Gold Price in India: బంగారం, వెండి ధరలు రోజురోజుకూ మారుతుంటాయి. ఒక్కోసారి ఉదయం ఉన్న ధర సాయంత్రానికి మారిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో ఒకే రోజు భారీగా పెరగడం, తగ్గడం కనిపిస్తుంది. అసలు ఈ ధరలను ఎవరు నిర్ణయిస్తారు? కేంద్ర ప్రభుత్వమా? బ్యాంకులా? లేక బంగారు ఆభరణాల వ్యాపారులా? చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. మన దేశంలో బంగారం, వెండికి ఒకే సంస్థ రోజువారీ ధరను నిర్ణయించదు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి స్థానిక డిమాండ్ వరకు అనేక అంశాలు వీటి ధరలను ప్రభావితం చేస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలకు అంతర్జాతీయ మార్కెట్లు కీలక ఆధారం. ముఖ్యంగా లండన్ బులియన్ మార్కెట్, అమెరికాలోని కామెక్స్ మార్కెట్లలో జరిగే ట్రేడింగ్ ధరలపై ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగితే మన దేశంలోనూ వాటి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అక్కడ ధరలు తగ్గితే ఇక్కడ కూడా తగ్గుదల కనిపిస్తుంది.
బంగారం అంతర్జాతీయంగా ఎక్కువగా అమెరికన్ డాలర్లలోనే కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయి. అందువల్ల రూపాయి, డాలర్ మారకం విలువ మన దేశంలో బంగారం ధరలను ప్రభావితం చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర మారకపోయినా, డాలర్ తో పోలిస్తే రూపాయి బలహీనపడితే భారత్‌లో బంగారం ధర పెరుగుతుంది. రూపాయి బలపడితే ధరలపై కొంత ఒత్తిడి తగ్గుతుంది.
భారత్‌లో బంగారం, వెండి అవసరాల్లో ఎక్కువ భాగం విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. వీటిపై కేంద్ర ప్రభుత్వం విధించే కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు కూడా ధరపై ప్రభావం చూపుతాయి. దిగుమతి ఖర్చులు పెరిగితే దేశీయ మార్కెట్‌లో ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే దిగుమతి సుంకాలు తగ్గితే ధరలపై ప్రభావం పడుతుంది.
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) దేశీయ బులియన్ మార్కెట్‌కు సంబంధించిన సూచిక ధరలను ప్రకటిస్తుంది. మరోవైపు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం, వెండి ఫ్యూచర్స్ ట్రేడింగ్ జరుగుతుంది. ఈ మార్కెట్లలో నమోదయ్యే ధరలను వ్యాపారులు, పెట్టుబడిదారులు పాటిస్తారు.
పెళ్లిళ్ల సీజన్, పండుగల సమయంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. దీంతో డిమాండ్ అధికమైతే స్థానిక మార్కెట్ ధరలపై ప్రభావం ఉంటుంది. అంతర్జాతీయంగా వెండి పారిశ్రామిక అవసరాలు, ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీలో వినియోగం పెరగడం కూడా దాని ధరలను ప్రభావితం చేస్తుంది.
ఒకే నగరంలో రెండు దుకాణాల్లో బంగారం ధరలు కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. దీనికి కారణం మేకింగ్ ఛార్జీలు, వ్యాపారుల మార్జిన్, ఇతర ఖర్చులు. అంతేకాదు, ఆభరణాలపై వర్తించే GST కూడా బిల్లులో చేరుతుంది. అందుకే బంగారం కొనుగోలు చేసే ముందు రోజువారీ మార్కెట్ ధరతో పాటు మేకింగ్ ఛార్జీలు, హాల్ మార్కింగ్ వివరాలు కూడా చెక్ చేయడం మంచిది.
Read Also: భారత్ దగ్గర వేల కోట్ల విలువైన బంగారం.. ఎక్కడ దాచిపెడతారో తెలుసా?