పెట్రోల్ వాహనాలు, డీజిల్ వాహనాలకు వేర్వేరు ఇంజిన్లు ఉంటాయి. ఒకదానికోసం తయారు చేసిన ఇంజిన్లో ఇంకో రకం ఇంధనం నింపితే మొదటికే మోసం వస్తుంది. ఇంధన కల్తీ గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. పెట్రోల్ ని కిరోసిన్ తో కల్తీ చేసి అమ్మేస్తుంటారు కొంతమంది. అలాంటి సందర్భాల్లో ఇంజిన్ త్వరగా డ్యామేజీ అవుతుంది. డీజిల్ లో కల్తీ జరిగినా అంతే. మరి పెట్రోల్, డీజిల్ లో ఇథనాల్ కలిస్తే ఏమవుతుంది? వాహనాల ఇంజిన్లు ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకోగలవా? ఈ ప్రశ్నకు కేంద్రం తాజాగా మరోసారి జవాబిచ్చింది.
E10 – E20
భారత్ లో పెట్రోల్ లో 10శాతం ఇథనాల్ కలిపి వాడుతున్నారు. దీన్ని E10 ప్రామాణికతతో పోలుస్తారు. ఇటీవల ఇథనాల్ శాతాన్ని 20శాతానికి పెంచింది కేంద్రం. దీన్ని E20 అంటారు. అయితే ఇలా కేంద్రం ఇథనాల్ శాతాన్ని పెంచుకుంటూ పోతే, దానివల్ల వాహనాల ఇంజిన్లు డ్యామేజ్ అవుతాయనే అపవాదు కూడా ఉంది. ఇటీవల ఓ వినియోగదారుడు టయోటా కంపెనీని అడిగిన ప్రశ్నలో ఈ సమాధానం వచ్చింది. తమ కంపెనీ తయారు చేసే కార్లు కేవలం E10 ఇంధనాన్ని మాత్రమే సపోర్ట్ చేస్తాయని, E20 పెట్రోల్ వాడితే ఇంజిన్ వారెంటీ ఉండదని కంపెనీ సమాధానం చెప్పింది. దీంతో వాహనదారులు మరింత ఆందోళనకు గురయ్యారు. అయితే అలాంటి ఆందోళనలేవీ పెట్టుకోవద్దని తాజాగా కేంద్ర రవాణా శాఖ ప్రకటించడం విశేషం.
ఆర్థికంగా మేలు..
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని కేంద్ర రవాణాశాఖ తెలిపింది. దాదాపు 245 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురుకి ఇది ప్రత్యామ్నాయం అని, దీని ద్వారా 736 లక్షల మెట్రిక్ టన్నుల CO2 ఉద్గారాలను కూడా తగ్గించగలిగామని చెబుతున్నారు. పెట్రోల్ లో 20శాతం ఇథనాల్ ని కలపడంతో వస్తున్న వ్యతిరేక వార్తల్ని పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. దీనివల్ల కేంద్రానికి ఆర్థికంగా మేలు జరగడంతోపాటు వాహనదారులకు కూడా ఉపయోగం ఉంటుందని తెలిపింది. E20 పెట్రోల్ కారణంగా మైలేజ్ గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేశారు అధికారులు. వాతావరణ కాలుష్య నివారణ చర్యల్లో 2070 నాటికి జీరో ఎమిషన్ టార్గెట్ ని చేరుకోడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుందని అంటున్నారు.
కాలుష్య నివాణ..
చెరకు ద్వారా తయారైన ఇథనాల్ ని వాడితే గ్రీన్ హౌస్ వాయువుల(GHG) ఉద్గారం 65 శాతం తగ్గుతుంది. అదే మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ వాడితే GHG ఉద్గారాలు పెట్రోల్ కంటే 50శాతం తక్కువ అవుతాయి. NITI ఆయోగ్ ఈ విషయాన్ని స్పష్టం చేసిందని కేంద్రం చెబుతోంది. చెరకు, మొక్కజొన్న పంటలు పండించే రైతులకు ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. మొత్తమ్మీద E20 పెట్రోల్ ని వాడాలని కేంద్రం వినియోగదారుల్ని ప్రోత్సహిస్తోంది. అయితే వీటివల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయనే అపోహ మాత్రం కొంతమందిలో అలాగే ఉంది.
ఆక్టేన్ పెట్రోల్..
ఇథనాల్ కలవని పెట్రోల్ ని 100 ఆక్టేన్ పెట్రోల్ అంటారు. ఇండియన్ ఆయిల్, హిందూస్తాన్ పెట్రోలియం కంపెనీలు ఆక్టేన్ పెట్రోల్‌ని ప్రత్యేకంగా విక్రయిస్తుంటాయి. ఆక్టేన్ పెట్రోల్‌ను ఉపయోగిస్తే వాహనాల ఇంజిన్ లైఫ్ పెరుగుతుందని, మైలేజ్, స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటాయని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే దీని ఖరీదు కాస్త ఎక్కువ. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం E20 పెట్రోల్ నే వాడాలని సిఫారసు చేస్తోంది.