Cars price drop: దేశవ్యాప్తంగా కార్లు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. జీఎస్టీ కౌన్సిల్ తాజాగా వాహనాలపై పన్ను రేట్లను భారీగా తగ్గించింది. దాని ప్రభావం వెంటనే ఆటోమొబైల్ కంపెనీల ధరలపై పడింది. మహీంద్రా, టాటా మోటార్స్, రెనాల్ట్ ఇండియా తమ వాహనాల ధరలను గణనీయంగా తగ్గించి వినియోగదారులకు పండగ గిఫ్ట్ ఇచ్చేశాయి. సెప్టెంబర్ 6 నుంచే ఈ తగ్గింపులు అమల్లోకి వచ్చాయి. ఈసారి వాహనాల ధరలలో లక్షల రూపాయల వరకు తేడా రావడం ప్రత్యేకంగా మారింది.
ముందుగా మహీంద్రా గురించి చెప్పుకోవాలి. SUV సెగ్మెంట్‌లో టాప్ స్థాయిలో ఉండే ఈ కంపెనీ ధరల తగ్గింపుతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ఎక్స్‌యూవీ 3XO (డీజిల్) మీద గరిష్టంగా రూ.1.56 లక్షల తగ్గింపు లభిస్తోంది. అదే విధంగా స్కార్పియో-ఎన్ మీద రూ.1.45 లక్షల తగ్గింపు, ఎక్స్‌యూవీ 700 మీద రూ.1.43 లక్షల తగ్గింపు ఇచ్చారు. ఎక్స్‌యూవీ 3XO (పెట్రోల్) మీద రూ.1.40 లక్షలు, థార్ 2WD డీజిల్ మీద రూ.1.35 లక్షలు, థార్ రాక్స్ మీద రూ.1.33 లక్షలు తగ్గించారు. బొలెరో, బొలెరో నియో మీద రూ.1.27 లక్షలు తగ్గింపు లభిస్తోంది. స్కార్పియో క్లాసిక్, థార్ 4WD డీజిల్ మోడల్స్ మీద కూడా రూ.1.01 లక్షల వరకూ తగ్గింపు వరించింది. మహీంద్రా SUVల అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే.
ఇక టాటా మోటార్స్ కూడా తగ్గింపులో ఏమాత్రం వెనకబడలేదు. చిన్న కార్ల నుండి పెద్ద SUVల వరకు అన్ని మోడల్స్‌కి ధరలు తగ్గాయి. టాటా టియాగో మీద రూ.75,000 తగ్గింపు లభిస్తోంది. టిగోర్ మీద రూ.80,000 తగ్గింది. ఆల్ట్రోజ్ ధరలు రూ.1.10 లక్షలు తగ్గాయి. కంపాక్ట్ SUV పంచ్ మీద రూ.85,000 తగ్గింపు అమల్లోకి వచ్చింది. నెక్సాన్ మీద భారీగా రూ.1.55 లక్షల తగ్గింపు ప్రకటించారు. మధ్యస్థాయి మోడల్ కర్వ్ మీద రూ.65,000 తగ్గించారు. హారియర్ మీద రూ.1.40 లక్షలు, సఫారీ మీద రూ.1.45 లక్షల తగ్గింపు ఇచ్చారు. SUV సెగ్మెంట్‌లో టాటా మోడల్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ తగ్గింపుతో మరింత మంది కొనుగోలు దారులు ఆకర్షితులవుతారని చెప్పొచ్చు.
చిన్న కార్ల మార్కెట్లో మంచి స్థానం సంపాదించుకున్న రెనాల్ట్ ఇండియా కూడా ఈ తగ్గింపు జాబితాలో ఉంది. రెనాల్ట్ క్విడ్ మీద రూ.55,095 తగ్గింపు అమల్లోకి వచ్చింది. ట్రైబర్ మీద రూ.80,195 తగ్గించారు. కైగర్ మీద రూ.96,395 వరకూ తగ్గింపు ఇచ్చారు. రెనాల్ట్ వాహనాలు ముఖ్యంగా మిడిల్ క్లాస్ కుటుంబాలకు అందుబాటులో ఉండే రేంజ్‌లో ఉండటం వల్ల ఈ తగ్గింపులు వారికి మంచి ఊరటనిస్తాయి.
Also Read: Trains cancelled: 68 రైళ్లు రద్దు, 24 తిరిగి ప్రారంభం.. ఆ లైన్ లో ఊరట కలిగించిన రైల్వే ప్రకటన..!
ఈ ధరల తగ్గింపుల వెనక ప్రధాన కారణం జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న కీలక నిర్ణయం. ఇప్పటి వరకు పెట్రోల్, సిఎన్‌జి, ఎల్పీజీ కార్లు – 1200cc వరకు ఇంజిన్ కలిగినవి, 4000mm లోపు పొడవు ఉన్నవి 28% పన్ను కిందకి వచ్చేవి. ఇప్పుడు ఇవి కేవలం 18% జీఎస్టీకి తగ్గించబడ్డాయి. డీజిల్ కార్లు – 1500cc వరకు ఇంజిన్, 4000mm లోపు పొడవు ఉన్నవి కూడా ఇప్పుడు 18% పన్ను కిందకి వస్తున్నాయి. పెద్ద కార్లు, SUVలు – ఇంజిన్ సామర్థ్యం ఎక్కువగా ఉన్నవి, పొడవు 4000mm పైబడినవి గతంలో సుమారు 50 శాతం పన్ను చెల్లించేవి. ఇప్పుడు వాటికి కేవలం 40% జీఎస్టీ మాత్రమే ఉంటుంది. ఈ నిర్ణయంతో వాహన కొనుగోలు దారులకు లక్షల రూపాయల వరకూ ఆదా అవుతోంది.
ఈ ధరల తగ్గింపులు రాబోయే పండగ సీజన్‌కి వినియోగదారులకు పెద్ద గిఫ్ట్ అన్నట్టే. దసరా, దీపావళి సమయానికి కొత్త వాహనాల కొనుగోలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. బ్యాంకులు కూడా పండగ సీజన్ లోన్లపై ఆఫర్లు ఇస్తున్నాయి. ఆటోమొబైల్ కంపెనీలు ఎక్స్చేంజ్ ఆఫర్లు, ఫెస్టివల్ డిస్కౌంట్లు కలిపి మరింత బెనిఫిట్ ఇవ్వబోతున్నాయి. కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్న వారు ఈ సమయాన్ని వినియోగించుకోవడం తెలివైన నిర్ణయం అవుతుంది.
మొత్తానికి జీఎస్టీ రేట్ల తగ్గింపు ఆటోమొబైల్ రంగానికి ఒక ఊపిరి పోసింది. గత కొంతకాలంగా మందగమనం ఎదుర్కొన్న మార్కెట్‌కి ఇది కొత్త ఊపు తెచ్చే అవకాశం ఉంది. SUVలు, చిన్న కార్లు రెండింటికీ డిమాండ్ పెరగబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వినియోగదారులకు లక్ష రూపాయల వరకు లాభం కలిగించే ఈ ధరల తగ్గింపు నిజంగానే ఒక పెద్ద వరమని చెప్పాలి.