GST Reduction: మరో వారంలో రోజుల్లో కొత్త జీఎస్టీ అమల్లోకి రానుంది. ఎక్కడ విన్నా రాజకీయ నాయకుల నోట జీఎస్టీ మాట బలంగా వినిపిస్తోంది. తాము సాధించిన ఘనతగా గొప్పలు చెబుతోంది కేంద్రం. కొత్త జీఎస్టీ ఫలాలు సామాన్యులకు అందేలా కొత్త నిర్ణయం తీసుకుంది. తగ్గింపు ప్రయోజనాలు ప్రజలకు చేరేలా చూడటానికి ప్రతీ షాపులు, షోరూమ్‌ల్లో పాత- కొత్త పన్ను రేట్ల వివరాలతో కూడిన బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు.
వచ్చేవారం నుంచి దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ అమల్లోకి రానుంది. తగ్గించిన రేట్ల ఫలాలు సామాన్యులకు అందేలా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. సామాన్యుడికి ఊరట కలిగేలా 350 వస్తువులపై జీఎస్టీని తగ్గించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇకపై ప్రతి షాపులు, షోరూముల్లో పాత-కొత్త పన్ను రేట్ల వివరాలతో కూడిన బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించనున్నారు.
ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర పరోక్ష పన్నులు-కస్టమ్స్ బోర్డు-CBIC పరిశ్రమ-వాణిజ్య ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో GST తగ్గింపు అమలు చేయడానికి సూచనలు ఇచ్చాయి. వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి కంపెనీలు తమ షాపులు, డీలర్‌షిప్‌ల్లో పాత-కొత్త ధరలను ప్రదర్శించాలని ప్రభుత్వం కోరింది.
వాస్తవానికి GST తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు చేరేలా ప్రభుత్వం కోరుకుంటోంది. 2017లో GST అమలు తర్వాత కొన్ని కంపెనీలు పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయలేదంటూ కేంద్రం దృష్టికి వెళ్లింది. ఆ తర్వాత నేషనల్ యాంటీ-ప్రాఫిటీరింగ్ అథారిటీ వారిపై జరిమానాలు విధించిన విషయం తెల్సిందే. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కేంద్రం, కచ్చితంగా బోర్డులు పెట్టాల్సిందేనని ఆదేశాలు జారీ చేసినట్టు ప్రభుత్వ వర్గాల మాట.
ALSO READ: పీఎల్ఐ స్కీమ్ లో కొత్త విండో పీరియడ్, ఆ పరిశ్రమలకు మరో ఛాన్స్
సెప్టెంబర్ 22 నుండి కొత్త GST రేట్లు అమల్లోకి రాకముందే కంపెనీలు తమ ఉత్పత్తులపై ధర మార్చడానికి ప్రభుత్వం అనుమతించింది. తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులు ఇప్పుడు స్టాంపులు, స్టిక్కర్లు లేదా ఆన్‌లైన్ ప్రింటింగ్ ద్వారా పాత స్టాక్‌పై కొత్త ధరలను ఉంచే అవకాశముందని అంటున్నారు. డిసెంబర్ 31, 2025 లేదా పాత స్టాక్ అయిపోయే వరకు చెల్లుబాటులో ఉంటుందని భారత వినియోగదారుల వ్యవహారాల శాఖ ఓ ఉత్తర్వు జారీ చేసింది. ఈ లెక్కన షాపులు, షోరూము కంపెనీలు కొత్త ధరలతో పాటు పాత MRPని ప్రదర్శించాలి.
ఆదివారం చెన్నైలో జరిగిన ఓ సదస్సుకు ఆర్థికమంత్రి సీతారామన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, 2017 లో జీఎస్టీ ప్రవేశ పెట్టినప్పుడు కేవలం 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ సంఖ్య అమాంతంగా రెట్టింపు అయ్యిందన్నారు. ప్రస్తుతం 1.51 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నట్లు తెలిపారు. 2017లో ₹7.19 లక్షల కోట్లుగా GST వసూళ్లు ఇప్పుడు రూ. 22 లక్షల కోట్లకు చేరుకుందన్నారు.