Job Offers: ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రంగం ప్రస్తుతం గందరగోళంలో ఉంది. ఆర్థిక మాంద్యం, గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, కృత్రిమ మేధస్సు ప్రభావంతో పలు కంపెనీలు మెల్లగా నియామకాలను తగ్గిస్తున్నాయి. కానీ, ఈ క్లిష్ట సమయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. FY2025-26 సంవత్సరానికి TCS ఏకంగా 42,000 ట్రైనీల నియామకం చేయాలని ప్రకటించడం విశేషం. ఇది ఉద్యోగార్థులకు మాత్రమే కాదు, ఐటీ రంగ భవిష్యత్తుపై పాజిటివ్ దృష్టిని కలిగించే వార్త. కానీ ఇదే సమయంలో కంపెనీ జీతాల పెంపును మాత్రం ఆలస్యం చేస్తుందనే స్పందన వ్యక్తమవుతోంది.
అవకాశాల వెల్లువ
TCS చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కాడ్ ప్రకటించిన ప్రకారం, కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా గత ఏడాది మాదిరిగానే 42,000 మంది ట్రైనీలను నియమించనుంది. ఇది ప్రత్యేకించి కాలేజీ నుంచి ఫ్రెష్‌గా బయటకు వస్తున్న యువతకి గుడ్ న్యూస్ కానుంది. ఇప్పుడు పని అవకాశాలు తగ్గుతున్న సమయంలో, ఫ్రెషర్లకు కార్పొరేట్ కెరీర్ ప్రారంభించేందుకు ఇదొక మంచి అవకాశం.
డిజిటల్ స్కిల్స్ ఉన్నవారికి ఎక్కువ చాన్స్
ఇప్పుడు కంపెనీల దృష్టి “డిజిటల్ స్కిల్స్” పై ఎక్కువగా ఉంది. TCS ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. FY25లో చేసిన నియామకాల్లో 40% వరకు డిజిటల్ స్కిల్స్ ఉన్న వారికి సంబంధించినవని వెల్లడించారు. ఇది గత సంవత్సరం కంటే 17% అధికం. అంటే, కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్ టెక్నాలజీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి రంగాల్లో స్కిల్ పెంచుకుంటే, అవకాశాలు ఎక్కువగా లభించే అవకాశం ఉంది.
Read Also: Meta Breakup: మెటాకు షాక్.. ఈ తీర్పుతో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ …
మూడు రకాల అవకాశాలు
TCS నియామకాల్లో ప్రత్యేకత ఏమిటంటే, వారు NQT (National Qualifier Test) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో ఆధారంగా అభ్యర్థులకు మూడు రకాల అవకాశాలు లభిస్తాయి:
-నింజా (Ninja): సాధారణ ప్రవేశ స్థాయి పోస్టులు
-డిజిటల్ (Digital): ప్రత్యేక డిజిటల్ ప్రాజెక్ట్స్ కోసం మిడ్ల్ లెవెల్ రోల్స్
-ప్రైమ్ (Prime): అత్యున్నత ప్రతిభ గలవారికి, అత్యధిక జీతం మరియు కీలక ప్రాజెక్ట్స్
-ఈ విధానం ద్వారా, ఉద్యోగార్థుల ప్రతిభను ప్రామాణికంగా అంచనా వేసి సరైన స్థాయిలో అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది.
పాతవారికీ మద్దతే
FY25లో, TCS ఏకంగా 1.1 లక్షల మందికి ప్రమోషన్ ఇచ్చినట్టు లక్కాడ్ తెలిపారు. ఇది కంపెనీ లోపల సంతృప్తికరమైన వాతావరణం ఉండేలా చూసే విధానం. అలాగే, గత నాలుగు త్రైమాసికాల్లో 13% మంది ఉద్యోగులలో తగ్గింపులు జరిగినా, కంపెనీ తిరిగి భర్తీ చేయడం ద్వారా మానవ వనరుల నిర్వహణలో ముందుంటుందని తెలిపింది.
జీతాల పెంపుపై ప్రభావం
మార్చి 2025 త్రైమాసికంలో, TCS నికర లాభం 1.7% తగ్గి రూ. 12,224 కోట్లకు పరిమితమైంది. ఈ ప్రభావంతోనే కంపెనీ ఈసారి ఏప్రిల్‌లో జరగాల్సిన ఇంక్రిమెంట్లను వాయిదా వేసింది. అయినా, సంస్థ CFO సమీర్ సెక్సారియా ప్రకారం, వ్యాపార వృద్ధిని కాపాడటానికి, మంచి పనితీరు ఉన్నవారికి ప్రోత్సాహం అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ఉద్యోగులలో 70% మందికి పూర్తి వేరియబుల్ పే చెల్లించినట్టు పేర్కొన్నారు. మిగిలిన 30% మందికి మాత్రం పనితీరు ఆధారంగా చెల్లింపులు జరుగుతాయని స్పష్టం చేశారు.
సిద్ధంగా ఉండండి!
ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలిస్తే, ఐటీ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే యువతకు ఇది ఒక మంచి వార్త అని చెప్పవచ్చు. వచ్చే సంవత్సరాల్లో కొత్తగా రాబోయే అవకాశాలకు, కంపెనీల మారుతున్న దృష్టికోణానికి అనుగుణంగా స్కిల్స్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.