Meerut Family Murder| ఒకే కుటుంబంలోని అయిదుగురు సభ్యులు హత్యకు గురయ్యారు. భార్య భర్తలు, వారి ముగ్గురు పిల్లలు అందరినీ ఒకేసారి హత్య చేశారు. అయితే వారంతా ఎలా చంపబడ్డారు.. హంతకుడెవరనేది తెలుసుకోవడానికి పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే చనిపోయిన వారి మృతదేహాలన్నీ ఇంట్లోనే ఉండగా.. ఆ ఇల్లు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. దీంతో హంతకుడు ఎలా బయటికి తప్పించుకున్నాడో తెలియడం లేదు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరంలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకరాం.. మీరట్ నగరంలోని లిసాడీ గేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి మొయీన్ ఒక మెకానిక్ పనిచేసేవాడు. అతని కుటుంబంలో భార్య ఆస్మా, ముగ్గురు కూతుళ్లు అఫ్సా(8), అజీజా (4), అడీబా (1) ఉన్నారు. మొయీన్ కొంత నెలల క్రితమే ఆ ప్రాంతంలో ఇల్లు తీసుకొని అక్కడే కాపురం పెట్టాడు. మొయీన్ సోదరుడు సలీం మరో ప్రాంతంలో తన భార్య పిల్లలతో నివసిస్తున్నాడు.
ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి మొయీన్ తన సోదరుడు సలీంకు ఫోన్ చేయలేదు. సలీం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. దీంతో సలీం తన భార్యతో కలిసి గురువారం జనవరి 9, 2025 రాత్రి తన సోదురుడు మొయీన్ ఇంటికి వెళ్లారు. అయితే ఎంత సేపు తలుపు తట్టినా మొయీన్ ఇంటి లోపల నుంచి ఎవరూ స్పందించలేదు. చాలా సేపు తలుపు తట్టాక ఇరుగుపొరుగు వారి సాయంలో సలీం ఆ తలుపు బద్దలు కొట్టాడు. లోపలికి వెళ్లగానే ఏదో కుళ్లిపోయిన దుర్వాసన వస్తోంది. ఆ దుర్వాసన బెడ్రూం నుంచి వస్తోంది. కానీ బెడ్రూం కూడా లోపలి నుంచి లాక్ చేసి ఉంది.
Also Read : చినిగిన షర్టు ముక్కతో హంతకుడిని పట్టుకున్న పోలీసులు.. సినిమా కాదు రియల్!
దీంతో సలీంకు అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న లిసాడీ గేట్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఇల్లంతా పరిశీలించాక.. బెడ్రూం తలుపులు గట్టిగా ఉండడంతో వాటిని పగులగొట్టకుండా పైకప్పు నుంచి మార్గం ఉండడంతో అక్కడి నుంచి పోలీసులు ఇంట్లోకి దిగారు. లోపల మరో మార్గంలో కిటికీలు పగులగొట్టి బెడ్రూంలోకి ప్రవేశించారు. అక్కడికి వెళ్లి చూస్తే.. మొయీన్, అతని భార్య అస్మా శవాలు బెడ్ పైనే పడుకోబెట్టినట్లు కనిపించాయి. పైగా వారి కాళ్లు కట్టేసినట్లు ఉన్నాయి.
వారికి ముగ్గురు పిల్లలకు కూడా ఉన్నారని సలీం చెప్పడంతో పోలీసులు ఆ పిల్లల కోసం ఇల్లంతా వెతికారు. కానీ ఎక్కడా కనబడలేదు. దీంతో పోలీసులు ముందుగా మొయీన్, అతని భార్య అస్మా శవాలను పోస్టు మార్టం కోసం తరలించి.. ఫోరెన్సిక్ నిపుణులను పిలిచారు. ఫోరెన్సిక్ నిపుణులు ఇల్లంతా పరిశీలిస్తూ ఉండగా.. వారికి అనుకోకుండా పిల్లల శవాలు కనిపించాయి. ఆ శవాలు మొయీన్, ఆస్మా పడుకొని ఉన్న బెడ్ లోపల బాక్స్ లో ఉన్నాయి. ముగ్గురు ఆడపిల్లలు అంతా చిన్నారులే.. వారిని ఎవరో దారుణంగా గొంతు నులిమి చంపేశారు.
ఈ కేసులో విచిత్రమేమిటంటే మొయీన్, ఆస్మాల కాళ్లు కట్టేసి వారిని హత్య చేశారు. అంతకుముందే వారి పిల్లలను హత్య చేశారు. అంతవరకు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కానీ ఇల్లు, లోపల బెడ్రూం లోపలి నుంచి ఎవరు లాక్ చేశారు? హంతకులు ఏ మార్గం నుంచి పారిపోయారు? అనే ప్రశ్నలు మిగిలిపోయాయి.
అయిదుగురి కుటుంబ సభ్యుల హత్య కేసులో మీరట్ ఎస్ఎస్పి విపిన్ టాడా మాట్లాడుతూ.. హంతకులెవరో ఈ కుటుంబానికి సన్నిహితులేనని అనుమానిస్తున్నాం. కుటుంబానికి పాత కక్షలుండే అవావకాశాలున్నాయి. హంతకుడు చాకచక్యంగా పై కప్పు మార్గాన తప్పించుకొని ఉండవచ్చనే నిర్ధారణక వచ్చాం. విచారణ త్వరలోనే పూర్తి చేసి హంతకులను పట్టుకుంటామని చెప్పారు.