Minor Forcibly Marrying: బాల్య వివాహాలపై దేశంలో ఎన్ని చట్టాలు తెస్తున్నా ఎక్కడో ఒక చోట బలవంతపు పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసి మైనర్ల జీవితాలను నాశనం చేస్తున్నారు. అలాంటి ఘటన కర్ణాటకలో జరిగింది. 14 ఏళ్ల బాలికకు బలవంతంగా పెళ్లి చేశారు తల్లిదండ్రులు. ఆమెను బలవంతంగా కాపురానికి పంపే ప్రయత్నంలో మీడియాకు చిక్కారు. ఇంతకీ అసలేం జరిగిందన్న డీటేల్స్ లోకి ఓసారి వెళ్లొద్దాం.
తమిళనాడులో ఏం జరిగింది?
తమిళనాడులోని హోసూర్ సమీపంలో తిమ్మత్తూర్ చిన్న గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక స్థానిక పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివింది. ఫ్యామిలీ సమస్యల వల్ల పాఠశాలకు మధ్యలో ఫుల్‌స్టాప్ పెట్టేసింది. ఆ తర్వాత ఇంటి వద్ద బాలిక ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో సంబంధాలు చూడడం మొదలుపెట్టారు.
చివరకు కర్ణాటకలోని కాలికుట్టై గ్రామానికి చెందిన 29 ఏళ్ల మాదేష్‌తో ఆ బాలికకు వివాహం చేశారు. అయితే ఈ పెళ్లి బాలికకు ససేమిరా ఇష్టం లేదు. అయినా బలవంతంగా తల్లిదండ్రులు చేశారు. బాలికతో పెళ్లి బెంగళూరు లో జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. అసలు ట్విస్ట్ ఇక్కడి నుంచి మొదలైంది. పెళ్లి తర్వాత సదరు బాలిక తన స్వగ్రామం తిమ్మత్తూర్‌కి వచ్చేసింది. అత్తారింటికి వెళ్లేందుకు ససేమరా అంటూ నిరాకరించింది.
అత్తారింటికి వెళ్లేందుకు నిరాకరణ
చివరకు కూతుర్ని అత్తారింటికి వెళ్లాలని తల్లిదండ్రులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా సరే అక్కడికి వెళ్లేది లేదని చెప్పేసింది. బంధువులు చెప్పినా ఆ బాలిక మనసు మారలేదు. ఈ క్రమంలో భర్త మాదేష్, అత్తవారింటికి వచ్చాడు. పెళ్లి చేసుకున్న బాలికను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా బాలిక కేకలు వేస్తూ కన్నీరు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది.
ALSO READ: అరెస్ట్ భయంతో కోట్లు విలువైన వజ్రాలను మింగిన దొంగ
ఈ తతంగాన్ని బాలికను తీసుకెళ్తున్న రూట్లో కొందరు యువకులు తమ సెల్‌ఫోన్‌తో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీనిపై ఎవరికి ఇష్టమొచ్చినట్టు వారు కామెంట్స్ చేశారు. బాలికను ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో వ్యవహారం మీడియా దృష్టికి వెళ్లింది. ఈ యవ్వారం పోలీసులు దృష్టిపెట్టారు.
అమ్మమ్మ ఇంట్లో ఆశ్రయం
మాదేష్‌పై పోలీసులు అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే బాల్య వివాహ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద బాలిక తల్లిదండ్రులు, బంధువులపై కేసులు నమోదు చేశారు. బాలిక తల్లిదండ్రులతోపాటు మరో ముగ్గుర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. బాధితురాలు ప్రస్తుతం తన అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. మార్చి మూడున జరిగిన ఈ పెళ్లిని బాలిక అమ్మమ్మ అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఈ వ్యవహారంపై తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా ఎస్పీ తంగదురై మాట్లాడారు. బాల్య వివాహ చట్టంతోపాటు పోక్సో చట్టం కింద బాలికపై లైంగిక వేధింపులకు దిగినట్టు తెలిపారు. ఈ ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. జరిగిన ఘటన నుండి బాలిక బయట పడటానికి కౌన్సెలింగ్‌తోపాటు అవసరమైన సహాయం అందిస్తామని జిల్లా యంత్రాంగం హామీ ఇచ్చింది.