్నారు. పర్యాటకుల రద్దులు, సేవల తగ్గుదల కారణంగా వారి జీవనాధారం తీవ్రంగా ప్రభావితమవుతోంది.
భవిష్యత్తు
ఈ దాడి కశ్మీర్ పర్యాటక పరిశ్రమకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ప్రభుత్వం భద్రతా చర్యలను పటిష్టం చేయడం, పర్యాటకుల నమ్మకాన్ని తిరిగి పొందడం కోసం చర్యలు తీసుకోవాలి. స్థానికుల జీవనాధారాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు అవసరం. పర్యాటకులు, ప్రభుత్వాలు, స్థానికులు కలిసి కృషి చేస్తే, ఈ సంక్షోభం నుంచి బయటపడే ఛాన్సుంది.