Visakhapatnam-Hazrat Nizamuddin Samata Express Canceled: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి న్యూఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ మధ్య సర్వీసులు కొనసాగించే సమత ఎక్స్ ప్రెస్ ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన విడుదల చేసింది. నాగపూర్ డివిజన్ లో నూతనంగా ట్రాక్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈ పనులు సుమారు 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్నారు. అప్పటి వరకు ఈ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రద్దు అంటే?
సమత ఎక్స్ ప్రెస్ రైలును ఈనెల 30, మే 1, 3, 4, 6న విశాఖపట్న-నిజాముద్దీన్ మధ్య నడిచే సమత ఎక్స్‌ప్రెస్ (12807)ను క్యాన్సిల్ చేసినట్లు సందీప్ వెల్లడించారు. అటు మే 2, 3, 5, 6, 8న తిరుగు ప్రయాణంలోని నిజాముద్దీన్-విశాఖ మధ్య నడిచే సమత ఎక్స్‌ప్రెస్ (12808)ను క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు. ఈ రైల్వే ప్రయాణీకులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ రైలులో ప్రయాణించే ప్యాసింజర్లు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. నాగ్ పూర్ పరిధిలో రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత సమత ఎక్స్ ప్రెస్ రైలు సేవలు యథావిధిగా కొనసాగుతాయని సందీప్ ప్రకటించారు.
Read Also: కత్రా- శ్రీనగర్ రూట్ లో కస్టమైజ్డ్ వందే భారత్ రైళ్లు, వామ్మో ఇన్ని ప్రత్యేకతలా?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 6 ప్లాట్ ఫారమ్స్ మూసివేత
అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పనులకు ఆటంకం కలగకుండా మరో 6 ప్లాట్ ఫారమ్ లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. సుమారు నాలుగు నెలల పాటు ఈ మూసివేత కొనసాగుతుందని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణీకులకు తాత్కాలికంగా అసౌకర్యం కలిగినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని అధికారులు తెలిపారు. ఈ 6 ప్లాట్ ఫారమ్ ల మీదుగా రాకపోకలు కొనసాగించే సుమారు 60 రైళ్లను హైదరాబాద్ లోని ఇతర రైల్వే స్టేషన్లకు దారి మళ్లించనున్నారు. ఈ రైళ్లను చర్లపల్లి, కాచిగూడ సహా ఇతర స్టేషన్ల నుంచి నడిపించాలని నిర్ణయించారు. వీటిలో ఎక్కువ రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి ప్రయాణాలు కొనసాగించనున్నాయి. ప్రయాణీకులు దారి మళ్లించిన ఆయా రైళ్ల వివరాలను తెలుసుకుని, ప్రయాణీకులు సంబంధిత రైల్వే స్టేషన్లకు వెళ్లాలనని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కీలక ప్రకటన జారీ చేశారు.
Read Also: ఇండియాకు జపాన్ అదిరిపోయే గిఫ్ట్, రెండు బుల్లెట్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!