Gold: ఇప్పుడంటే.. అన్నీ డిజిటల్ పేమెంట్స్, కుదిరితే క్యాష్ పేమెంట్లు. ఎలాంటి బిజినెస్ అయినా.. ఏ రకమైనా లావాదేవీలైనా.. ఇవే పేమెంట్ మోడ్స్. కానీ.. వేల ఏళ్ల క్రితం.. వర్తక, వాణిజ్యాలు వేటితో సాగేవి అంటే.. అంతా ఠక్కున చెప్పే ఒకే ఒక్క ఆన్సర్.. గోల్డ్ కాయిన్స్. అసలు.. బంగారు నాణేలు ఎప్పుడు వాడుకలోకి వచ్చాయి? ఎవరి కాలంలో తీసుకొచ్చారు? ఇప్పటిదాకా మనం చదువుకున్నది.. నమ్మింది.. అంతా ట్రాషేనా? పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పుడు కొత్తగా తేల్చిందేంటి?
భూమిలోపల పదిలంగా శతాబ్దాల నాటి ఆనవాళ్లు..
ఈ దేశ చరిత్రకు చెందిన ఆనవాళ్లు, వాటికి సంబంధించిన వాస్తవాలు.. ఈ భూమిలోనే భద్రంగా ఉన్నాయ్. అప్పుడప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపినప్పుడు.. అవి బయటపడుతుంటాయ్. మన చరిత్రేంటో మనకు తెలిసేలా చేస్తాయ్. మన పూర్వీకులు ఎలా జీవించారనే వాస్తవాలను మన కళ్లకు కడతాయ్. అలా.. శతాబ్దాల కిందట బంగారు నాణేలుండవని మనమంతా చదువుకున్నాం. ఇది.. అందరికీ తెలిసిందే. సాధారణంగా.. బంగారు నాణేలంటే.. అవి కుషాణుల పాలనలో విస్తృతంగా వాడుకలోకి వచ్చాయని చెబుతుంటారు. మన చరిత్ర, పుస్తకాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయ్. అయితే.. ఈ వాస్తవం.. తప్పని ఇప్పుడు నిరూపితమైంది. పైగా.. ఈ చరిత్ర ఇప్పుడు పాతబడిపోతోంది. కుషాణులు, హరప్పన్ల తర్వాత వేద ప్రజలు బంగారు నాణేలను.. 3 వేల ఏళ్ల కిందే ఉపయోగించారని.. భారతదేశపు అగ్ర పురావస్తు శాస్త్రవేత్త బీఆర్ మణి నిష్కా తెలిపారు. ఇది.. ప్రాచీన భారతదేశంలో వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, లోహశాస్త్రంపై మనకున్న అవగాహనని పునర్నిర్మిస్తుంది.
నిష్కాని కనుగొన్న అగ్ర పురావస్తు శాస్త్రవేత్త బీఆర్ మణి
దేశంలోని టాప్ ఆర్కియాలజిస్ట్ బీఆర్ మణి చేసిన కొత్త రీసెర్చ్‌లో.. హరప్పా కాలం నాటి ప్రజలు, వేద ప్రజలు నిష్కా అని పిలిచే బంగారు నాణేలను ఉపయోగించారని తేలింది. ఈ నాణేలనే.. కరెన్సీగా, వాణిజ్య ఆస్తులుగా ఆచార సమర్పణలుగా, హోదా చిహ్నాలుగా ఉపయోగించారని మణి చెప్పారు. ఈ సరికొత్త ఆవిష్కరణ.. భారతీయ బంగారు నాణేల చరిత్రని.. దాదాపు మూడు వేల ఏళ్ల కిందటికి నెట్టేసింది. ఇది.. భారత ప్రాచీన ఆర్థిక వ్యవస్థ, సంస్కృతిపై.. మనకున్న అవగాహనని తిరిగి రూపొందిస్తుంది. నిష్కాగా పిలిచే బంగారు నాణేలు.. హరప్పా, సింధు-సరస్వతి నాగరికత పరిణతి చెందిన దశకు తొలి భారతీయ బంగారు నాణేలను సూచిస్తుందని తెలిపారు బీఆర్ మణి.
భారతదేశంలోని తొలి బంగారు నాణేలు నిష్కానే!
కుషాణుల కాలానికి ముందు.. భారతదేశంలో బంగారు నాణేలు లేవని.. చాలా కాలంగా ఉన్న నమ్మకాన్ని సవాల్ చేస్తూ.. పూసలుగా పిలిచే వృత్తాకార, డిస్క్ ఆకారంలో ఉన్న చిల్లులతో ఉన్న బంగారు నాణేలే.. భారతదేశంలోని తొలి బంగారు నాణేలు అని మణి అన్నారు. నిష్కా భారతీయ బంగారు నాణేలా మూలాన్ని.. క్రీస్తు పూర్వానికి తీసుకెళ్లింది. మొహెంజొదారో, లోథాల్, రాఖీగర్హి లాంటి హరప్పా ప్రదేశాల్లో జరిపిన తవ్వకాల్లో.. వివిధ బరువులు, రంధ్రాల పరిణామాలు కలిగిన చిల్లులు గల బంగారు నాణేలు లభించాయి. 1950, 1960ల్లో లోథాల్‌ని తవ్విన పురావస్తు శాస్త్రవేత్త ఎస్ఆర్ రావు.. వాటిని మైక్రో బీడ్స్ అని పిలిచారు. పరిణతి చెందిన హరప్పా నాగరికత ప్రదేశం.. తూర్పు అంచున ఉన్న పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని నిల్వ నుంచి లభించిన చిల్లులు గల బంగారు నాణేలు, నిష్కా నిజమైన ఉద్దేశం గురించి కీలకమైన సమాచారాన్ని అందించాయ్. ఆ నిల్వలోని 40 నాణేలపై రీసెర్చ్ చేసి.. బీఆర్ మణి బంగారు డిస్క్‌ల వెనకున్న నిజాన్ని కనుగొన్నారు.
మన సంప్రదాయం కేవలం ఊహ మీద ఆధారపడి ఉండకూడదు. బుుగ్వేదం, అధర్వణ వేదం, పతంజలి మహాభాష్యం, పాణిని రచన, జాతక కథలు, గోపథ బ్రాహ్మణం, ఇతర హరప్పా, వేద గ్రంథాల్లో.. నిష్క గురించి ప్రస్తావన ఉంది. పురావస్తు శాస్త్రవేత్త మణి ప్రకారం.. అవి కేవలం.. అలంకారమైనవి మాత్రమే కాదని.. కరెన్సీ, వాణిజ్య ఆస్తులు, సామాజిక స్థికి గుర్తులుగా నిలిచాయని మణి చెప్పారు. ఒక ధనవంతుడి సంపదని.. 100 నిష్కా, లేదా 1000 నిష్కాపరంగా లెక్కించేవారని చెప్పారు. ఈ నాణేలు కేవలం ఆభరణాలుగా కాకుండా.. ఆ కాలపు ఆర్థిక, సాంస్కృతిక జీవితంలో అంతర్భాగంగా ఉండేవి. వాటికి ఉన్న చిల్లులు.. రవాణా సౌలభ్యం కోసం గానీ, లెక్కింపు కోసం తీగలని సులభతరం చేసే అవకాశం కోసం గానీ పెట్టి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
భారతదేశ ప్రాచీన వైభవానికి అద్దంపడుతున్న నిష్కా నాణేలు
పురావస్తు శాస్త్రవేత్త బీఆర్ మణి.. ఈ తరం కళ్లు తెరిపించారు. ఈ ఆవిష్కరణ.. భారతదేశ చరిత్రని మనం చూసే విధానాన్ని మారుస్తుంది. తవ్వకాల్లో బయటపడ్డ నిష్కా అనేది.. లావాదేవీల్లో మాత్రమే మిగిలి ఉన్న ఓ జ్ఞాపకం మాత్రమే కాదు.. ప్రాచీన భారతీయులకు స్పష్టమైన ఆస్తి. 3 వేల ఏళ్ల నాటి బంగారు నాణేలు.. భారతదేశ ప్రాచీన వైభవానికి అద్దంపడుతున్నాయ్. మన చరిత్ర గొప్పదనాన్ని, ఆనాటి ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థితిని మరోసారి గుర్తు చేశాయ్. ఈ చిన్నపాటి నాణేలు కేవలం.. బంగారు లోహపు ముక్కలు మాత్రమే కాదు. అవి.. మన పూర్వీకుల నాగరికతకు, వ్యాపార సంస్కృతికి, అద్భుతమైన, ఉన్నతమైన జీవన విధానానికి సాక్ష్యాలు. వేద యుగాలలో.. హరప్పా ప్రజలు, లోహశాస్త్రం, వాణిజ్య నెట్‌వర్క్‌లు, ఆచార పద్ధతులు.. వీటి ద్వారా అర్థమవుతోంది. ఇది.. భారతీ నాగరికతకు బంగారంతో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తోంది. ముఖ్యంగా.. ఇండియన్ గోల్డ్ కాయిన్స్.. హిస్టరీని.. దాదాపు 3 వేల ఏళ్ల కిందటిగా చూపుతోంది.
భారతీయ బంగారు నాణేలకు 3 వేల ఏళ్ల చరిత్ర
సంప్రదాయంగా.. ఇప్పటివరకు మనం చదువుకున్నట్లు, చరిత్రకారులు చెప్పినట్లు.. భారత్‌లో బంగారు నాణేలు కుషాణుల కాలం నాటి నుంచి ఉన్నట్లు చెబుతున్నారు. కానీ.. అంతకంటే ముందే.. 3 వేల ఏళ్ల క్రితమే.. భారత్.. ప్రపంచ వాణిజ్య కేంద్రాల్లో ఒకటిగా వెలుగొందిందనే విషయం ఇప్పుడు స్పష్టమవుతోంది. ఈ బంగారు నాణేల లభ్యత.. ఆనాటి సమాజంలో వస్తు మార్పిడి కాకుండా, ఓ సుస్థిరమైన ద్రవ్య మార్పిడి వ్యవస్థ ఉండేదని స్పష్టం చేస్తోంది. ఈ బంగారు నాణేలు కేవలం.. దేశీయ వ్యాపారానికే పరిమితం కాలేదు. అంతర్జాతీయ వాణిజ్యంలోనూ కీలకంగా వ్యవహరించాయి. సిల్క్ రోడ్ లాంటి ప్రఖ్యాత వ్యాపార వర్గాల ద్వారా.. మన దేశం నుంచి సుగంధ ద్రవ్యాలు, పత్తి వస్త్రాలు, విలువైన రాళ్లు, లోహాలు.. రోమ్, గ్రీకు, ఈజిప్ట్ లాంటి దూరప్రాంత దేశాలకు ఎగుమతి అయ్యేవి. ప్రతిగా ఆ దేశాల నుంచి బంగారం, వెండి నాణేలు దిగుమతి అయ్యేవి. ఈ నాణఏలు ఒక దేశం నుంచి మరొక దేశానికి సంపద ప్రవాహానికి ప్రతీకగా నిలిచాయి.
Also Read: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..
గత తాలూకూ ఘనతని, వైభవాన్ని చాటి చెప్పిన నాణేలు
నిష్కా.. భారత్‌కు సంబంధించిన తొలి బంగారు నాణేలుగా, సింధు-సర్వతి నాగరికత, వేద సంస్కృతుల ప్రజలు దీనిని ఉపయోగించినట్లుగా తేలింది. ఇది.. పాఠ్యపుస్తకాల్లోని సంప్రదాయ కథనాన్ని సవాల్ చేస్తోంది. అంతేకాదు.. హరప్పా, వేది ఆర్థిక వ్యవస్థపై మనకున్న అవగాహనని కూడా కొత్తగా నిర్మిస్తుంది. ప్రారంభ భారతీయ లోహశోధన పరిజ్ఞానం, వాణిజ్య నెట్‌వర్క్‌ల అధునాతనని, బంగారంపై ఉన్న అధిక సాంస్కృతిక విలువని హైలైట్ చేస్తుంది. బీఆర్ మణి కనుగొన్న ఈ పురాతన బంగారు నాణేల ఆవిష్కరణ.. ప్రాచీన నాగరికత ఎంత గొప్పదో, ఎంత సంపన్నమైనదో మనకు స్పష్టంగా చూపుతోంది. ఈ తరహా.. పురావస్తు పరిశోధనలు.. మన చరిత్రకు సంబంధించిన వాస్తవాలను మనకు తెలియజేస్తాయ్. గతంలో భారత్ ఎంత గొప్పగా వెలిగిందో కళ్లకు కడతాయ్. ఇవి.. మన గత తాలూకూ ఘనతని, వైభవాన్ని.. తరతరాలకు చాటి చెబుతాయ్. మన దేశం.. తన సంస్కృతి, జ్ఞానం, ఆర్థిక వ్యవస్థ ద్వారా ప్రపంచానికి ఎంతో ఇచ్చింది. ఈ బంగారు నాణేలు.. ఆ గొప్ప చరిత్రకు ఓ సజీవ సాక్ష్యంగా నిలుస్తాయ్.