MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గత కొన్ని రోజులుగా పలు రకాల వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే హిందీ భాష విషయంలో కేంద్రంతో యుద్దానికి సై అంటూ సీఎం వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కూడా వ్యతిరేకించారు. దీంతోపాటు కేంద్రం తమ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదన్నారు. ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు స్టాలిన్.
నాగపట్నంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన క్రమంలో మాట్లాడిన స్టాలిన్ .. యువత పెళ్లైన వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో జనాభా పెరుగుదలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. జనాభా పెరగడం ద్వారా లోక్‌సభ, రాజ్యసభలో సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన ప్రసంగంలో ప్రస్తావించారు.
మనం గతంలో వధూవరులకు పిల్లలు కనవద్దని సూచించేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు సీఎం స్టాలిన్. పెరిగిన జనాభా ద్వారా మాత్రమే ఎక్కువ మంది ఎంపీలు ఉంటారని తెలిపారు. మనం మన జనాభాను పెంచకపోతే, మనమే నష్టపోతామని స్టాలిన్ అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేసే తమిళ పేర్లతో నవజాత శిశువులకు పేర్లు పెట్టాలని కూడా ఆయన ప్రజలను సూచించారు. అంతేకాదు తమిళనాడు జనాభా నియంత్రణలో విజయవంతమైందని, ఇది రాష్ట్రానికి అనుకూలంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: IIT Baba: అడ్డంగా దొరికిపోయిన ఐఐటీ బాబా.. పోలీసుల కేసు, తర్వాత ఏమైందంటే..
ఇదే సమయంలో స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు. కేంద్రం బలవంతంగా త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని యోచిస్తుందన్నారు. అలాగే డీలిమిటేషన్‌లో తమిళనాడుకు సీట్ల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నిస్తుందని చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 40 పార్టీలతో కలిసి మార్చి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన 40కి పైగా రాజకీయ పార్టీలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమావేశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారనుంది.
Nagapattinam | Tamil Nadu CM MK Stalin says, "You all know well what problem we are facing now. The Union government is planning to forcibly implement 3-language policy. Similarly, they( Union Government ) are focusing on decreasing the number and rights of Tamil Nadu through… pic.twitter.com/dbKTWE0aac
— ANI (@ANI) March 3, 2025
ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా యువతకు పిల్లలను కనాలని ప్రోత్సహించడం, వివాహం, కుటుంబ వ్యవస్థ గురించి కొత్త దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రాజకీయ ప్రాతిపదికన సీట్ల కేటాయింపు నేపథ్యంలో జనాభా పెరుగుదలపై దృష్టి సారించాలని చెప్పడం సరికాదని పలువురు అంటున్నారు. అంతేకాదు ఆయా కుటుంబాలు వారి పరిస్థితిని బట్టి పిల్లలను కంటారని, ఇలా సీట్ల పెంపు కోసం పిల్లల్ని కనాలని వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు అంటున్నారు.
సీఎం స్టాలిన్ ఈ అంశాన్ని రాజకీయ కోణం నుంచి అంచనా వేయవద్దని సూచించారు. ఇది డీఎంకే, మీ పార్టీ సమస్య కాదన్నారు. ఇది పూర్తిగా తమిళనాడు ప్రయోజనాలు, హక్కులకు సంబంధించినదని స్పష్టం చేశారు. స్టాలిన్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగానే కాకుండా సామాజిక కోణంలో కూడా అనేక మంది చర్చించేకునేలా చేశాయి. అయితే ఈ వ్యాఖ్యలపై మీరు ఏమనుకుంటున్నారో అభిప్రాయం రూపంలో తెలియజేయండి మరి.