Donald Trump: అమెరికా శాశ్వత నివాస కార్డుగా చెప్పే గ్రీన్ కార్డు పొందడం ఇక కష్టమేనంటున్నారు నిపుణులు. ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాల నుంచి వచ్చేవారు ఏళ్ల తరబడి వేచి చూడక తప్పదని అంటున్నారు. గ్రీన్ కార్డ్ ప్రక్రియ ఎంతో కష్టతరంగా ఉంటుంది. సంక్లిష్టంగా ఉంటుంది, ఇందుకంటూ నిర్దిష్ట అర్హతా ప్రమాణాలు, సరైన దరఖాస్తు ప్రక్రియ అవసరం. అప్లికెంట్ల హెల్త్, క్రైమ్ హిస్టరీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
గ్రీన్ కార్డ్ అంటే పర్మినెంట్ గా ఉండటానికి
ఇదిలా ఉంటే గ్రీన్ కార్డ్ అంటే పర్మినెంట్ గా ఇక్కడ ఉండటానికి పర్మిషన్ ఇచ్చినట్టు కాదని అంటారు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. గ్రీన్ కార్డ్ ఇవ్వడం అంటే అమెరికాలో పర్మినెంట్ గా ఉండిపోవడానికి ఇచ్చే హక్కులాంటిదేమీ కాదని అన్నారాయన. మాములుగా అయితే, గ్రీన్ కార్డును అధికారిక శాశ్వత నివాసిత్వ కార్డుగా భావిస్తారు. విదేశీయులు అమెరికాలో పర్మినెంట్ గా నివసిస్తూ పని చేయడానికిది అనుమతిస్తుంది. అలాగని శాశ్వతంగా నివసించేలా జీవిత కాలపు భద్రతనివ్వదని అంటారు జేడీ వాన్స్.
వివాహం ద్వారా గ్రీన్ కార్డు పొందాలనుకునేవారీకీ కష్టమే
అమెరికాలో శాశ్వత నివాసం కోసం వివాహం ద్వారా గ్రీన్ కార్డ్ పొందాలనుకుంటున్న వారికి కూడా ఇక కష్టకాలమే. అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం-USCIS.. వివాహ ఆధారిత గ్రీన్ కార్డ్ దరఖాస్తుల కోసం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. మోసపూరిత వివాహాలను అరికట్టి, గ్రీన్ కార్డ్ ప్రక్రియలో మరింత పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా.. ఈ మార్పు చేర్పులు చేసినట్లు చెబుతోంది USCIS.
ట్రంప్ జమానాలో బాగా తగ్గిన వలసదారుల సంఖ్య
మాస్ డిపోర్టేషన్ అంటే, మూకుమ్మడిగా స్వదేశానికి తిప్పి పంపడం, అరెస్టులు, చట్టబద్ధమైన ప్రవేశాలపై ఆంక్షలు.. ఇలా ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి వలసదారులపై విరుచుకుపడుతున్నారు. దీంతో డాలర్ డ్రీమ్స్ కంటూ.. అమెరికా వెళ్లాలనుకునేవారి సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది.
Also Read: బీజేపీకి దగ్గరై.. జగన్ సక్సెస్ అవుతాడా?
యూఎస్ లో తగ్గుతోన్న పని చేసే వయసుగల వారి సంఖ్య
ఇదే విషయాన్ని ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య వలసదారుల సంఖ్య- 53.3 మిలియన్ల నుంచి 51.9 మిలియన్లకు పడిపోయింది. దాదాపు 1.4 మిలియన్ల మేర తరుగుదల నమోదైంది. 1960 తర్వాత ఇలా వలసదారుల సంఖ్య క్షీణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ క్షీణత శ్రమించ గలిగే వయసున్న వారి సంఖ్య అమెరికా జనాభాలో పెరగడం లేదు. అలాంటప్పుడు ఈ దేశానికి వలసల నుంచే శ్రామికశక్తి లభిస్తుంది. ఈ శ్రామికశక్తి పెరగకపోతే.. ఆర్థిక వ్యవస్థకు నష్టమేనంటారు నిపుణులు.