Stock Market Carsh: స్టాక్ మార్కెట్లు ఎందుకు పడిపోతున్నాయి. ఏం జరుగుతోంది? సూచీలు డౌన్ ఎందుకవుతున్నాయి. ఏ శక్తి ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేస్తోంది. మార్కెట్లకు మంగళవారం అమంగళం ఎందుకైంది? 10 లక్షల కోట్ల సంపద జస్ట్ వన్ డే లో ఎలా హరించుకుపోయింది? అసలు స్టాక్ మార్కెట్ల ఊగిసలాటలు ఇంకెన్నాళ్లు ఇలా సాగుతాయి? మధ్యలో మ్యాజిక్ జరగాల్సిందేనా? ఎవరో రావాలి.. ఏదో చేయాల్సిందేనా?
దినదిన గండం నూరేళ్లు ఆయుష్షు ఇదీ ఇండియన్ స్టాక్ మార్కెట్ల వ్యవహారం. అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయి గత ఐదురోజులుగా అడ్డంగా క్రాష్ అవుతోంది. ఒకవైపు రూపీ పతనం అవుతోంది. ఇంకోవైపు బంగారం రేటు పెరిగిపోతోంది. అటు చూస్తే స్టాక్ మార్కెట్ నేల చూపులు. వీటన్నిటికి మంచి ట్రంప్ రోజుకో నిర్ణయంతో ఎక్కడా ఒక మంచి శుభం కనిపించే పరిస్థితి లేకుండా పోయింది. ట్రంప్ ఎన్నికవక ముందు మంచి జోష్‌లో కనిపించిన మార్కెట్లు ఇప్పుడు మాత్రం అదే ట్రంప్ రావడంతో నేల చూపులు చూస్తున్నాయి. పరిస్థితి ఇలా మారడానికి చాలా కారణాలు సైలెంట్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఎటాక్స్ చేస్తున్నాయి.
ఆరు రోజులుగా అడ్డంగా క్రాష్ అవుతున్న స్టాక్స్
స్టాక్‌మార్కెట్ల పతనం ఆగడం లేదు. వాణిజ్య యుద్ధ భయాలతో వరుసగా ఆరో రోజూ సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఇవాళ సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా, నిఫ్టీ 250 పాయింట్లకు పైగా నష్టపోయాయి. FIIల అమ్మకాలు కొనసాగుతుండటంతో.. సూచీలు నేలచూపులే చూస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ భయాలతో ప్రధాన దేశాల స్టాక్‌మార్కెట్లన్నీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక.. BSEలో నమోదైన కంపెనీల్లో ఇన్వెస్టర్ల సంపద 25 లక్షల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది.
క్లైమాక్స్ లో రూ. 9లక్షల కోట్ల సంపద హాంఫట్
స్టాక్ మార్కెట్లు పడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు చాలా అలర్ట్‌గా ఉంటున్నారు. ఈ కారణంగా సూచీలు షేక్ అవుతున్నాయి. అయితే ప్రధాన షేర్లలో మదుపర్లు ఏకపక్షంగా అమ్మకాలకు దిగడంతో సూచీలు నష్టాల్లోకి మళ్లాయి. మామూలు నష్టాలు కాదు. ఒక్కరోజులో 9 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యేంతగా సీన్ మారిపోయింది. ఓవరాల్‌గా గత ఐదు రోజుల్లో ఇన్వెస్టర్లు 18 లక్షల కోట్లు కోల్పోయారు. BSE లిస్టెడ్ కంపెనీల వాల్యూ 426 లక్షల కోట్ల నుంచి 408 లక్షల కోట్లకు పడిపోయింది.
స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్ ప్రకటన
స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధించనున్నట్లు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడమే కాకుండా, దీనికి ఎలాంటి మినహాయింపులు ఉండవని చెప్పడం వాణిజ్య యుద్ధ భయాలను మరింత తీవ్రం చేసింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు ఇండియన్ మార్కెట్లలోనూ కూడా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో కూడా విక్రయాలు భారీగా జరిగాయి. ఒకదశలో సెన్సెక్స్ 1200 పాయింట్ల మేర నష్టపోగా, నిఫ్టీ 23 వేల మార్క్ దిగువకు చేరింది. ట్రేడింగ్ లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ లు దారుణంగా పడిపోయాయి. స్మాల్ క్యాప్ 3.9%, మిడ్ క్యాప్ 3.5% నష్టపోవడంతో పోర్ట్ ఫోలియోలు నష్టాలను చవిచూశాయి.
లిస్టెడ్ కంపెనీల క్యాపిటలైజేషన్ మరింత కిందికేనా?
సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌ను మినహాయించి మిగిలిన అన్ని షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా జొమాటో, టాటా స్టీల్, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎల్‌అండ్‌టీ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 9.87 లక్షల కోట్లు తగ్గి 408 లక్షల కోట్ల దగ్గర ఆగింది. ఇది ఇక్కడితో ఆగుతుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లలో ట్రంప్ రోజుకో అలజడి క్రియేట్ చేసి వదులుతున్నారు. ఆ దెబ్బకు సీన్లు మారిపోతున్నాయి.
దూకుడు పెంచుతున్న ఫారిన్ ఇన్వెస్టర్లు
ఫారిన్ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్స్ అమ్మేసి, నిధుల్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా తీసుకెళ్లిపోతున్నారు. అందుకే రూపీ మారకపు రేటుపై ఒత్తిడి పెరుగుతోందంటున్నారు ఆర్థిక శాఖ కార్యదర్శి. అమెరికా ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్ గా మారి ఉద్యోగ కల్పన పెరిగింది. నిరుద్యోగం తగ్గింది. సో అక్కడి వడ్డీ రేట్లు నిలకడగా ఉన్నాయి. అందుకే ఫారిన్ ఇన్వెస్టర్లంతా అమెరికా డాలర్ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపుతుండడంతో మనలాంటి దేశాల నుంచి ఇన్వెస్ట్ మెంట్స్ తీసేసి అక్కడ పెడుతున్నారు. గత నెల జనవరిలో ఏకంగా 48 వేల కోట్లు వెనక్కు పట్టుకెళ్లారు. ఒక్క ఫిబ్రవరి 10న 12 వేల 643 కోట్లు స్టాక్స్ అమ్మేశారు. కాబట్టి 2024 అక్టోబర్ నుంచి చూస్తే.. 2.75 లక్షల కోట్ల సంపదను ఇండియా నుంచి లిఫ్ట్ చేసుకున్నారు ఫారిన్ ఇన్వెస్టర్లు. సో తగ్గేదేలే అంటున్నారు విదేశీ మదపర్లు. మనోళ్లు మాత్రం ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్న పరిస్థితి.
క్వార్టర్ 3తో తగ్గిన కంపెనీల ఆదాయాలు
ఇప్పుడు స్టాక్ మార్కెట్ కాస్తా స్ట్రోక్ మార్కెట్‌గా మారడానికి చాలానే రీజన్స్ ఉన్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీల ఆదాయాలు గత రెండు త్రైమాసికాల కంటే స్వల్పంగా మెరుగ్గా ఉన్నప్పటికీ, అవి అంచనాలను అందుకోలేకపోయాయి. చాలా స్టాక్‌లు నేల చూపులే చూస్తున్నాయి. వాల్యుయేషన్లు సూచించిన అంచనాలతో పోలిస్తే, ఆదాయాలు నిరాశపరుస్తూనే ఉన్నాయి. కన్జూమర్ గూడ్స్, ఆటో, బిల్డింగ్ మెటీరియల్ రంగాల ఫలితాలు ఊహించిన దానికంటే దారుణంగా ఉన్నాయి.
డాలర్‌తో పోలిస్తే 86.84కి చేరిక
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటంతో విదేశీ పెట్టబడిదారులు బయటికెళ్తున్నారు. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటానికి కీలకమైన కారణాల్లో ఇది కూడా ఒకటి. ఈ సంవత్సరం డాలర్‌తో పోలిస్తే రూపాయి వాల్యూ దాదాపు 3 శాతం పడిపోయింది. వాణిజ్య యుద్ధం ఆందోళనలు కూడా రూపాయి డౌన్ కు మరో కారణం. మంగళవారం, రూపాయి కొద్దిగా కోలుకుని డాలర్‌కు 86.84కి చేరుకుంది. అయితే స్టెబులిటీ ఎంత ఉంటుందన్నది కీలకంగా మారింది. ఎంత ఇండియన్ స్టాక్స్ పడిపోయినా ఇబ్బంది లేదన్న వాదనను మార్కెట్ ఎక్స్ పర్ట్స్ వినిపిస్తున్నారు. భారత స్టాక్ మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈక్విటీ మార్కెట్ అని ధైర్యం చెబుతున్నారు.
స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్ లు
ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చాలా రకాల టారిఫ్ లను రుద్దుతున్నారు. ఇది ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీసి, ద్రవ్యోల్బణాన్ని పెంచే వాణిజ్య యుద్ధంపై ఆందోళన పెంచింది. ఈనెల 10న ట్రంప్ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం సుంకాన్ని విధించారు. ఇది కెనడా, మెక్సికోలపై ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుందంటున్నారు. రాబోయే నాలుగేళ్లు సీన్ ఎలా ఉంటుందన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఓవరాల్ గా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సిప్‌ల రాబడులపై మదుపర్లలో భయాందోళనలు కంటిన్యూ అవుతున్నాయి.
సిప్‌లలో లాభాలు రావాలంటే లాంగ్ టర్మ్ ఒకటే మార్గం
ఇప్పుడు ఇంతలా స్టాక్ మార్కెట్లు క్రాష్ అవుతుంటే.. అందరి దృష్టి సిప్ లపై పడింది. అసలివి ఉంటాయా ఊడుతాయా.. రావాల్సినంత లాభాలు వస్తాయా.. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్లకు ఇబ్బంది ఉంటుందా ఉండదా ఇవన్నీ కీలకంగా ఉన్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ లో పెట్టుబడి పెట్టే వారు భయపడాల్సిన పని లేదంటున్నారు. మిడ్, స్మాల్ క్యాప్ సిప్‌లకు కేటాయింపుల్లో సమతౌల్యం పాటించాలని సూచిస్తున్నారు. మొత్తం పెట్టుబడుల్లో 30శాతం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లలో పెట్టాలంటున్నారు. మార్కెట్లలో ఉండే అస్థిరత, భయాల గురించి ఆందోళన అవసరం లేదంటున్నారు. సిప్‌లలో లాభాలు రావాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ ఒకటే మార్గం అంటున్నారు. సిప్‌లలో మంచి రాబడులు రావాలంటే కనీసం పది లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లు ఓపికగా వెయిట్ చేయాల్సిందే.
నష్టాల టైంలో విక్రయాలతో మరింత చేటు
కాబట్టి ఓవరాల్ గా ఇప్పటి మార్కెట్ స్ట్రోక్ లను దృష్టిలో పెట్టుకుని చేయాల్సింది ఏంటన్నది కీలకంగా ఉంది. బుల్ జోరులో ఉన్నపుడు పెట్టుబడి పెట్టిన రిటైల్ ఇన్వెస్టర్లు.. భారీ పతనంతో కనీసం 20 నుంచి 40 శాతానికిపైగా నష్టాలు చూస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత వచ్చిన బుల్ మార్కెట్లో ఎంటరైన ఇన్వెస్టర్లు ఇప్పటి వరకు ఇలాంటి బిగ్ ఫాల్ ను చూసి ఉండరు. సహజంగానే ఇది ఆందోళనకర పరిణామం. అలా అని చెప్పి నష్టాల టైంలో విక్రయాలు చేస్తే మరింత నష్టపోయే ఛాన్స్ ఉంది.
లాంగ్ టర్మ్ విజన్ ఉంటేనే స్టాక్ మార్కెట్లో బెనిఫిట్స్
మళ్లీ మార్కెట్ లో రివైవల్ స్టార్ అయ్యే వరకు వేచి చూడటం మంచిదని ఎక్స్ పర్ట్స్ చెబుతున్న మాట. అంతర్జాతీయంగా అనిశ్చితి తొలగే వరకు వెయిట్ చేయడం ముఖ్యం. మొత్తం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ మెంట్లు కాకుండా ఆల్టర్నేట్ గా గోల్డ్, ఈటీఎఫ్, ఫిక్స్ డ్ డిపాజిట్లు మొదలైన వాటిలో కొంత మేరకు మళ్లించడం సేఫ్ అంటున్నారు. లాంగ్ టర్మ్ విజన్ ఉంటేనే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్ గురించి ఆలోచించాలన్నది నిపుణుల సలహా.