Indigo Airlines Worst : భారతదేశానికి చెందిన విమాన సంస్థ (ఎయిర్ లైన్స్ కంపెనీ) ఇండిగో ప్రపంచలనే అత్యంత చెత్త సర్వీసు ఇచ్చే ఎయిర్ లైన్స్ లో ఒకటిగా ఒక సర్వేలో వెల్లడైంది. యూరోప్ కు చెందిన ఎయిర్‌హెల్ప్ ఐఎన్‌సి (AirHelp Inc) అనే సంస్థ ఈ సర్వే చేసింది. ప్యాసింజర్లకు ఎయిర్‌లైన్స్ అందించే సర్వీసు, విమాన ప్రయాణంలో అసౌకర్యం వంటి అంశాలను ప్రతిపాదికగా ఈ సర్వే చేయబడిందని ఎయిర్‌హెల్ప తన రిపోర్ట్ లో తెలిపింది.
ఈ సర్వేలో 2024 సంవత్సరానికి గాను ఎయిర్‌లైన్స్ అందించిన సర్వీసుని రేటింగ్ ఇచ్చారు. మొత్తం 109 ఎయిర్‌లైన్స్ లలో చెత్త సర్వీసు ఇచ్చే 10 విమాన సంస్థల్లో ఒకటిగా ఇండిగో ఎయిర్ లైన్స్ పేరు ఉండడం ఇండియన్ కస్టమర్లకు షాకింగ్ విషయం. 109 ఎయిర్ లైన్స్ రేటింగ్ లో ఇండిగోకి 103వ స్థానం లభించింది. ఇండిగో ఎయిర్ లైన్స్ కి 4.8 స్కోర్ మాత్రమే లభించింది. కానీ ఇండిగో సంస్థ ఈ సర్వే ఫలితాలను తోసిపుచ్చింది. ఎయిర్ హెల్ప్ సర్వేలో ఇండియా నుంచి శాంపిల్ సైజ్ గా ఎంతమంది అభిప్రాయాలు తీసుకున్నారో తెలుపలేదు. అందుకే సర్వే క్రెడిబిలిటీపై మాకు అనుమానాలున్నాయని ఇండిగో ప్రతినిధి తెలిపారు.
Also Read: దూకుడు మీదున్న బిట్‌కాయిన్.. మార్కెట్‌లో సరికొత్త రికార్డు
సర్వే రిపోర్ట్ ప్రకారం.. విమాన కంపెనీల పనితీరు విమానాలు సమయానికి చేరుకున్నాయా? అందులో ప్యాసింజర్లకు ఇచ్చే సర్వీసు క్వాలిటీ, ఏదైనా సమస్యలు, ఫిర్యాదులు వస్తే వాటిని పరిష్కరించిన తీరు (నష్టపరిహారం) వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటూ జనవరి 2024 నుంచి అక్టోబర్ 2024 వరకు మొత్తం 54 దేశాల ఎయిర్ లైన్స్ డేటాను తీసుకుంది. మరోవైపు కష్టమర్ల నుంచి వారి అభిప్రాయాలు, విమాన సర్వీసులో వారికిచ్చే ఆహారం, వసతిని కూడా పరిగణించారు.
ఈ సర్వే గురించి ప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ మీడియాతో ఎయిర్‌హెల్ప్ సిఈఓ టొమాస్ పాలిజైన్ మాట్లాడుతూ.. “ప్యాసెంజర్లకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులు, వారి అభిప్రాయాలు ఎయిర్ లైన్స్ సంస్థలకు అందించడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం.” అని అన్నారు.
ఈ సర్వేలో టాప్ 10 చెత్త సర్వీసు అందించే ఎయిర్ లైన్స్ జాబితా ఇలా ఉంది.
1. స్కై ఎక్స్ ప్రెస్ (లాస్ట్ ర్యాంక్ 109)
2. ఎయిర్ మారిషియస్
3. టారోమ్
4. ఇండిగో (ర్యాంక్ 106)
5. పెగసస్ ఎయిర్‌లైన్స్
6. ఎల్ అల్ ఇజ్రాయెల్ ఎయిర్‌లైన్స్
7. బల్గేరియా ఎయిర్
8. నువేలెయిర్
9. బజ్
10. టునిస్ ఎయిర్.
ఈ సర్వేలో టాప్ 10 ఉత్తమ సర్వీసు అందించే ఎయిర్ లైన్స్ జాబితా
1. బ్రస్సెల్స్ ఎయిర్ లైన్స్ (ర్యాంక్ 1)
2. కతార్ ఎయిర్ వేస్
3. యునైటెడ్ ఎయిర్ లైన్స్
4. అమెరికన్ ఎయిర్ లైన్స్
5. ప్లే (ఐస్ ల్యాండ్)
6. ఆస్ట్రియన్ ఎయిర్ లైన్స్
7. ఎల్ఒటి పాలిష్ ఎయిర్ లైన్స్
8. ఎయిర్ అరేబియా
9. విడరో
10. ఎయిర్ సెర్బియా (ర్యాంక్ 10)
ఈ సర్వేలోని టాప్ 10 జాబితాలో భారతదేశానికి చెందిన ఎయిర్ లైన్స్ లేకపోవడం గమనార్హం. సర్వేలో ఎయిర్ ఇండియాకు 61వ ర్యాంక్ దక్కింది. దాని స్కోర్ 6.15.
అయితే ఎయిర్‌హెల్స్ సర్వేను ఇండిగో పూర్తిగా తోసిపుచ్చింది. భారతదేశలో ఎయిర్ లైన్స్ నియమాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిజిసిఎ రూపొందిస్తుంది. ఆ నియమాలను తాము తప్పకుండా పాటిస్తున్నామని.. సమయానికి తమ విమానాలు రాకపోకలు చేయడంతో పాటు కస్టమర్ల ఫిర్యాదలు పరిష్కారం గురించి ప్రతినెలా డేటా ప్రచురిస్తున్నామని ఇండిగో ప్రతినిధులు తెలిపారు.