Bihar News: బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లాలో దిగ్బ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలో చేతబడి చేస్తున్నారనే నెపంతో.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గ్రామస్థులు విచక్షణారహితంగా కొట్టి, సజీవ దహనం చేశారు. మూడు రోజుల క్రితం టెట్గామా గ్రామంలో చికిత్స సమయంలో.. జార్ఫుక్ అనే బాలుడు మరణించాడు. బాధిత కుటుంబంలో మంత్రగత్తెలు ఉండటం వల్లే మృతి చెందాడని భావించిన గ్రామస్థులు ఐదుగురని తగలబెట్టారు.
మృతుల వివరాలు
మరణించిన ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వారిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కుటుంబాన్ని గ్రామస్తులు మంత్రగత్తెలు, తాంత్రికులుగా అభిప్రాయపడి, తమ గ్రామానికి హాని కలిగిస్తున్నారన్న మూఢనమ్మకంతో.. ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
ఘటనకు నేపథ్యంలో ఏమైంది?
మూడు రోజుల క్రితం గ్రామంలో నివసించే ఓ బాలుడు జార్ఫుక్.. చికిత్స పొందుతున్న సమయంలో మరణించాడు. అప్పటి నుంచి ఆ కుటుంబంపై అనుమానాలు పెరిగాయి. బాలుడి మృతికి కారణం శరీర సంబంధిత సమస్యలే అయినప్పటికీ, గ్రామస్థులు మాత్రం చేతబడి వల్లే బాలుడు మృతి చెందాడని అనుకున్నారు. చివరికి ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ.. వారిని తమ ఇళ్ల నుంచి లాక్కొచ్చి విచక్షణారహితంగా కొట్టారు.
మానవత్వానికి మచ్చతెచ్చిన ఘటన
ఆ తర్వాత వాళ్లను గ్రామం చౌరస్తాలో బలవంతంగా కూర్చోబెట్టి, వారిమీద పేట్రోలు పోసి నిప్పుపెట్టారు. వీరి చుట్టూ నిలబడి గ్రామస్థులు చూస్తున్నారు కానీ.. ఎవ్వరూ ఆ క్రూరత్వాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. కొందరు మొబైల్ ఫోన్లలో వీడియోలు తీయడం కూడా జరిగింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పోలీసులు రంగంలోకి
సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా మరికొంతమందిపై దర్యాప్తు కొనసాగుతోంది. పూర్నియా జిల్లా కలెక్టర్, పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ, ఇది ఒక భయంకరమైన నేరంగా పరిగణిస్తున్నామని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
సమాజానికి ఆత్మపరిశీలన అవసరం
ఈ ఘటన.. సమాజంలో ఇప్పటికీ మూఢనమ్మకాలు ఎలా ప్రబలంగా ఉన్నాయో స్పష్టంగా తెలియజేస్తుంది. మంత్రగత్తెలు, చేతబడి వంటి పేరుతో రోజురోజుకి హత్యలు పెరిగిపోతున్నాయి.
Also Read: తెలివి ఉండే నా తల రాత రాశావా? దేవుడికి లెటర్ రాసి.. యువకుడు అలాంటి పని..
ఇలాంటి దారుణాలకు జరగకుండా.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. అదే సమయంలో ప్రజల్లో అక్షరజ్ఞానం, విజ్ఞానం పెంపొందించాల్సిన బాధ్యత కూడా ఉంది.