అన్నా ఫోన్ పే చేశాను చూస్కో..
నాకింకా మెసేజ్ రాలేదు..
నేను చేశాను, నా బ్యాంక్ లో డబ్బులు కూడా కట్ అయ్యాయి.
యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో ఇలాంటి సంభాషణలు సహజం. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ మాటలు వినపడుతున్నాయి. యూపీఐ సేవలు స్తంభించడంతో లక్షలాదిమంది షాకయ్యారు. లావాదేవీలన్నీ నిలిచిపోయాయి.
ఫోన్ పే ఒక్క నిమిషం పనిచేయకపోతే మనం అల్లాడిపోతాం. షాపుకి వెళ్లి బిల్ కట్టే టప్పుడు నెట్ వర్క్ సమస్య ఏర్పడినా, బ్యాంక్ సర్వర్ డౌన్ అయినా కాసేపు మనకు చేతులు, కాళ్లు ఆడవు. అలాంటిది దేశవ్యాప్తంగా అందరికీ ఒకేసారి సమస్య వచ్చింది. ఇది బ్యాంకుల వల్ల వచ్చిన సమస్య కాదు, ఏకంగా యూపీఐలో ఏర్పడిన సమస్య. దీంతో ఎవరి ఫోన్ పేలు, గూగుల్ పేలు పనిచేయలేదు. ఫండ్స్ ట్రాన్స్ ఫర్ చేసే యాప్ లు ఏవీ వినియోగించడానికి వీల్లేకుండా పోయాయి. దీంతో యూజర్లు లబోదిబోమంటున్నారు.
అందరిలో అయోమయం
బజారుకెళ్లేటప్పుడు పర్స్ లేకపోయినా పర్లేదు, ఫోన్ లేకపోతేనే పెద్ద సమస్య. చేతిలో డబ్బులు లేకపోయినా ఫోన్ ఉంటే చాలు బయటకెళ్లి ఏ వస్తువయినా కొనుక్కొని వచ్చే వెసులుబాటు ఇప్పుడు ఉంది. అందుకే ధైర్యంగా అందరూ ఫోన్ మాత్రమే తీసుకుని బయటకు వెళ్తుంటారు. అలాంటిది కొన్ని గంటలుగా దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు బంద్ అయ్యాయి. నెట్ వర్క్ సమస్య ఉందేమోనని అందరూ మొదట ఊహించారు. కానీ యూపీఐలోనే సమస్య కావడంతో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ గందరగోళంగా మారాయి.
షాపుల ముందు పడిగాపులు
హోటల్ లో ఫుడ్ తిన్న కస్టమర్లు, బిల్ తీసుకున్న తర్వాత యూపీఐ ద్వారా పేమెంట్ చేద్దామని ట్రై చేసి విసిగిపోయి అక్కడే కాసేపు పడిగాపులు పడ్డారు. తీరా ఎలాగోలా డబ్బులు అరేంజ్ చేసుకుని బిల్ కట్టి వెళ్లిపోయారు. దేశవ్యాప్తంగా ఈ సాయంత్రం చాలా హోటళ్లలో, ఇతర షాపుల వద్ద ఇలాంటి ఘటనలే జరిగాయి. ఈరోజు సాయంత్రం 7 గంటల తర్వాత ఈ సమస్య ఉత్పన్నమైనట్టు తెలుస్తోంది.
తీరిగ్గా NPCI ప్రకటన
యూపీఐ బాధితులంతా తమ గోడు సోషల్ మీడియాలో వెళ్లబోసుకున్నారు. తనకు ఫలానా షాపులో ఇలాంటి అనుభవం ఎదురైందని, తనకు ఫలానా చోట ఫోన్ పే పనిచేయలేదని సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. అధికారికంగా ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ధ్రువీకరించడం విశేషం సాంకేతిక సమస్యల కారణంగా యూపీఐ సేవలు ఆగిపోయాయని అధికారులు చెబుతున్నారు. కొద్ది సేపటి క్రితమే సమస్య పరిష్కారమైందని, వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని NPCI ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
NPCI had faced intermittent technical issues owing to which UPI had partial decline. The same has been addressed now and the system has stabilised. Regret the inconvenience.
— NPCI (@NPCI_NPCI) March 26, 2025
సాంకేతిక సమస్యలు అంటున్నారే కానీ, వాటి గురించి సదరు NPCI ఎలాంటి వివరణ ఇవ్వలేదు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రిపీట్ కాకుండా చూడటానికి వారు ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో అప్పుడప్పుడు, అక్కడక్కడ ఇలాంటి సమస్యలు ఎదురైనా, దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో యూపీఐ సేవలు స్తంభించడం ఇదే తొలిసారి అంటున్నారు.