Advance Train Ticket Booking for Pongal 2025: సంక్రాంతి పండగ అంటేనే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పండగ వస్తే చాలు హైదరాబాద్ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతాయంటే అర్థం చేసుకోవాలి. అలాంటి సంక్రాంతికి ఇంటికి వెళ్లాలంటే మామూలు వ్యవహారం కాదు. ముందుగా రిజర్వేషన్ చేయించుకోకపోతే ఇబ్బందులు పడాల్సిందే.
సాధారణంగా సంక్రాంతి పండక్కి సికింద్రాబాద్ నుంచి ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలు, రాజమండ్రి, కాకినాడ, నరసాపురం వైపు రద్దీ ఎక్కువగా ఉంటుంది. పుణె, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉన్నవాళ్లు సైతం సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి ప్రయాణానికి టికెట్లు అందుబాటులోకి రాగానే బుకింగ్స్ చేసుకుంటారు.
అందుకే ప్రతి ఒక్కరూ ఎప్పుడెప్పుడూ బుకింగ్స్ మొదలవుతాయని ఎదురుచూస్తుంటారు. తాజాగా, ఆ తేదీ రానే వచ్చింది. రైల్వే ప్రయాణికులకు దక్షిణ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండగను పురస్కరించుకొని రైలు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటుంది.
సంక్రాంతి పండగంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్లంతా సొంతింటికి వస్తుంటారు. ఈ తరుణంలో దక్షిణ రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నాలుగు నెలల ముందే రైలు టికెట్ల రిజర్వేషన్‌ను ప్రారంభించింది. ఈ మేరకు దక్షిణ రైల్వే.. రైలు టికెట్ల ముందస్తు రిజర్వేషన్‌ను సెప్టెంబర్ 12నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం చివరి నిమిషంలో రద్దును నివారించేందుకు 4 నెలల ముందే ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి 15, 16, 17 తేదీలలో తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి పండగను జరుపుకోనున్నారు. ఈ తరుణంలో జనవరి 10న సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులు సెప్టెంబర్ 12 నుంచి టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే జనవరి 11న ప్రయాణించాలనుకునే ప్రయాణికులు సెప్టెంబర్ 13 నుంచి బుకింగ్, జనవరి 12 న ప్రయాణానికి సెప్టెంబర్ 14 నుంచి రైలు టికెట్లను బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రయాణికులు తమ టికెట్లను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా టికెట్ రిజర్వేషన్ కేంద్రాల్లో బుక్ చేసుకోవాలని దక్షిణ రైల్వే వెల్లడించింది.
Also Read: తత్కాల్ రైలు టికెట్ బుక్ చేసుకోవడం సమస్యగా ఉందా?.. కన్‌ఫర్మ్ టికెట్స్ కోసం ఈ యాప్ ఉందిగా!..
ఇదిలా ఉండగా, ప్రతి ఏడాది దీపావళి, సంక్రాంతి పండుగలకు చెన్నై నుంచి 6 లక్షల మందికిపైగా ప్రయాణికులు తమ సొంతూళ్లకు పయనమవుతుంటారని దక్షిణ రైల్వే చెప్పింది. అందుకే రైలు టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రాగానే హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. ఎక్కువగా మహారాష్ట్ర నుంచి సికింద్రాబాద్ మీదుగా ఒడిశా, బెంగాల్.. బెంగళూరు, చెన్నై నుంచి వెళ్లే రైళ్లకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి ప్రయాణానికి టికెట్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారు.