ఇటీవల కాలంలో UPI సర్వర్లు డౌన్ కావడం, అప్పుడప్పుడు ఫోన్ పే, గూగుల్ పే పనిచేయకుండా పోవడం మీరు గమనించారా? నిమిషాల వ్యవధి నుంచి కొన్ని గంటల వరకు ఈ అంతరాయం అందర్నీ ఇబ్బంది పెట్టింది. దీనికి పరిష్కారంగా UPI కొన్ని కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు అపరిమితంగా ఉన్న సర్వీసులపై ఆంక్షలు మొదలయ్యాయి. వీటివల్ల వినియోగదారులకు కలిగే ఇబ్బందులేంటి? కొత్తరూల్స్ వల్ల ట్రాన్సాక్షన్స్ స్పీడ్ అవుతాయా? ఇప్పుడు చూద్దాం.
రోజుకి 50సార్లే..
UPI పేమెంట్స్ లో రోజుకి ఇంత అనే లిమిట్ ఉంది కానీ, రోజుకి ఇన్ని అనే లిమిట్ మాత్రం లేదు. అంటే గరిష్టంగా రోజుకి లక్ష రూపాయలు మనం వేరే ఖాతాకు తరలించగలం. అయితే దాన్ని చిన్న మొత్తాలుగా విడగొట్టి ఎన్ని ఖాతాలకైనా తరలించే అవకాశం మాత్రం ఉంది. అలాగే రోజుకి ఎన్నిసార్లయినా మనం బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోగలం. ఇకపై ఇ చెకింగ్ సదుపాయానికి పరిమితి విధించింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI). ఆగస్ట్ -1 నుంచి రోజుకి కేవలం 50 సార్లు మాత్రమే మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోగలం. అదే సమయంలో ఒక మొబైల్ నెంబర్ కి ఎన్ని ఖాతాలు లింక్ అయ్యాయనేది 25సార్లు మాత్రమే చూసుకోగలం.
ఆటో పేమెంట్..
UPI లో ఆటో పేమెంట్ పద్ధతిని కొంతమంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. సబ్ స్క్రిప్షన్లు, కరెంటు, ఫోన్, ఇంటర్నెట్ బిల్లులు, ఈఎంఐలు వంటి ఆటోపేమెంట్ లు ఇకపై నిర్దిష్ట టైమ్ లోనే జరుగుతాయి. రద్దీ సమయంలో వీటిపై ఆంక్షలు పెట్టింది NPCI. ఆటోపేమెంట్ రిక్వెస్ట్ పెట్టే సంస్థలు రద్దీ లేని సమయంలోనే దాన్ని షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. అయితే UPI యూజర్లు చేసే చెల్లింపులకు మాత్రం రద్దీ సమయం మినహా అనే నిబంధన లేదు.
ఎందుకిలా?
UPI లో వస్తున్న మార్పులు నెట్ వర్క్ సమస్యను పరిష్కరించేందుకేనంటున్నారు అధికారులు. బ్యాలెన్స్ చెకింగ్ పై నియంత్రణ లేకపోతే.. చాలామంది చీటికీ మాటికీ ఫోన్ తీసి ఏ అకౌంట్లో ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నారట. అదే సమయంలో ఒక ట్రాన్సాక్షన్ పూర్తయిన తర్వాత వెంటనే తమ అకౌంట్లో ఆమేర డబ్బులు డెబిట్ అయ్యాయో లేదో చూసుకుంటున్నార. ఈ అలవాటు వల్ల నెట్ వర్క్ సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు. దీంతో అప్పుడప్పుడు UPI పేమెంట్స్ యాప్ లు స్లో అవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికే బ్యాలెన్స్ చెకింగ్ పై నియంత్రణ పెట్టారు. అంటే కొత్త నిబంధనల వల్ల పెద్దగా మార్పులేవీ కనపడవు. పదే పదే బ్యాలెన్స్ చూసుకునేవారికి మాత్రం ఇది కాస్త ఇబ్బందేనని చెప్పాలి. అది కూడా రోజుకి గరిష్ట పరిమితి 50 కాబట్టి దీనివల్ల పెద్దగా నష్టం ఉండదు. నెట్ వర్క్ సమస్యకు ఇదే ప్రధాన కారణం అని గమనించడం వల్లే బ్యాలెన్స్ చెకింగ్ పై పరిమితి పెట్టారని తెలుస్తోంది. ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత కూడా నెట్ వర్క్ సమస్య ఎదురైతే.. ఇప్పుడు ఇతర అవకాశాలపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది.