Champions Trophy 2025: ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సవరించిన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో ప్రకటించిన 15 మంది జట్టు సభ్యుల బృందం నుంచి ఇద్దరు సభ్యులను తొలగించారు. పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా ని వెన్నునొప్పి సమస్య కారణంగా టోర్నమెంట్ నుండి తప్పించారు. దీంతో అతడి స్థానంలో హర్షిత్ రానా ని జట్టులోకి తీసుకున్నారు. అలాగే యశస్వి జైష్వాల్ ని కూడా జట్టు నుండి తొలగించి.. అతడి స్థానంలో వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నారు.
Also Read: Bangladesh: బంగ్లాదేశ్ టీంలో ఫిక్సింగ్ కలకలం.. ఆ క్రికెటర్‌పై 5 ఏళ్ళు నిషేధం
ఈ మార్పు మాత్రమే కాకుండా.. మరో ముగ్గురు ఆటగాళ్లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. ఈ ముగ్గురు ప్లేయర్లను నాన్ ట్రావెలింగ్ సబిస్టిట్యూడ్ గా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వీరిలో యశస్వి జైస్వాల్ ఓపెనర్ బ్యాటర్ కాగా.. మహమ్మద్ సిరాజ్ పేస్ బౌలర్, ఆల్ రౌండర్ శివమ్ దూబేలను నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్ గా తీసుకున్నారు. జట్టుకు ఏ క్షణంలోనైనా అవసరం పడితే.. ఈ ఆటగాళ్లు దుబాయ్ వెళ్ళనున్నారని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా ఓ ప్రకటనలో తెలిపారు.
అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సవరించిన జట్టును ప్రకటించిన నేపథ్యంలో భారత జట్టులోకి ఐదుగురు స్పిన్నర్లను తీసుకోవడం క్రీడా వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు హైబ్రిడ్ మోడల్ లో ఈ మినీ ప్రపంచ కప్ జరగనుంది. భారత మ్యాచ్ లు మాత్రం తటస్థ వేదిక అయిన దుబాయ్ వేదికగా జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో దుబాయ్ వంటి పిచ్ ల పై స్పీడ్ స్టార్లను వదిలేసి.. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి ప్లేయర్లను ఎంపిక చేయడం వెనుక ఉద్దేశం ఏంటని..? పలువురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి దుబాయ్ పిచ్ లు స్పిన్ బౌలింగ్ కి అనుకూలంగా ఉండడంతో పాటు చాలా నెమ్మదిగా ఉంటాయి. పైగా తేమ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే ఫార్మాట్ కాబట్టి డే అండ్ నైట్ మ్యాచ్ లు జరగనున్నాయి.
లేట్ నైట్ దుబాయ్ లో విపరీతమైన తేమ వస్తుంది. ఈ పరిస్థితుల్లో టాస్ కీలకంగా మారుతుంది. ఇక టాస్ గెలిచిన జట్లు దాదాపు సగం మ్యాచ్ గెలిచినట్లే. ఇక్కడి పరిస్థితుల్లో ప్రతి జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటుంది. సెకండ్ బ్యాటింగ్ చేసే జట్లకు తేమ ఇబ్బందిగా మారుతుంది. బంతి బాగా తడిచి బౌలర్లకు పట్టు దొరకదు. ఈ పరిస్థితులు టీమిండియా విజయ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే పలువురు మాజీ క్రికెటర్లు, క్రీడాభిమానులు మాత్రం శార్దూల్ ఠాకూర్, సిరాజ్ వంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు.