RBI Repo Rate Loan| భారత దేశ రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బిఐ) రెపో రేట్‌లో ఏ మార్పులు లేవని శుక్రవారం ప్రకటించింది . ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ డిసెంబర్ 6, 2024న ప్రకటన చేశారు. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) వరుసగా 11వ సారి వడ్డీ రేట్లలో మార్పులు చేయకపోవడం గమనార్హం. మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యులలో నలుగురు వడ్డే రేట్లలో మార్పులు చేయకూడదని నిర్ణయించారు. ఫిబ్రవరి 2023 నుంచి ఆర్బిఐ ఇదే రెపో రేట్‌ని కొనసాగిస్తోంది.
ప్రస్తుతం రెపో రేట్ 6.5 శాతం ఉంది. దేశంలో ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణ ఒత్తడి, ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అనిశ్చితి నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఇంతకుముందు ప్రకటించిన 7 శాతం వృద్ధి రేటు టార్గెట్ ని తగ్గించి 6.6 శాతానికి కుదించినట్లు గవర్నర్ శక్తికాంతా దాస్ చెప్పారు. గత త్రైమాసికంలో వృద్ధి రేటు టార్గెట్ 7 శాతం ఉంటే కేవలం 5.4 శాతమే చేరుకుంది. ఈ కారణంగానే వృద్ధి టార్గెట్‌ని ఆర్బిఐ తగ్గించినట్లు తెలుస్తోంది.
లోన్ ఈఎంఐలపై వడ్డీ రేట్ల ప్రభావం..
వడ్డీ రేట్లతో బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలపై ప్రభావం ఉంటుంది. కానీ ప్రస్తుతం వడ్డీ రేట్లు యధాతథంగా ఉండడంతో రుణాల చెల్లింపులు ఈఎంఐలపై ప్రభావం ఉండదు. ముఖ్యంగా హోమ్ లోన్స్ , వాహన రుణాలు, పర్సనల్ లోన్స్ అన్నీ రెపో రేట్ తో ముడిపడి ఉండడంతో ప్రస్తుతానికి ఈఎంఐలపై ప్రభావం ఉండదు. కానీ కొత్తగా రుణాలు తీసుకునే వారు భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరగకముందే రుణాలు తీసుకోవడం ఉత్తమం అని ఆర్థిక నిపుణలు సూచిస్తున్నారు.
పెట్టుబడిదారులకు బ్యాడ్ న్యూస్
వడ్డీ రేట్లు తగ్గుతాయని ఆశించే పెట్టుబడిదారులకు ఆర్బిఐ నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. ఆర్బిఐ రెండు నెలల క్రితం ద్రవ్యోల్బణం టార్గెట్ 4.5 శాతం అంచనా వేయగా.. నిత్యాసరాల ధరలు పెరుగుతూ ఉండడం, ప్రజల ఆదాయం తగ్గిపోవడంలో ద్రవ్యోల్బణం 4.8 శాతం నమోదైంది. అక్టోబర్ 2024లో అయితే ద్రవ్యోల్బణం రికార్డు బద్దలు కొడుతూ 6 శాతానికి మించిపోయింది. అయితే ఈ త్రైమాసికం ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలున్నాయని గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయి ప్రజల కొనుగోలు శక్తిని బాగా తగ్గిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.
బ్యాంకులకు ఆర్బిఐ గుడ్ న్యూస్
వడ్డీ రేట్లు ఆర్బిఐ తగ్గిస్తుందని అందరూ ఊహించినా.. అది జరగలేదు. కానీ రిజర్వ్ బ్యాంక్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. క్యాష్ రిజర్వ్ రేషియో (సిఆర్ఆర్ – నగదు నిల్వ నిష్పత్తి) 4 శాతానికి తగ్గించింది. ఇంతకుముందు ఈ నిష్పత్తి 4.5 శాతం ఉంది. ఆర్బిఐ సిఆర్ఆర్ తగ్గించడంతో బ్యాంకులు వద్ద రూ.1.5 లక్షల కోట్లు రుణాలు మంజూరు చేసేందుకు నిధులు లభించినట్లే.
దీంతోపాటు రైతులకు ఇచ్చే రుణపరిమితిని రూ.2 లక్షలకు పెంచింది. ఇంతకుముందు వ్యవసాయ రుణాల పరిమితి రూ.1.6 లక్షలు ఉండగా ప్రస్తుతం తాజాగా ఆ పరిమితి రూ.2 లక్షలకు పెరిగింది.