New Banking Rules Update: బ్యాంకింగ్ రూల్స్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్ చేయని ఖాతాల సంఖ్యను తగ్గించేందుకు సరికొత్త రూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కో డిపాజిట్ ఖాతాకు ఇకపై నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించనుంది. ఈ మేరకు బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024ను పార్లమెంటు ఆమోదించింది. ఈ సవరణ ప్రకారం ఖాతాదారులు తమ అకౌంట్ కు నలుగురు నామినీలను పెట్టుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది.
ఇప్పటి వరకు ఒక్క నామినీకే అవకాశం
ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు, ఎఫ్డీల కోసం ఒక నామినీనే ఎంచుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన చట్ట సవరణతో ఇకపై నామినీల సంఖ్య నాలుగుకు పెరగనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ కు సంబంధించి ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అదే విధానాన్ని బ్యాంకింగ్ రంగంలోనూ తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం బ్యాంక్ అకౌంట్ హోల్డర్ చనిపోతే నామినీలుగా పేర్కొన్న వారికి డబ్బు అందించడం సులభం అవుతుంది.
తాజాగా బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లుకు ఆమోదం
తాజాగా బ్యాంకు అకౌంట్ నామినీలకు సంబంధించి బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభ లో పెట్టిన బిల్లుకు పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలిపారు. భారత్ లో 2024 మార్చి నాటికి క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం రూ.78,000 కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ అకౌంట్ల సంఖ్యను తగ్గించడంతో పాటు అకౌంట్ హోల్డర్ల డబ్బు వృథా కాకూడదనే అవకాశంతో కొత్త రూల్స్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాటు క్లెయిమ్ చేయని డివిడెండ్లు, బాండ్లను సైతం ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్ కి చేరేలా బ్యాంకింగ్ చట్టంలో మార్పులు చేసింది.
నామినీల సంఖ్య పెరగడంతో కలిగే లాభాలు
తాజాగా తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం అకౌంట్ హోల్డర్.. నలుగురు నామినీలను ఎంచుకోవడంతో పాటు ఎవరికి ఎంత మొత్తంలో చెల్లించాలో మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. వారసత్వ ధృవీకరణ పత్రం, కోర్టు ఉత్తర్వులు అవసరం లేకుండా నామినీలకు డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవు. అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో లేదంటే ఆ తర్వాత నామినేషన్ ఫారమ్ సమర్పించి నామినీలను ఎంచుకోవచ్చు. నామినీలను మార్చునే అవకాశం ఉంటుంది. అవసరం లేదు అనుకుంటే నామినీలను క్యాన్సిల్ చేసుకోవచ్చు.
సురక్షితమైన, స్థిరమైన బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్ధారిస్తూ డిపాజిటర్లకు సాధికారత కల్పించే దిశగా బ్యాంకింగ్ చట్టాల సవర చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. “బ్యాంకులను సురక్షితంగా, స్థిరంగా ఉంచడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. 10 సంవత్సరాల తర్వాత ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి” అని ఆమె వెల్లడించారు.
Read Also: కొత్త పాన్ కార్డ్ వచ్చేస్తోంది.. ఎలా అప్లై చేసుకోవాలంటే?