కర్నాటకలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో ఒకటి బాదామి. ఇదో చిన్న పట్టణం. కానీ, చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. పురాతన రాతి గుహలు, అందమైన దేవాలయాలు నెలవైన ఈ ప్రాంతం పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఒకప్పుడు చాళుక్యుల రాజధానిగా కొనసాగిన ఈ ప్రదేశం చరిత్ర ప్రేమికులకు, పర్యాటకులకు ఎంతగానో నచ్చేస్తుంది. అద్భుతమైన ఎర్ర ఇసుకరాయి శిఖరాలు, నిర్మలమైన సరస్సు అంచున అద్భుతంగా కొలువుదీరిన ఈ ఆలయం.. ప్రత్యేకమైన వాస్తుశిల్పంతో, బాదామి ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులను ఆకర్షిస్తుంది.
బాదామి 6వ శతాబ్దాల నుంచి 8వ శతాబ్దాల వరకు చాళుక్య రాజవంశానికి రాజధానిగా ఉండేది. చాళుక్యులు ఎన్నో అద్భుతమైన ఆలయాలను, గొప్ప స్మారక చిహ్నాలను, నిర్మాణాలను చేపట్టారు పురాతన కాలంలో ఈ పట్టణాన్ని వాతాపి అని పిలిచేవారు. పాలకులు కళ, వాస్తుశిల్పం పట్ల తమ ప్రేమను చూపిస్తూ ఎర్రరాతి గుహల అంచున దేవాలయాలను సృష్టించారు. ఇప్పుడు అదే నిర్మాణాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందాయి.
బాదామి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఎర్ర ఇసుకరాయి కొండలలో చెక్కబడిన నాలుగు రాతి గుహ దేవాలయాలు. ఈ గుహల్లో మూడు హిందూ ఆలయాలు కాగా, ఒకటి జైన ఆలయం. ప్రతి గుహలో దేవతా విగ్రహాలు, పౌరాణిక కథలతో కూడిన అందమైన శిల్పాలు ఉన్నాయి.
⦿గుహ 1: ఇందులో శివాలయం ఉంది. శివుడి నృత్య రూపమైన నటరాజు అద్భుతమైన శిల్పం ఉంది.
⦿గుహ 2: ఇందులో మహా విష్ణువు ఆలయం ఉంది. వరాహ, త్రివిక్రమ అవతారాల విగ్రహాలు ఉన్నాయి.
⦿గుహ 3: ఇందులో కూడా శ్రీ మహా విష్ణువుకు సంబంధించి వివరణాత్మక శిల్పాలు ఉన్నాయి. అన్ని గుహ ఆలయాల్లోకెళ్ల ఇది చాలా పెద్దది.
⦿గుహ 4: ఇది జైన మతానికి సంబంధించిన గుహ. ఇందులో తీర్థంకరులు ముఖ్యంగా మహావీరుడి చిత్రాలలో కూడి ఉంటుంది.
ఇక ఈ గుహ ఆలయాలను ఆనుకుని ప్రశాంతమైన, సుందరమైన అగస్త్య సరస్సు ఉంది. ఎర్ర ఇసుకరాతి కొండలు, దేవాలయాల చుట్ఊ విస్తరించి ఉంటుంది. ఈ సరస్సు చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. బాదామి ప్రకృతి దృశ్యాలకు చక్కటి ఆకర్షణను అద్దుతుంది. బాదామిలో ఇసుకరాతి గుహలతో పాటు చూసేందుకు బోలెడు ఇతర ప్రదేశాలు కూడా ఉన్నాయి.
⦿భూతనాథ ఆలయం: అగస్త్య సరస్సు సమీపంలో ఉన్న ఈ ఆలయంలో శివుడు కొలువై ఉన్నాడు. దీని నిర్మాణం, ఉన్న ప్రదేశం ఎంతో కనువిందు చేస్తాయి.
⦿ బాదామి కోట: కొండ పైన ఉన్న ఈ కోట పట్టణంతో పాటు సరస్సు అందాలను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ఇది పురాతన నిర్మాణాలతో ఆకట్టుకుంటుంది. గతంలో ఉపయోగించిన ఓ ఫిరంగి కూడా ఇక్కడ ఉంటుంది.
⦿పురావస్తు మ్యూజియం: ఈ మ్యూజియంలో చాళుక్య కాలం నాటి కళాఖండాలు, శిల్పాలు ఉన్నాయి. ఇవి బాదామి చరిత్రను తెలియజేస్తాయి.
బాదామి చేరుకోవడం చాలా ఈజీ. బాదామిలోనే రైల్వే స్టేషన్ ఉంటుంది. బాగల్ కోట్, హుబ్లి లాంటి సమీప పట్టణాల నుంచి బస్సులో కూడా వెళ్ళవచ్చు. హుబ్లీలో విమానాశ్రం కూడ ఉంటుంది. హుబ్లీ నుంచి దాదాపు 100 కి.మీ దూరంలో ఉంది. పట్టణంలో తిరగడానికి ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. బాదామిని సందర్శించడానికి మార్చి నుంచి అక్టోబర్ మధ్య బెస్ట్ టైమ్ అని చెప్పుకోవచ్చు. వేసవికాలం చాలా వేడిగా ఉంటుంది. వర్షాకాలం ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. సో, బాదామి గుహలు, దేవాలయాలు, కోటను చూసి ఎంజాయ్ చేయాలంటే, వెంటనే కర్నాటక టూర్ ప్లాన్ చేసేయండి.
Read Also: ఆహా.. ఆ జాబితాలోకి ఎర్రమట్టి దిబ్బలు.. UNESCO గుర్తింపుతోనైనా రక్షణ దొరుకుతుందా?