Mettu vs Vivekananda: బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మెన్ మెట్టు సాయి కుమార్. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కబ్జా చిట్టాను విప్పి బయటపెట్టారు. మత్స్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదంటూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మాట్లాడటాన్ని తప్పుబట్టారు.
మత్స్యకార ఫెడరేషన్‌ని కార్పొరేషన్ కాకుండా చేసిందెవరని ప్రశ్నించారు సాయి కుమార్. బండా ప్రకాష్ ముదిరాజ్ కాదా? మత్సకార కుటుంబాలను దోచుకుంది మాజీ మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కాదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.
పదేళ్లలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 70 శాతం చెరువులు, కుంటలను ఎమ్మెల్యే కబ్జా చేయలేదా అని అన్నారు. వివేకానంద కబ్జా చిట్టా మావద్ద ఉందని, అన్ని బయట పెడతామన్నారు. గత ప్రభుత్వం కనీసం మత్స్యకార కుటుంబాలను ఆదుకొనే పాపాన పోలేదన్నారు.
మత్స్యకార కుటుంబాలను లక్షాధికారులను చేయాలన్న ధ్యేయంతో సీఎం రేవంత్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని తెలిపారు. డిసెంబర్ 9న 32 జిల్లాల్లోని మహిళా మత్సకారులకు 60 శాతం సబ్సిడీతో మొబైల్ ఫిష్ ఔట్ లెట్ స్టాల్స్ వాహనాలను ఇవ్వబోతున్నామని తెలిపారు.
ALSO READ: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్, కిషన్ రెడ్డి లను ఆహ్వానిస్తాం: పొన్నం ప్రభాకర్
ఎమ్మెల్యే వివేకానంద.. మత్స్యకారుల గురుంచి మాట్లాడే ముందు గాంధీభవన్‌లో తన నెంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడాలన్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులకు ఏం చేసిందో తెలుస్తుందన్నారు. అంతేగానీ ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు.