Marketing Psychology: సాధారణంగా మనం ఏదైనా మాల్స్‌కి వెళ్లినా, ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ ఓపెన్ చేసినా చాలా వరకు వస్తువుల ధరలు రూ.99, రూ.499, లేదా రూ.999 అని కనిపిస్తుంటాయి. అయితే, రౌండ్ ఫిగర్‌గా రూ.100 లేదా రూ.500 అనకుండా ఈ ఒక్క రూపాయి ఎందుకు తగ్గిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఉన్న కారణం కేవలం ఒక్క రూపాయి తగ్గించడం మాత్రమే కాదు, దాదాపు 150 ఏళ్ల చరిత్ర, వ్యాపారుల చాతుర్యం, కస్టమర్ల సైకాలజీతో ఆడుకునే పెద్ద మార్కెటింగ్ వ్యూహమే ఉంది.
ఈ ప్రైసింగ్ ట్రెండ్ ఎలా మొదలైందనే దానికి సంబంధించి ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. 1870ల కాలంలో అమెరికాలోని షికాగో నగరంలో మెల్విల్ స్టోన్ అనే పత్రికా సంపాదకుడు ‘షికాగో డైలీ న్యూస్’ అనే పేపర్‌ను ఒక సెంట్‌కే అమ్మాలనుకున్నాడు. కానీ అప్పట్లో మార్కెట్‌లో ఒక సెంట్ నాణేల కొరత ఎక్కువగా ఉండేది. దాంతో ఆయన ఒక ఉపాయం ఆలోచించి, స్థానిక వ్యాపారులను కలిశాడు. వారి వస్తువుల ధరలను ఒక డాలర్ కాకుండా 99 సెంట్లకు తగ్గించమని కోరాడు. దీనివల్ల కస్టమర్లకు ఒక సెంట్ చిల్లర దక్కేది. ఆ వచ్చిన ఒక సెంట్‌తో వాళ్లు షాపు బయటే ఉన్న ఆయన వార్తాపత్రికను కొనేవారు. ఈ చిట్కాతో వ్యాపారులకు అమ్మకాలు పెరిగితే, ఆ సంపాదకుడి పత్రిక వ్యాపారం విపరీతంగా పుంజుకుంది.
మరొక ప్రసిద్ధ కథనం ప్రకారం.. ఈ పద్ధతి షాపుల్లో పనిచేసే ఉద్యోగుల చేతివాటానికి అడ్డుకట్ట వేయడానికి పుట్టుకొచ్చింది. పూర్వకాలంలో ఒక వస్తువు ధర రౌండ్‌గా ఒక డాలర్ ఉంటే.. కస్టమర్ సరిగ్గా అదే నోటు ఇచ్చేవాడు. సేల్స్‌మన్ ఆ డబ్బును గల్లా పెట్టెలో వేయకుండా నేరుగా జేబులో వేసుకునే అవకాశం ఉండేది. అదే ధరను 99 సెంట్లుగా నిర్ణయిస్తే.. కస్టమర్‌కు ఒక సెంట్ చిల్లర తిరిగి ఇవ్వడానికి సేల్స్‌మెన్ తప్పనిసరిగా క్యాష్ రిజిస్టర్ తెరిచి బిల్లు కొట్టాల్సి వచ్చేది. దీనివల్ల యజమానులకు లెక్కలు కచ్చితంగా తేలి, ఉద్యోగుల దొంగతనాలు తగ్గేవి.
Also Read: జేబులో రూపాయి లేకపోయినా షాపింగ్ చేయొచ్చు.. Flipkart Pay Later ఆప్షన్ అదిరింది!
ఈ వ్యూహం ఇప్పటికీ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం మన మెదడు పనిచేసే తీరే. దీన్ని సైకాలజీలో ‘లెఫ్ట్-డిజిట్ ఎఫెక్ట్’ అంటారు. మన మెదడు సంఖ్యలను ఎడమ నుండి కుడికి వేగంగా ప్రాసెస్ చేస్తుంది. ఉదా: ఒక వస్తువు ధర రూ.399 అని చూసినప్పుడు, మన మైండ్ చివర ఉన్న 99 కంటే మొదట్లో ఉన్న 3 అనే అంకెనే బలంగా గుర్తుంచుకుంటుంది. రూ.399 అనేది రూ.400కి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ.. మానసికంగా మనం దాన్ని ‘మూడు వందల చిల్లర’గానే భావిస్తాం. ఈ చిన్న భ్రమ కస్టమర్‌ను వస్తువు కొనేలా ప్రేరేపిస్తుంది.
ధరలను అంచనా వేసేటప్పుడు మన మెదడు ఎక్కువ శ్రమ తీసుకోకుండా తేలికైన మార్గాన్ని ఎంచుకుంటుంది. రూ.999 చూడగానే ‘ఇది వెయ్యి కంటే తక్కువ’ అనే సంకేతం మనసుకు చేరి, కొనుగోలు నిర్ణయం వేగవంతమవుతుంది. అలాగే ఏ సంఖ్య చివరైనా 99 ఉంటే.. ఆ వస్తువు ఆఫర్‌లో ఉందేమో లేదా కంపెనీ ప్రత్యేకంగా ధర తగ్గించి అమ్ముతోందేమో అనే భావన కలుగుతుంది. అదే రౌండ్ ఫిగర్ ఉంటే అసలు డిస్కౌంటే లేదేమో అనిపిస్తుంది.
పాత రోజుల్లో చిల్లర ఇవ్వడం కోసం ఈ పద్ధతి ఉపయోగపడితే.. నేడు UPI, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులు వచ్చాక కూడా దీని హవా తగ్గలేదు. రూపాయి తేడాతో మన బడ్జెట్ పరిమితి దాటలేదనే ఒక మానసిక సంతృప్తి కస్టమర్‌కు లభిస్తుంది. కేవలం ఒక్క రూపాయి తేడాతో కస్టమర్ మైండ్‌సెట్‌ను మార్చే ఈ ‘ఛార్మ్ ప్రైసింగ్’ ట్రిక్, శతాబ్దాల చరిత్రను దాటుకుని నేటికీ ఈ-కామర్స్ ప్రపంచంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Also Read: బాటా అస్సలు ఇండియన్ కంపెనీయే కాదు, దీని చరిత్ర తెలిస్తే వావ్ అంటారు!