Prithviraj Sukumaran:మలయాళ దర్శకుడు, నటుడు అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం ఈయన మోహన్ లాల్ (Mohanlal)తో ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయి, సరికొత్త రికార్డు సృష్టించింది. మార్చి 27వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్ల జోరు చూపిస్తూ రికార్డు సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా లూసిఫర్ సినిమా విషయంలో కేవలం తన కుమారుడిని మాత్రమే తప్పుగా చూపిస్తూ కొంతమంది దూషిస్తున్నారు అంటూ పృధ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లికా (Mallika)ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే .ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్ ను మాత్రమే బలి పశువును చేశారని, ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తన కుమారుడికి చిత్ర పరిశ్రమలో చాలామంది శత్రువులు ఉన్నారని, నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా రాణిస్తుండడంతో ఆయన ఎదుగులను చూసి జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే లూసిఫర్ 2 ఎంపురాన్ సినిమాను దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నారని పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లికా ఆరోపించింది
ఆయన ఒక్కడే మనసాక్షి ఉన్న కళాకారుడు -పృథ్వీరాజ్ తల్లి
ఇకపోతే పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ లూసిఫర్ 2 సినిమాకి దర్శకత్వం వహించడమే కాదు నటించాడు కూడా.. ఇందులో ఆయన నటించిన పాత్రే విమర్శలకు దారి తీసింది. అందులో భాగంగానే ఆయనపై కొన్ని వర్గాల వారు ప్రత్యేకించి టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడంతో భావోద్వేగానికి గురైన మల్లిక, ఈ విధంగా తన ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు కష్ట సమయాలలో తమకు ఒక స్టార్ హీరో అండగా నిలిచారు అని చెప్పి కాస్త ఊరట పొందినట్లు తెలిపింది. “రంజాన్ పండుగ ఉన్నప్పటికీ కూడా మమ్ముట్టి మాకు మెసేజ్ చేశారు. పృథ్వీరాజ్ గురించి ఫేస్బుక్లో నేను చేసిన పోస్ట్ చూసి, చింతించవద్దు అని చెప్పి, మాకు అండగా నిలబడ్డారు. ముఖ్యంగా మీకు ఏదైనా సమస్య వస్తే నేనున్నాను అని మాట ఇచ్చారు. నా కుమారుడికి జరుగుతున్న అన్యాయం వల్ల నేను బాధలో ఉన్నానని ఆయనకు తెలుసు. కాబట్టే ఒక గొప్ప మనస్సాక్షి ఉన్న కళాకారుడైన ఆయన నన్ను ఓదార్చారు. నా పిల్లల గురించి ఎక్కడైనా ప్రతికూలంగా ఏదైనా వార్త కనిపిస్తే.. అది నన్ను మరింత బాధ పెడుతుందని ఆయన అర్థం చేసుకున్నారు. అందుకే నా పిల్లలకి కూడా మమ్ముట్టి చేసిన సహాయాన్ని మర్చిపోవద్దని చెప్పాను. ఇంత జరుగుతున్నా సరే చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా మా కోసం మాట్లాడలేదు. కానీ పరిశ్రమ నుండి సందేశం పంపిన ఏకైక వ్యక్తి మమ్ముట్టి మాత్రమే.. ఆయన పంపిన మెసేజ్ తో నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి” అంటూ మల్లికా తెలిపారు. మొత్తానికి అయితే తమ కుటుంబానికి అండగా నిలబడ్డారని మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Megastar Mammootty) పై ప్రశంసల వర్షం కురిపించారు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక.
సినిమా నుండి 3 నిమిషాల నిడివి సీన్ కట్..
ఇక లూసిఫర్ 2: ఎంపురాన్ సినిమా విషయానికొస్తే.. ఇప్పటికే ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా రూ.220 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక 2002లో గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో రూపొందించిన సన్నివేశాలు చిత్రీకరణ పైన ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఈ వివాదం వల్ల ఈ సినిమా నుండి మూడు నిమిషాల నిడివి ఉన్న షార్ట్ ని కూడా తొలగించారు. ప్రస్తుతం మల్లికా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.