Wholesale vs Retail: ప్రస్తుతం పట్టణాల్లో రిటైల్ మార్కెట్లు మెరుస్తుంటే, పల్లెల్లో హోల్‌సేల్‌కు చక్కటి ఆదరణ లభిస్తోంది. ఒకే సబ్బును ఒక చోట రూ. 40కి.. ఇంకొక చోట రూ.25కే అమ్ముతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతోంది? వ్యాపార వ్యూహాల వెనుక నిజమేంటి? ప్రజలకు ఏమి లాభం? వ్యాపారులకు ఏమి లాభం? హోల్‌సేల్ బెటరా? రిటైల్ బెటరా? తెలియాలంటే ఈ కథనం తప్పక చదవండి. మీ డబ్బు కూడా ఆదా చేసుకోండి.
హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్?
ఇప్పటి వ్యాపార యుగంలో వినియోగదారుడు చాలా అవగాహనతో కొనుగోలు చేస్తాడు. కాసింత తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందా? అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. ఇది సాధారణమే.. అయితే అదే వస్తువు ఒక చోట రూ. 100 ఉంటే, మరో చోట రూ. 80కి దొరకడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఇక్కడే హోల్‌సేల్ మార్కెట్లు, రిటైల్ (చిల్లర) మార్కెట్ల మధ్య తేడా తేటతెల్లమవుతుంది.
హోల్‌సేల్ అంటే ఏంటి?
హోల్‌సేల్ వ్యాపారం అంటే పెద్ద మొత్తంలో ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్మడం. వీటిని సాధారణంగా డీలర్లు లేదా మరో రిటైలర్లు కొనుగోలు చేసి మళ్ళీ చివరి వినియోగదారులకు అమ్ముతారు. ఇది లాభసాటి వ్యాపారం కాబట్టి, ఎక్కువ పరిమాణంలో కొనే వారు చాల తక్కువ ధరకు వస్తువులను పొందగలుగుతారు. ఉదాహరణకు.. ఒక హోల్‌సేల్ డీలర్ దగ్గర 12 లైఫ్‌బాయ్ సబ్బులు రూ. 300కి దొరికితే, అదే చిల్లర షాపులో ఒక్కోటి రూ. 30కి అంటే రూ. 360కి అమ్ముతారు.
రిటైల్ అంటే ఏంటి?
రిటైల్ వ్యాపారం అంటే నేరుగా కస్టమర్‌కు అమ్మడం. ఇది హోల్ సేల్ కంటే కొంచెం ఎక్కువ ధర. ఎందుకంటే దుకాణం ఖర్చులు, రెంట్, సిబ్బంది వేతనాలు, ఇతర వాణిజ్య వ్యయాలన్నీ ఇక్కడే చేరతాయి. కానీ వినియోగదారుడికి ఇది సౌలభ్యంగా ఉంటుంది. దగ్గరలోనే దుకాణం, ఓపెన్ ప్యాకింగ్, కొనగలికేంత కొద్ది మోతాదులో సరుకులు ఇవన్నీ ప్లస్ పాయింట్లు.
ఎవరి కోసం ఏది సరైనది?
ప్రతి వినియోగదారుడి అవసరాలు, ఖర్చు శక్తి, జీవితశైలి ఆధారంగా వారు ఏ మార్కెట్‌ను ఎంచుకోవాలో నిర్ణయించాలి. ఉదాహరణకు, పెద్ద కుటుంబాలు ఎక్కువ పరిమాణంలో వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందువల్ల హోల్‌సేల్ మార్కెట్లు వీరికి చక్కటి ఎంపిక అవుతాయి, ఎందుకంటే బల్క్ లో కొనుగోలు చేయడం వల్ల ధర తక్కువగా వస్తుంది.
దీనికి విరుద్ధంగా, చిన్న కుటుంబాలు తక్కువ వాడకంతో సరిపడే వస్తువుల కోసం చూస్తారు. వీరికి రిటైల్ మార్కెట్లు అనుకూలంగా ఉంటాయి, ఎందుకంటే చిన్న పరిమాణాల్లో సరుకులు దొరుకుతాయి, ఉపయోగించడానికి సౌలభ్యం ఉంటుంది. వ్యాపారులకు అయితే మళ్లీ అమ్మడం కోసం సరుకులు కావాలి. వీరు లాభం కోసం పెద్ద పరిమాణాల్లో కొనుగోలు చేస్తారు కాబట్టి హోల్‌సేల్ మార్కెట్లే వీరి మొదటి ఎంపిక అవుతాయి.
మరోవైపు, సౌలభ్యాన్ని కోరే వారు, ఉదాహరణకు, నగరాల్లో నివసించే వారు తమ అవసరాలకు అనుగుణంగా దగ్గర్లోనే షాపింగ్ చేయాలని భావిస్తారు. వీరికి రిటైల్ మార్కెట్లు ఎంతో అనువుగా ఉంటాయి. ఈ విధంగా, వినియోగదారుల అవసరాలు, ఖర్చు నియంత్రణ, అందుబాటు వంటి అంశాలను బట్టి హోల్‌సేల్ లేదా రిటైల్ మార్కెట్ ఎంచుకోవాలి.
అసలు రెండింటి మధ్య తేడా ఎంత?
ఒక ప్రముఖ హోల్‌సేల్ మార్కెట్ లో బియ్యం 25 కిలోల బస్తా రూ.1100కి లభిస్తుంది. అదే రిటైల్ షాపులో రూ.1250కి ఉంది. అలాగే షుగర్, ఆయిల్, నిత్యావసర వస్తువుల ధరలలో 10% నుంచి 20% వరకు తేడా కనిపిస్తోంది. అయితే దీనికి ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు, నిల్వ సామర్థ్యం, నిల్వకు అవసరమైన స్థలం వంటి అంశాలు కూడా పరిగణనలోకి రావాలి.
ఒకే మార్కెట్‌లో రెండు మోడల్స్?
ఇప్పటికే దేశంలోనే కాకుండా, మన తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని షాపులు రిటైల్-ప్లస్-హోల్‌సేల్ మోడల్‌ను అనుసరిస్తున్నారు. ఉదాహరణకు.. ధర్మ రైస్ హౌస్, మెగా మార్కెట్ వంటి చోట్ల పెద్ద స్టాక్ లలో కొంటే తక్కువ ధర, చిన్న ప్యాకెట్ కొంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. ఇది 2 తరహాల వినియోగదారులకు సౌలభ్యం కలిగించడమే లక్ష్యంగా చేస్తోంది.
ఫైనల్ అర్బన్ vs రూరల్ ఎంపిక
పట్టణాల్లో స్థలం తక్కువ, డబ్బు ఎక్కువ. అందుకే అక్కడ రిటైల్ మార్కెట్లు ప్రాధాన్యంలో ఉంటాయి. గ్రామాల్లో మాత్రం మెటీరియల్ స్టోర్స్, డీలర్ షాపులు ఎక్కువగా ఉండటం వల్ల హోల్‌సేల్ కొనుగోళ్లకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇదే తేడా మార్కెట్‌లో మినీ యుద్ధానికి కారణమవుతోంది.
ప్లాన్ చేయండి – పొదుపు చేసుకోండి!
మీరు ఎంత ఖర్చు చేస్తారో కంటే, ఎక్కడ ఖర్చు చేస్తున్నారో అనే దానిపైనే మొత్తం లాభనష్టాలు ఆధారపడి ఉంటాయి. పెద్దగా కొంటారా? దగ్గరగా కొంటారా? మీరు ఎంచుకునే దారి మీ ఖర్చులను నిర్ణయిస్తుంది. తస్మాత్ జాగ్రత్త.. డబ్బులు ఊరికే రావు!