భారత్ లో టూవీలర్ల ధరలు భారీగా పెరగబోతున్నాయి. అన్ని కంపెనీలు ఈ పెంపుని అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. టూవీలర్ల తయారీలో వాడే విడిభాగాల ధరలు పెరగడమో, ప్రభుత్వం పన్నులు పెంచడమో లేక యుద్ధాల ప్రభావమో కాదు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయం వల్ల టూవీలర్ల ధరల్లో భారీ పెరుగుదల ఉండబోతోంది. ఇంతకీ ఏంటా నిర్ణయం..? దానివల్ల బైక్ ల ధరలు ఎందుకు పెరగబోతున్నాయి..?
ABS సిస్టమ్
భారత్ లో బైక్ ల ధరలు పెరగబోతుండడానికి ప్రధాన కారణం ABS సిస్టమ్. ప్రస్తుతం ఈ సిస్టమ్ అన్ని బైక్ లలో లేదు. 150 సీసీ దాటిన ప్రీమియం మోడల్స్ కి మాత్రమే దీన్ని అమరుస్తారు. అందువల్ల 150 సీసీ దాటిన బైక్ ల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇప్పుడు మిగతా టూవీలర్లకు కూడా ABS సిస్టమ్ ని కేంద్రం తప్పనిసరి చేస్తోంది. అంటే దీనివల్ల కొత్తగా అమ్ముడయ్యే మిగతా టూవీలర్లు కూడా ABS సిస్టమ్ తో రోడ్ పైకి రావాల్సిందే. అంటే దానికోసం అయ్యే అదనపు భారాన్ని కంపెనీలు భరించాల్సిందే. కంపెనీలు ఆ రేటుని కచ్చితంగా వినియోగదారులకు బదిలీ చేస్తాయి. అంటే ABS సిస్టమ్ కోసం అవసరమయ్యే అదనపు భారం చివరిగా వినియోగదారుడిపై పడుతుంది. ఆమేరకు రేట్లు పెరుగుతాయి. కనిష్టంగా 2500 రూపాయలనుంచి, గరిష్టంగా 5వేల రూపాయల వరకు బైక్ ల ధరలు పెరిగే అవకాశముంది.
ABS సిస్టమ్ అంటే ఏంటి..?
యాంటీ లాక్ బ్రేకింగ్(ABS) సిస్టమ్. వాహనాల వేగాన్ని నిరోధించే క్రమంలో బ్రేకింగ్ సిస్టమ్ కి అమర్చిన భద్రతా వ్యవస్థ ఇది. గతంలో సాధారణ బ్రేక్ లు ఉండేవి. వాహనాన్ని ఆపితే బ్రేక్ లు చక్రాలను గట్టిగా పట్టుకునేవి. వాహనం ఆగుతుంది. అయితే సడన్ గా బ్రేక్ వేస్తే వాహనం స్కిడ్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువ. దీన్ని నివారించేందుకు 1970ల్లో ABS సిస్టమ్ ని తీసుకొచ్చారు. దీన్ని అప్ డేట్ చేస్తూ ఇప్పుడున్న నూతన విధానాన్ని తీసుకొచ్చారు. వేగంగా వెళ్తున్న కారు, బైక్ లేదా ఇతర వాహనాలకు బ్రేక్ వేస్తే స్కిడ్ కాకుండా ABS సిస్టమ్ దాన్ని ఆపుతుంది. ప్రమాదాలు నివారించేందుకు పెద్ద పెద్ద వాహనాల్లో దీన్ని తప్పనిసరి చేశారు. బస్సులు, లారీలు, కార్లు ఇలా వీటన్నిటికీ ABS సిస్టమ్ ఉంది. అయితే టూవీలర్లలో మాత్రం కొన్నిటికే దీన్ని ఉపయోగిస్తున్నారు. 150 సీసీ కంటే ఎక్కువ కెపాసిటీ ఉండి ఎక్కువ స్పీడ్ తో వెళ్లే బైక్ లకు మాత్రమే ABS సిస్టమ్ ఉంటోంది. ఇది లేకపోవడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్ర రవాణాశాఖ భావిస్తోంది. అందుకే జనవరి-1, 2026నుంచి దీన్ని తప్పనిసరి చేసింది.
అంటే 2026 జనవరి-1 తర్వాత మార్కెట్లోకి వచ్చే కొత్త టూవీలర్లు కచ్చితంగా ఈ కొత్త సిస్టమ్ తో ఉండాల్సిందే. అంటే వాటి రేట్లు కూడా భారీగా పెరుగుతాయి. రేటు పెరిగినా ఇది వాహనదారుడిని ప్రమాదానికి గురికాకుండా చేస్తుంది. అందుకే దీన్ని ప్రభుత్వం కంపల్సరీ చేసింది. అయితే దీని భారం అంతిమంగా వినియోగదారుడిపై పడకుండా ఆపలేకపోతోంది. సో.. జనవరి-1 తర్వాత బైక్ కొనాలంటే కచ్చితంగా అదనంగా మరో రూ.5వేల వరకు సమకూర్చుకోవాల్సిందే.