Internet Speed: ఇండియాలో ఇప్పటికే అనేక చోట్ల ఇంటర్ నెట్ సమస్యలు వస్తుంటాయి. మొబైల్ డేటా స్పీడ్ నెమ్మదిగా రావడం వల్ల అనేక మంది చిరాకు పడ్తుంటారు. 5G టెక్నాలజీ వచ్చినా కూడా స్పీడ్ మాత్రం అంతంత మాత్రమేనని చెప్పవచ్చు. కానీ జపాన్ నెట్ టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచానికి మరోసారి షాక్ ఇచ్చేలా చేసింది. తామేంటో మరోసారి రుజువు చేసింది. ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియని కాలం నుంచి, ఇప్పుడు క్షణాల్లో ప్రపంచాన్ని తిప్పేసే ఇంటర్నెట్ వేగానికి వచ్చేసింది.
కేవలం సెకనుకు
జపాన్‌లోని జాతీయ సమాచార, సమాచార సాంకేతిక సంస్థ (NICT) సాధించిన ఈ ఫీట్ ఏకంగా 402 టెరాబిట్స్ పర్ సెకండ్ (Tbps). దీన్ని సాధించేందుకు వారు వాడింది మనం సాధారణంగా ఉపయోగించే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ మాత్రమే. ఇది తెలిసిన టెక్ ప్రపంచం ఇప్పుడు ఈ కొత్త ఇంటర్నెట్ స్పీడ్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. దీంతోపాటు సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ వేగం ఎంత గొప్పదంటే, 402 Tbps అంటే 402 మిలియన్ Mbps. ఒక్క సెకండులో 12,500 HD సినిమాలను డౌన్‌లోడ్ చేయగల సామర్థ్యం ఉంటుంది. ఇది నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీ మొత్తం కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం.
భారతీయుల ఆశ్చర్యం
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇది చూసిన అనేక మంది ఇండియన్స్ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో సగటు ఇంటర్నెట్ వేగం 64.22 Mbps ఉండగా, జపాన్ వేగం 402 Tbpsగా ఉంది. అంటే ఇది ఇండియా కంటే దాదాపు 6.3 మిలియన్ రెట్లు వేగవంతమైనది. ఇది తెలిసిన అనేక మంది భారతీయులు ఆశ్చర్యాన్ని, ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొందరు “ఇది నమ్మశక్యంగా లేదని, మరికొందరు “ఇలాంటి వేగం భారత్‌లో ఎప్పుడు వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Redmi Watch Move: వచ్చేసింది పవర్ ఫుల్ స్మార్ట్ వాచ్.. …
ఈ వేగం ఎలా సాధ్యమైంది?
NICT పరిశోధకులు సాంప్రదాయ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌తో పాటు అధునాతన యాంప్లిఫికేషన్ టెక్నాలజీలను ఉపయోగించారు. ఈ పరీక్ష మార్చి 2024లో నిర్వహించారు. ఇది 2023లో సెట్ చేసిన 321 Tbps రికార్డును అధిగమించింది. ఈ సాంకేతికత ప్రస్తుత ఫైబర్ కేబుల్స్‌తోనే అసాధారణ వేగాన్ని సాధించగలదని నిరూపించింది. దీన్ని బట్టి చూస్తే ఇది భవిష్యత్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి కొత్త అవకాశాలను అందించిందని చెప్పవచ్చు.
గ్లోబల్ ఇంపాక్ట్
ఈ వేగం స్ట్రీమింగ్, AI, గ్లోబల్ కమ్యూనికేషన్స్ వంటి రంగాలను పూర్తిగా మార్చేయగలదు. అంతేకాక, ఈ టెక్నాలజీ ఇంటర్నెట్ కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
భారత్‌లో ఇంటర్నెట్ వేగం
భారత్‌లో ఇటీవల భారతి ఎయిర్‌టెల్ 2Africa Pearls సబ్‌మెరైన్ కేబుల్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఇది 100 Tbps కంటే ఎక్కువ సామర్థ్యాన్ని అందిస్తుంది. అయినప్పటికీ, జపాన్ 402 Tbpsతో పోలిస్తే ఇది చాలా తక్కువ. భారతీయ నెటిజన్లు ఈ వార్తను చూసి, భవిష్యత్‌లో ఇలాంటి సాంకేతికత భారత్‌లో అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు.
రికార్డ్ మాత్రమే కాదు
జపాన్ 402 Tbps ఇంటర్నెట్ వేగం కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు. ఇది భవిష్యత్ డిజిటల్ ప్రపంచానికి ఒక సంకేతమని చెప్పవచ్చు. ఈ సాంకేతికత గ్లోబల్ కనెక్టివిటీని మరింత సులభతరం చేస్తుంది. భారతీయులు ఈ వార్తను ఉత్సాహంగా స్వాగతిస్తున్నారు. ఈ నెట్ స్పీడుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.