EPF ఖాతాదారులకు చాలా ప్రయోజనాలున్నయి. అయితే అన్నీ, అందరికీ తెలియవు. ప్రభుత్వం ఈ విషయంలో ఎంత ప్రచారం కల్పించినా కొంతమంది పూర్తి స్థాయి ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు. ఇక EPF ఖాతాదారులంతా దాదాపు రూ.7 లక్షల జీవిత బీమాకు అర్హులనే విషయం తెలిసిందే. దీన్ని ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం అంటారు. దీనిలో ఇటీవల కీలక మార్పులు జరిగాయి. ఆ మార్పులేంటో మీరూ తెలుసుకోండి.
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరూ EPF స్కీమ్ లో సభ్యత్వం తీసుకుని ఉంటారు. ఈ ఖాతా కలికిన ప్రతి ఒక్కరికీ ఆ పథకానికి సంబంధించిన ప్రయోజనాలే కాకుండా అదనంగా బీమా కవరేజి కూడా అందుతుంది. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకంలో తాజాగా EPFO సంస్థ కీలక మార్పులు చేసింది. కొత్తగా ఉద్యోగంలో చేరే వారితో పాటు అందరికీ ప్రయోజనాలు చేకూరేలా కీలక మార్పులు జరిగాయి. గతంలో ఉద్యోగంలో చేరిన తొలి ఏడాది ఈ ప్రయోజనం వర్తించడంలో కొన్ని ఇబ్బందులున్నాయి. తాజాగా చేసిన మార్పుల ద్వారా ఉద్యోగంలో చేరిన తొలి ఏడాదిలోనూ బీమా కవరేజీ లభించేలా కీలక సవరణ తీసుకొచ్చింది EPFO. ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరంలో సదరు ఉద్యోగి మరణిస్తే EPFO లో అతను దాచుకున్న మొత్తం తిరిగి కుటుంబానికి అందిస్తారు కానీ, బీమా పాలసీ వర్తించదు. కానీ ఇకపై తొలి ఏడాదిలో ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి రూ.50 వేల బీమా మొత్తం అందుతుంది. దీని ద్వారా సగటున ప్రతి ఏడాదీ 4వేల కుటుంబాలు లబ్ధి పొందుతాయని తెలుస్తోంది.
ఇక ఉద్యోగానికి రాజీనామా చేసినా, లేక ఉద్యోగం నుంచి తొలగించబడినా కూడా గతంలో బీమా ప్రయోజనం వర్తించేది కాదు. కానీ ఇకపై అలాంటి ఉదాహరణల్లో కూడా ప్రయోజనం వర్తిస్తుంది. ఒక వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన ఆరు నెలలలోపు మరణిస్తే వారికి కూడా బీమా వర్తిస్తుంది. అంటే సదరు ఉద్యోగి చివరి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ జమ చేసిన 6 నెలలలోపు మరణిస్తే ఆ కుటుంబానికి బీమా సొమ్ము అందుతుందనమాట. అయితే కంపెనీ రోల్స్ నుంచి ఉద్యోగి పేరును పూర్తిగా తొలగించకపోతేనే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి.
మూడో మార్పు కూడా దాదాపు ఇలాంటిదే. ఒక ఉద్యోగి కొత్త ఉద్యోగం కోసం వెదుక్కునే క్రమంలో, లేక ప్రమోషన్ కోసం వేరే కంపెనీలో చేరే క్రమంలో కొంతకాలం ఖాళీగా ఉండవచ్చు. అంటే ఆ టైమ్ లో జీతం రాదు, EPF ఖాతాలో డబ్బులు జమకావు. అలాంటి సందర్భాల్లో ఆ ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి ప్రయోజనం దక్కేది కాదు. ఇప్పుడు కొత్త మార్పుల ప్రకారం రెండు ఉద్యోగాల మధ్య తేడా రెండు నెలలలోపు ఉంటే ఉద్యోగి సర్వీస్ కంటిన్యూ అవుతున్నట్టుగానే పరిగణిస్తారు. దీనివల్ల ఉద్యోగికి బీమా కవరేజీ వర్తిస్తుంది. ఈ విరామ సమయంలో ఉద్యోగి మరణిస్తే బీమా మొత్తం అతని కుటుంబాని అందిస్తోంది. ఈ మార్పు వల్ల ప్రతి ఏటా వెయ్యి కుటుంబాలకు పైగా లబ్ధి జరుగుతుందని తెలుస్తోంది.
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు చాలామంది బయట ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటుంటారు. వాటికి వేర్వేరుగా ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ద్వారా బీమా ప్రయోజనాలు పొందవచ్చు. దీనికోసం సదరు కంపెనీయే బీమా ప్రీమియం చెల్లిస్తుంది. ఉద్యోగి సర్వీస్ వ్యవధి, చివరి 12 నెలల జీతం ఆధారంగా దాదాపు రూ.7 లక్షల వరకు ఆ కుటుంబానికి
EDLI ద్వారా బీమా సొమ్ము అందుతుంది.