క్లాస్ మేట్స్ మధ్య గొడవలు సహజమే. గొడవల వరకు ఓకే కానీ, అవి శృతి మించి దాడుల వరకు వెళ్తేనే కష్టం. అందులోనూ ఇక్కడ దాడి చేసింది ఓ అమ్మాయి. తన క్లాస్ మేట్ ని కారులో కూర్చోబెట్టి మరీ చెంపలపై వాయించేసింది. తను కొట్టడమే కాదు, మరికొంతమంది అబ్బాయిలతో కూడా కొట్టించింది. ఆ అమ్మాయి కళ్లలో ఆనందం చూడటానికి వారు కూడా కసిగా ఆ అబ్బాయిని కొట్టారు. నిమిషం వ్యవధిలో 60సార్లు చెంపదెబ్బలు కొట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ అమ్మాయితోపాటు, ఆ దాడిలో పాల్గొన్నవారందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అతడు లా కాలేజీ స్టూడెంట్. సెకండ్ ఇయర్ ఎల్ఎల్బీ చదువుతున్నారు. పేరు శిఖర్. ఆగస్ట్ 11న లిగ్మెంట్ సర్జరీ జరగడంతో కర్ర సాయంతో నడుస్తున్నాడు. తన స్నేహితురాలితో కలసి కారులో కాలేజీకి వచ్చాడు. కార్ పార్కింగ్ ఏరియాలో అప్పటికే అతడికోసం ఓ గ్యాంగ్ కాపుకాసి ఉంది. కారు దిగగానే శిఖర్ ని రౌండప్ చేశారు. 40 నిమిషాల పాటు అతడ్ని అక్కడే ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత ఇంకో కారులో ఎక్కించారు. మధ్యలో కూర్చోబెట్టి అటు ఇటు ఉన్న వ్యక్తులు చేతులు బలంగా పట్టుకున్నారు. ముందు సీటులో ఉన్న జాన్వి మిశ్రా ముందుగా అటాక్ మొదలు పెట్టింది. శిఖర్ ని చెంపపై కొట్టింది. చెంపకు చేయి అడ్డుగా పెట్టుకోవడంతో ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చేయి కిందకు దించుతావా లేదా అంటూ మరింత ఆవేశంతో చెంపలు వాయించింది. ఆమె తర్వాత ఆయుష్ యాదవ్ అనే యువకుడు కూడా శిఖర్ ని తీవ్రంగా హింసించాడు. చెంపలకు అడ్డుగా చేయి పెట్టుకోవడంతో మరింత గట్టిగా కొట్టాడు. దాదాపు 60 చెంపదెబ్బలు వేశారు. మిగతా స్నేహితులు అడ్డుకోవడంతో కాస్త గ్యాప్ ఇచ్చారు. కొట్టి కొట్టి, దాడి చేసిన వారే అలసి పోయినట్టుగా ఆ వీడియోలో ఉంది. సోషల్ మీడియాలో ఈ దాడి వీడియోలు వైరల్ గా మారాయి.
A video of an Amity University law student in UP's Lucknow being slapped by classmates atleast 26 times in over a minute has surfaced on social media. The trigger behind this incident is yet to be ascertained. pic.twitter.com/FssBFAvEuT
— Piyush Rai (@Benarasiyaa) September 5, 2025
దాడి ఘటనతో లక్నోలోని అమిటీ యూనివర్సిటీ వార్తల్లోకెక్కింది. అమిటీ యూనివర్శిటీలో ఎల్ఎల్బీ సెకండ్ ఇయర్ విద్యార్థి శిఖర్ ముఖేష్ కేసర్వానీపై ఈ దాడి జరిగింది. అయితే దాడి జరిగే సమయంలో స్నేహితులు దాన్ని వీడియో తీసి వైరల్ చేశారు. మనస్థాపంతో కొడుకు కాలేజీకి కూడా వెళ్లకపోవడంతో తండ్రి అసలు విషయం ఆరా తీశాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం బయటకు చెబితే, తనపై కూడా దాడి చేస్తామని తన కొడుక్కి వార్నింగ్ ఇచ్చారంటూ బాధితుడి తండ్రి పోలీసులకు వివరించాడు. పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఆయుష్ యాదవ్, జాన్వి మిశ్రా, మిలే బెనర్జీ, వివేక్ సింగ్, ఆర్యమాన్ శుక్లాపై కేసు పెట్టారు.
తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని, లిగ్మెంట్ సర్జరీ చేయించుకున్నాడని, ఆ విషయం తెలిసి కూడా అతడిపై దాడి చేశారంటూ బాధితుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. దాడి తర్వాత శిఖర్ మానసిక ఆవేదనకు గురయ్యాడని, అతడు కాలేజీకి వెళ్లడం మానేశాడని తండ్రి చెప్పాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. అయితే ఈ ఘటనపై అమిటీ యూనివర్శిటీ మాత్రం స్పందించలేదు. అసలు శిఖర్ ని వారు ఎందుకు కొట్టారనేది తేలాల్సి ఉంది. శిఖర్ ఏం చేశాడు, క్లాస్ మేట్ ని అంత దారుణంగా ఆ యువతి ఎందుకు కొట్టింది, ఆమెకోసం మరికొందరు శిఖర్ పై ఎందుకు దాడి చేశారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.