ఫోన్ పే లేదు, క్యాష్ ఇవ్వండి.
స్కానర్ లేదు, డబ్బులే తీసుకుంటాం.
కర్నాటకలో ఇటీవల చిరు వ్యాపారుల నుంచి వినపడుతున్న సమాధానాలివి. కర్నాటక వ్యాప్తంగా చిరు వ్యాపారులు ఫోన్ పే, గూగుల్ పే చెల్లింపుల్ని తిరస్కరిస్తున్నారు. క్యాష్ ఇస్తేనే వస్తువులు ఇస్తాం అని మొండిపట్టు పట్టారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. చిరు వ్యాపారుల సందేహాల్ని తొలగించేందుకు ప్రచారం మొదలు పెట్టింది. వ్యాపారులంతా నో(NO) జీఎస్టీ అంటుంటే, ప్రభుత్వం నో (KNOW) జీఎస్టీ అంటూ ప్రచారం స్టార్ట్ చేసింది. మరి దీనివల్ల ఉపయోగం ఉంటుందో లేదో చూడాలి.
ఎందుకీ రగడ..?
కర్నాటకలో ఇటీవల యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తున్న వ్యాపారులందరికీ జీఎస్టీ డిపార్ట్ మెంట్ నుంచి నోటీసులొచ్చాయి. వార్షిక టర్నోవర్ రూ. 40 లక్షలు పైన ఉన్నవారంతా పన్ను చెల్లించాల్సి వస్తుందంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. రూ.20 లక్షలు పైగా టర్నోవర్ ఉన్నవారంతా జీఎస్టీ వద్ద నమోదు చేయించుకోవాలని సూచించారు. దీంతో వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. దీనంతటికీ కారణం యూపీఐ పేమెంట్స్ అని తేలింది. వెంటనే వారంతా స్కానర్లు తీసి గల్లా పెట్టలో పెట్టేశారు. నో స్కానర్, ఓన్లీ క్యాష్ అంటూ కస్టమర్లకు తేల్చి చెబుతున్నారు.
కస్టమర్ల ఆందోళన..
చిన్నదానికీ పెద్దదానికీ షాపులోకి వెళ్తే వెంటనే ఫోన్ తీసి స్కానర్ ని వెదుక్కోవడం అందరికీ అలవాటైపోయింది. 10రూపాయల వస్తువైనా ఫోన్ పే చేస్తామంటున్నారు. దీని ద్వారా పర్సు మెయింటెన్ చేయాల్సిన అవసరం అందరికీ తగ్గిపోయింది, పైగా చిల్లర సమస్యలు అసలే లేవు. అయితే వీటి ద్వారా వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. యూపీఐ పేమెంట్స్ ద్వారా వారి టర్నోవర్ కచ్చితంగా తెలిసిపోతోంది. గతంలో లాగా మా టర్నోవర్ తక్కువ అంటూ ఎవరూ తప్పించుకోలేని పరిస్థితి. లెక్కలు ఆన్ రికార్డ్ పక్కాగా ఉండటంతో జీఎస్టీ డిపార్ట్ మెంట్ నోటీసులు పంపించింది. వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలుగా ఉన్నవారంతా పన్నులు చెల్లించాలని సూచించింది. దీంతో వ్యాపారస్తులు ఓ ఉపాయం ఆలోచించారు. యూపీఐ పేమెంట్స్ ని అంగీకరించకపోతే అసలు ఏ ఇబ్బంది ఉండదు కదా అని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే స్కానర్లు తీసి పక్కనపెట్టారు. ఈనెల 23 నుంచి 3 రోజులపాటు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. వీరికి మద్దతుగా క్యాబ్ డ్రైవర్స్ కూడా రంగంలోకి దిగారు. తాము కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ని అంగీరించేది లేదని వారు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వంలో కలవరం మొదలైంది.
కర్నాటక సీఎంగా ఉన్న సిద్ధరామయ్య ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తున్నారు. ఆయన కేంద్రంతో చర్చలు జరుపుతామని వ్యాపారులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే GST కౌన్సిల్ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. ఆలోగా జీఎస్టీ గురించి తెలుసుకోండి(KNOW GST) అనే ప్రచార కార్యక్రమం మొదలు పెట్టారు. జీఎస్టీ నోటీసులతో ఎవరికీ నష్టం లేదని, కేవలం వ్యాపారులు నమోదు చేసుకుంటే సరిపోతుందని ఆయన అంటున్నారు. అయితే పాత పన్ను బకాయిలు వసూలు చేసేందుకు కూడా తమకు నోటీసులిచ్చారంటూ వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వం మాత్రం వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ లేకపోవడంతో ప్రస్తుతం కర్నాటకలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.