Woman Growing Saffron: ఉద్యోగాలు చేసే అనేక మంది తమకు నచ్చిన వ్యాపారం చేసుకుని హాయిగా జీవించాలని అనుకుంటారు. కానీ కొంత మంది మాత్రమే ముందడుగు వేసి పాటిస్తుంటారు. అలా చేసిన వారిలో అనేక మంది వ్యాపారాలు సక్సెస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా అచ్చం అలాగే ఓ మహిళ కూడా తనకు నచ్చిన వ్యాపారాన్ని చేస్తూ ఏడాదికి ఏకంగా 30 లక్షలకుపైగా సంపాదిస్తున్నారు. అయితే ఆ మహిళ ఏ వ్యాపారం చేశారు, ఎలా సంపాదిస్తున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఒడిశాకు చెందిన సుజాతకు 2022లో కుంకుమ పువ్వు వ్యాపారం గురించి ఆసక్తి ఏర్పడింది. ఆ క్రమంలో తన ఇంట్లో కుంకుమ పువ్వు పండించడం సాధ్యమా అని ఆలోచించారు. కశ్మీర్ ప్రాంతంలో పెరిగే ఈ పువ్వును ఇతర ప్రాంతాల్లో పెంచడం సాధ్యమేనా అని ప్రశ్నించుకున్నారు. చివరకు పలు రకాల ప్రయత్నాలు చేసి అలాంటి చల్లటి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసి పండించుకోవడం సాధ్యమేనని నిర్ణయించుకున్నారు.
ఇదే విషయాన్ని తన కుటుంబానికి ఆమె చెప్పింది. కానీ ఆ ఆలోచనను వారి ఫ్యామిలీ వ్యతిరేకించారు. ఇక్కడ చాలా కష్టమని చెప్పారు. కశ్మీర్ వాతావరణంలో పెరిగే కుంకుమ పువ్వు, ఇక్కడ ఎలా పండిస్తావని ప్రశ్నించారు. కానీ సుజాత మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇక్కడే ఎలాగైనా పండిస్తానని వారికి చెప్పేసింది. ఆ క్రమంలోనే సుజాత తన కలను నిజం చేసుకునేందుకు రూ. 11 లక్షలు పెట్టుబడితో పంట కోసం ఎలాంటి వాతావరణం ఉండాలో తెలుసుకుని ఇంట్లోనే అలాంటి గది వాతావరణాన్ని క్రియేట్ చేసింది.
Read Also: Paytm: పేటీఎం నుంచి గుడ్ న్యూస్.. స్టాక్ ట్రేడింగ్ చెల్లింపులు మరింత సులభతరం
అందుకోసం చిల్లర్, హ్యూమిడిఫైయర్, డీ హ్యూమిడిఫైయర్, ట్రేలు వంటి అనేక ఇతర పరికరాలను కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఒక రైతు నుంచి ఆమె కుంకుమ పువ్వు గింజలను తెప్పించుకుంది. ఆ తర్వాత వాటిని నాటగా, కొన్ని రోజులకు పువ్వులు మొలకెత్తాయి. దీంతో సుజాత సంతోషానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఒకటి, రెండు కాదు, ప్రతీ మొక్కలో కూడా ఐదు పువ్వులు వచ్చాయని ఆమె చెప్పుకొచ్చింది. అలా క్రమంగా పంటను పెంచుకుంది.
ఆ విధంగా 2022 అక్టోబర్‌లో సుజాత 25 కిలోల కుంకుమ పువ్వు గింజల నుంచి 450 గ్రాముల కుంకుమ పువ్వులను పండించింది. 2023 జనవరిలో రెండో పంటను కూడా పండించి మరో 50 గ్రాముల అధిక నాణ్యత కుంకుమ పువ్వులను ఉత్పత్తి చేసింది. దీంతోపాటు కుంకుమ పువ్వులను మాత్రమే కాకుండా వాటి ఉప ఉత్పత్తులుగా సీరాలు, కహ్వా టీ లాంటి ఉత్పత్తులను కూడా పెంచి సేల్ చేస్తుంది.
దీంతో అనేక కష్టాల తర్వాత ప్రస్తుతం సుజాత వ్యాపారం విజయవంతంగా మారింది. తన వ్యాపారానికి “బ్లూమ్ ఇన్ హైడ్రో” అని పేరు పెట్టుకుంది. ఈ క్రమంలో ఆమె వార్షిక ఆదాయం రూ. 32 లక్షలు వస్తుండగా, అందులో రూ. 23 లక్షలు కుంకుమ పువ్వుల వ్యవసాయం నుంచి వస్తున్నాయి. వాటి ఉప ఉత్పత్తుల ద్వారా మిగతా మొత్తం లభిస్తుంది. అంటే మరో రూ. 9 లక్షలు హైడ్రోపోనిక్స్ వ్యవసాయ పద్ధతిలో పండించిన కూరగాయలు, మైక్రోగ్రీన్స్ అమ్మకం నుంచి వస్తున్నాయి.
ప్రస్తుతం సుజాత కేవలం ఒక రైతు మాత్రమే కాకుండా తన విజయం ద్వారా అనేక మందికి ఒక మార్గదర్శిగా మారారు. దీంతోపాటు ఆమె ఇప్పటికే 80 మందికిపైగా వ్యక్తులకు హైడ్రోపోనిక్స్, మైక్రోగ్రీన్స్, కుంకుమ పువ్వు వ్యవసాయంలో శిక్షణ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో అనేక మంది సొంత వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు తోడ్పాటునిస్తున్నారు.