Vemulawada Man: మతి, తెలివి ఉండే తలరాత ఇలా రాశావా..? అదే నీ కొడుకుకు అలా రాయలేదే..? మేము నీ కొడుకులం కాదా..? ఇది ఆత్మహత్య చేసుకునే ముందు ఓ యువకుడు దేవుడికి రాసిన లెటర్‌లో వేసిన ప్రశ్నలు. వేములవాడకు చెందిన రోహిత్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకోగా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించారు.
చివరి లెటర్‌లో భావోద్వేగం
లెటర్ రాసిన విధానాన్ని బట్టి చూస్తే రోహిత్ డిప్రెషన్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది అంటున్నారు పోలీసులు. తాను కన్న కలలు నెరవేరలేదు కానీ.. ఓ మంచి సూసైడ్ లెటర్ రాయాలన్న కోరిక మాత్రం నెరవేరిందన్నాడు రోహిత్. తన జీవితం జగన్మాతకు అంకితమని.. తన భౌతిక దేహాన్ని మాత్రం కాశీలో దహనం చేయాలని కోరాడు. అంతేకాదు తనకు మరో జన్మ వద్దన్నాడు రోహిత్.
డాక్టర్ డీ సంతకం వెనుక ఏదో అంతర్లీన గాథ?
అయితే సూసైడ్ లెటర్‌లో అతని సంతకాన్ని డాక్టర్ డీ అని పెట్టాడు. ఇదొక్కటే ఇప్పుడు అంతుబట్టని విషయంగా ఉంది. ఎందుకంటే ఎమ్మెస్సీ పూర్తి చేసి ప్రస్తుతం బీఎడ్ చదువుతున్నాడు రోహిత్. అయితే తనకు డాక్టర్ కావాలనే కోరిక ఉండేదని తెలుస్తోంది. ఈ విషయంలోనే రోహిత్ కాస్త అసంతృప్తితో ఉండేవాడని తెలుస్తోంది. మరి నిజంగా ఇదే కారణంతో రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా మరేదైనా కారణం ఉందా? అనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది.
కుటుంబ స్థితిగతులు, మానసిక ఒత్తిడి
కుటుంబంలో ఆర్థికంగా బలహీనతలు, రోహిత్‌కు ఎదురైన నెగిటివ్ అనుభవాలు.. అతనిని లోలోపల కుమిలిపోయేలా చేశాయి. ప్రతిభ ఉన్నప్పటికీ, అవకాశాలు కలగకపోవడం.. సమాజంతో పోరాటం చేస్తూ.. తానేంటో తెలుసుకునే క్రమంలో సఫలమవకపోవడం అతనిలో.. విరక్తిని పెంచినట్లు లెటర్ బావోద్వేగాలు చెబుతున్నాయి.
మృతుడి కోరికలు..
రోహిత్ తన లెటర్‌లో మరో జన్మ వద్దని స్పష్టంగా పేర్కొన్నాడు. అంటే ఈ జన్మలో ఎదురైన నిరాశలు, నిష్ప్రభత, సంఘర్షణలే ఆయనను ఈ నిర్ణయానికి తీసుకువచ్చినట్టు అనిపిస్తోంది. కానీ అతని సూసైడ్ వెనుక మరేదైనా కారణం ఉందా? ఎవరైనా మానసికంగా హింసించారా? లేక విద్య, ఉద్యోగాల విషయంలో.. ఎదురైన అవమానాలేమైనా కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి
ఈ సంఘటన మరోసారి సమాజంలో.. యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిపై దృష్టి సారించేలా చేసింది. చదువుల్లో రాణించాలనే పట్టుదల, కెరీర్‌లో పరాజయాల భయం, సమాజపు అంగీకారం కోసం పోరాటం ఇవన్నీ కలిసి కొందరిని మానసికంగా కృంగిపోయేలా చేస్తుంది. రోహిత్ ఉదంతం కూడా అలాంటిదే అయి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Also Read: వైద్యుల నిర్లక్ష్యం.. ఆపరేషన్ కోసం వెళ్తే.. ప్రాణాలు తీసేశారు..
రోహిత్ సూసైడ్ లెటర్ మనల్ని ఒక్కసారి ఆలోచించుకునేలా చేస్తోంది. “దేవుడికి కూడా మన బాధలు అర్థం కావు” అన్న నిరాశతో మరణాన్ని అంగీకరించిన ఈ యువకుడు, సమాజం అతనికి చూపిన నిర్లక్ష్యానికి ప్రతిబింబమా..? అతను “మేము నీ కొడుకులం కాదా?” అని దేవుడిని అడగాల్సిన స్థితికి రావడం, నిజంగా యువతను ఎంతగానో విస్మరించేశేలా ఉన్నాయి? మరి ఇప్పటికైనా ఇలా మరొక రోహిత్ జీవితాన్ని కోల్పోకుండా ఉండాలంటే సమాజం, కుటుంబాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు అందరూ కలిసే స్పందించాల్సిన సమయం ఇది.