Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ తన నష్టాలను తగ్గించుకునేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయా వర్గాలు ఈ విషయాన్ని సోమవారం తెలిపాయి. తొలగించబడే ఉద్యోగుల సంఖ్యపై కంపెనీ వ్యాఖ్యానించనప్పటికీ, కార్యాచరణ కార్యకలాపాల పునర్నిర్మాణం, ఆటోమేషన్ కారణంగా ఇది జరుగుతోందన్నారు.
ఓలా ఎలక్ట్రిక్ గత సంవత్సరం కూడా దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించింది. మేము మా ఫ్రంట్ ఎండ్ కార్యకలాపాలను పునర్నిర్మించామని, ఆటోమేట్ చేశామని ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ప్రతినిధి అన్నారు. దీని వల్ల మెరుగైన మార్జిన్లు, తక్కువ ఖర్చులు, మెరుగైన కస్టమర్ సౌకర్యాలు లభిస్తాయన్నారు. ఈ క్రమంలో మెరుగైన ఉత్పాదకత కోసం అనవసరమైన ఉపాధి అవకాశాలను తొలగించనున్నట్లు చెప్పారు.
దీంతో గత ఐదు నెలల్లో ఈ కంపెనీలో ఇది రెండో రౌండ్ తొలగింపులని చెబుతున్నారు. కంపెనీ తన స్టాక్ నిర్వహణను మెరుగుపరచడానికి, కస్టమర్లకు వేగవంతమైన సరఫరాను మెరుగుపరచడానికి వ్యూహాత్మక చర్యలు తీసుకుంటుంది. ఓలా ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా ఉన్న తన ప్రాంతీయ గిడ్డంగులను తొలగించింది. దీంతోపాటు వాహనాలు, విడిభాగాలు, సామాగ్రిని నిల్వ చేసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న తన 4,000 రిటైల్ కేంద్రాలను ఉపయోగించాలని నిర్ణయించింది.
Read Also: MK Stalin: పెళ్లైన వెంటనే పిల్లల్ని కనాలి..సీఎం వ్యాఖ్యలపై కామెంట్స్
ఈ క్రమంలో కంపెనీ Ebitda మార్జిన్‌ను దాదాపు 10 శాతం పాయింట్లు మెరుగుపరచడం ద్వారా, తన ఆర్థిక స్థితిని పునరుద్ధరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, ఖర్చులను తగ్గించడానికి వాహన రిజిస్ట్రేషన్ ఏజెన్సీ భాగస్వాములతో ఒప్పందాల గురించి తిరిగి చర్చించినట్లు సమాచారం.
గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఓలా ఎలక్ట్రిక్ రూ.376 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ ఆదాయం రూ.1,045 కోట్లు కాగా, గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 1,296 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో ఉద్యోగాల కోత ద్వారా కస్టమర్ సంబంధాలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల వంటి విధులు ప్రభావితం అవుతాయని అంటున్నారు.
గత నెలలో స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం కారణంగా ఓలా ఎలక్ట్రిక్ షేరు ధర భారీగా పడిపోయింది. ఒక నెలలోనే షేరు ఏకంగా 27% కంటే ఎక్కువ దిగజారింది. ఈ క్రమంలోనే సోమవారం ముగింపు ధర రూ.55.12కు చేరుకుంది. గత సంవత్సరం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఈ కంపెనీ షేరు ధర ఒకప్పుడు రూ.100కుపైగా ఉండటం విశేషం. ఈ పరిణామాలు ఓలా ఎలక్ట్రిక్ వ్యాపార మోడల్, ఆర్థిక స్థితిపై కూడా ప్రభావ చూపుతాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
గత సంవత్సరం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఓలా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, సేవలకు సంబంధించిన ఫిర్యాదులపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. CCPA నుంచి మొత్తం 10,644 ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో 99.1% ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయని కంపెనీ తెలిపింది. అయితే ఈ సంవత్సరం జనవరిలో CCPA ఓలా ఎలక్ట్రిక్ నుంచి అదనపు పత్రాలతోపాటు మరింత సమాచారాన్ని కోరింది. దీన్ని బట్టి చూస్తే ఈ ఫిర్యాదుల వ్యవహారం పూర్తిగా ముగిసినట్లు లేదనిపిస్తుంది.