Offer to Google Chrome: టెక్నాలజీ రంగంలో చరిత్రనే మార్చేలా సంచలన విషయాలు జరుగుతున్నాయి. పెర్ప్లెక్సిటీ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్, గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను కొనుగోలు చేయడానికి సుమారు రూ. 2.88 లక్షల కోట్లు ($34.5 బిలియన్) నగదులో ఆఫర్ చేసింది. అంతేకాకుండా.. ఇది కంపెనీ ప్రస్తుత విలువ $14 బిలియన్ కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. పెర్ప్లెక్సిటీ తమ AI టెక్నాలజీ ఉపయోగించి యూజర్లు ఏదైనా సమాచారాన్ని వెతికే సమయంలో మార్కెట్‌లో ఆధిపత్యం సాధించాలనే ఉద్దేశమే దీనికి ప్రధాన కారణం.
పెర్ప్లెక్సిటీ AI వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ కంపెనీ ధైర్యంగా పెద్ద ఆఫర్లలో అడుగులు వేస్తున్నదని చెప్పారు. ఇది కొత్త విషయం కాదు. ఈ సంవత్సరం జనవరిలో, అమెరికాలో టిక్‌టాక్ పై “చైనీస్ యాజమాన్యం” నేపథ్యంలో వచ్చిన ఆందోళనలను తగ్గించేందుకు, టిక్‌టాక్ యూఎస్‌తో కలిపి పని చేయాలనుకునే ప్రతిపాదన పెట్టారు. ఆ డీల్ సాధ్యం కాలేదు కానీ, అయినప్పటికీ పెర్ప్లెక్సిటీ టెక్ రంగంలో ధైర్యంగా అడుగులు వేసే సంస్థగా పేరొందింది.
గూగుల్ క్రోమ్‌ను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఓపెన్ AI, యాహూ, అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ వంటి సంస్థల్లో కూడా ఉంది. గతేడాది, అమెరికా న్యాయశాఖ గూగుల్‌పై సెర్చ్ మార్కెట్‌లో అధిపత్యాన్ని అన్యాయంగా ఉపయోగిస్తున్నందుకు కేసు వేసింది. ఈ కారణంగా, గూగుల్ క్రోమ్‌ను విక్రయించమని ప్రభుత్వం కోరింది. అయితే, గూగుల్ దీనిపై ఎటువంటి ప్రణాళికలు లేవని, అప్పీల్ చేయనున్నట్లు తెలిపింది. పెర్ప్లెక్సిటీ ఇప్పటికే ఎన్విడియా, సాఫ్ట్‌బ్యాంక్ వంటి ఇన్వెస్టర్ల నుండి $1 బిలియన్ పెట్టుబడులు పొందింది. కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు $34.5 బిలియన్ డీల్‌కు అవసరమైన నిధులను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
పెర్ప్లెక్సిటీ, క్రోమ్‌ను కొనుగోలు చేసిన తర్వాత క్రోమియం కోడ్ ను ఓపెన్ సోర్స్‌గా కొనసాగించేందుకు, తదుపరి రెండు సంవత్సరాల్లో $3 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు హామీ ఇచ్చింది. అలాగే, డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌ను మార్చకుండా యూజర్ల ఎంపికలను కాపాడుతూ, పోటీపై ఉన్న ఆందోళనను తగ్గిస్తామని వెల్లడించింది. ఈ ఆఫర్ నగదు రూపంలో మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం AI ఆధారిత చాట్‌బాట్లు, చార్జ్‌పీటీ, పెర్ప్లెక్సిటీ వంటి వేదికలు యూజర్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది వెబ్ బ్రౌజర్లను సర్చ్ ట్రాఫిక్, యూజర్ డేటా కోసం కీలక మార్గాలుగా మార్చింది. పెర్ప్లెక్సిటీ వద్ద ఇప్పటికే కోమెట్ అనే AI బ్రౌజర్ ఉంది, ఇది ప్రత్యర్థులతో సమానంగా నిలబడటానికి సహాయపడుతుంది.
గూగుల్ తన క్రోమ్‌లో AI-జనరేటెడ్ సెర్చ్ సమ్మరీ వంటి ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇది సెర్చ్ మార్కెట్ షేర్‌ను కాపాడటంలో కీలకంగా మారుతుంది. విశ్లేషకులు, అందుకే గూగుల్ క్రోమ్‌ను విక్రయించడానికి అవకాశం తక్కువగా ఉందని భావిస్తున్నారు. న్యాయ ప్రక్రియ ఫెడరల్ కోర్ట్ నుండి సుప్రీంకోర్టు వరకు కొనసాగే అవకాశం ఉండటంతో, ఈ మొత్తం ప్రక్రియ రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కొనసాగవచ్చు. ఇదే సమయంలో, డక్ డక్ గో సీఈఓ గాబ్రియెల్ వెయిన్ బర్గ్ అభిప్రాయం ప్రకారం, గూగుల్ క్రోమ్ విలువ కనీసం $50 బిలియన్ ఉంటుందని, పెర్ప్లెక్సిటీ ప్రతిపాదించిన $34.5 బిలియన్ కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇది సాధ్యమైతే, టెక్ రంగంలో మాత్రమే కాక, AI సర్చ్ పోటీలో కూడా గేమ్-చేంజర్‌గా మారవచ్చు. కానీ, న్యాయపరమైన అడ్డంకులు, గూగుల్ ప్రయోజనాల దృష్ట్యా, ఈ డీల్ వెంటనే జరిగే అవకాశం తక్కువనేనని నిపుణులు చెబుతున్నారు.