Multiple EMIs: ప్రస్తుత కాలంలో అనేక మంది జీవితాల్లో రుణాలు తీసుకోవడం సాధారణంగా మారింది. గృహ రుణం, కారు రుణం లేదా వ్యక్తిగత రుణం ఇలా అనేకం తీసుకునే వారు ఉన్నారు. ఎందుకంటే ఇవి మనకు త్వరితగతిన అవసరమైన ఆర్థిక అవసరాలను తీర్చుతాయి. కానీ వాటిని తిరిగి చెల్లించే క్రమంలో అసలు ఇబ్బందులు మొదలవుతాయి. రుణం తీసుకున్న తరువాత, వాటిని వడ్డీతో సహా వాటిని తిరిగి చెల్లించాలి. ఇది మన జీతం నుంచి ప్రతి నెలా ఒక EMI రూపంలో కట్ అవుతుంది. మొదట అనేక మంది దీనిని బాధ్యతగానే నిర్వహిస్తారు.
పలు రకాల కారణాలతో
కానీ కొంత కాలం తరువాత అనేక మందికి జాబ్ లాస్ సహా పలు కారణాలతో ఈఎంఐ చెల్లింపులు భారంగా మారుతాయి. దీంతో ఒకేసారి ఒకటికి మించిన ఈఎంఐలను చెల్లించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీంతో అప్పుల భారం మరింత పెరుగుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సులభంగా మీ అప్పులను తీర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
1. ముందుగా ఈ రుణాలు చెల్లించండి
మీకు ఒకే సమయంలో చాలా రుణాలు ఉన్నట్లయితే, వాటిలో అత్యంత ఎక్కువ వడ్డీ ఉన్న రుణాన్ని ముందుగా తిరిగి చెల్లించండి. ఉదాహరణకు వ్యక్తిగత రుణాలు ఇతర రుణాల కంటే ఎక్కువ వడ్డీని కల్గి ఉంటాయి. కాబట్టి, మీరు వ్యక్తిగత రుణం తీసుకున్నట్లయితే, ముందుగా దానిని చెల్లించండి. ఈ పద్ధతిని పాటించడం ద్వారా మీరు ఎక్కువ వడ్డీ రుణం నుంచి త్వరగా బయటపడవచ్చు.
2. బంగారం వాడకం
పురాతన కాలం నుంచి బంగారం ప్రతి కుటుంబానికి ఒక రక్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు. మీకు ఇతర అప్పులు ఎక్కువగా ఉంటే, మీ బంగారాన్నిగోల్డ్ లోన్ పెట్టి, వచ్చిన మొత్తంతో అప్పుల భారాన్ని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్ లోన్ ద్వారా తీసుకున్న మొత్తానికి వడ్డీ తక్కువగా పడుతుంది. కాబట్టి మీరు మీ అప్పులను తీర్చడానికి డబ్బు అవసరమైనప్పుడు ఈ మార్గాన్ని ఉపయోగించవచ్చు. లేదంటే గోల్డ్ అమ్మి అయినా మీ అప్పుల భారాన్ని తొలగించుకుని ఉపశమనం పొందవచ్చు.
Read Also: Upcoming Smartphones April 2025: ఏప్రిల్లో రాబోయే …
3. ఆస్తి సహాయపడుతుంది
అప్పుల ఊబిలో చిక్కుకున్నప్పుడు, మీరు ఆస్తి నుంచి కూడా డబ్బు పొందటం గురించి ఒక ఆలోచన చేయవచ్చు. మీరు లైఫ్ ఇన్సూరెన్స్, భూములు, ఇల్లు వంటి వాటి నుంచి పెద్ద లోన్ తీసుకుని చిన్న చిన్న అప్పులను తీర్చుకోవచ్చు. అప్పులు భారం మరి ఎక్కువగా ఉంటే ఏదైనా ఆస్తిని తొలగించి తీర్చుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆస్తి విషయాలను జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి.
4. ఆదాయాన్ని పెంచుకోవడం
ఇదే సమయంలో మీ ఆదాయాన్ని పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరు ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తుంటే, మీకు కుదిరిన సమయంలో ఏదైనా ఇతర పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ సంపాదించే అవకాశం ఉంటే ట్రై చేయండి. కుదిరితే మీరు అదనపు పనుల ద్వారా మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా, మీరు మీ అన్ని రుణాల EMIలను సులభంగా చెల్లించుకునే అవకాశం ఉంటుంది. ఇలా క్రమంగా చేయడం ద్వారా మీరు మీ అప్పులను మరింత ఈజీగా తగ్గించుకోవచ్చు.
5. లోన్ సెటిల్మెంట్ ఆప్షన్
మీకు ఉన్న రుణాలను తిరిగి చెల్లించడం చాలా కష్టంగా మారిపోతే, మీరు లోన్ సెటిల్మెంట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. లోన్ సెటిల్మెంట్ అంటే, మీరు మీ రుణాన్ని పూర్తిగా లేదా కొంత మేర చెల్లించడం ద్వారా బ్యాంకుతో ఒప్పందం చేయడం. మీరు ముందుగా అత్యధిక వడ్డీ ఉన్న రుణాన్ని సెట్ చేసి, దానిని పరిష్కరించుకోవచ్చు. ఇది ఒక తక్కువ మొత్తాన్ని చెల్లించడం ద్వారా, మీ రుణాన్ని ముగించడంలో సహాయపడుతుంది.