Sangareddy Crime: సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసై.. అప్పుల భారంతో కుంగిపోయిన ఓ యువకుడు రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓయో రూంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ విషాదకర సంఘటనకు సంబంధించి రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
మృతుడిని రామచంద్రాపురం సాయినగర్‌లో నివాసముంటున్న సంగీత్ రావు కుమారుడు అఖిల్ (30)గా పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 10వ తేదీన అఖిల్ బీరంగూడ కమాన్ పక్కన ఉన్న గక లావీ షోక్ అనే ఓయో రూంలోకి వచ్చాడు. ఆ మరుసటి రోజు ఉదయం.. ఆత్మహత్యకు పాల్పడడానికి కొద్ది క్షణాల ముందు, అఖిల్ తన తండ్రి సంగీత్ రావుకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం అందించాడు.
తండ్రితో మాట్లాడిన సందర్భంగా అఖిల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా.. తాను క్రికెట్ బెట్టింగ్‌లలో మోసపోయి.. విపరీతంగా అప్పులపాలయ్యానని.. ఆ అప్పులను తీర్చే మార్గం లేక ఈ దారుణ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల కారణంగానే తాను జీవితాన్ని కోల్పోతున్నానని అతడు వాపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రికి ఫోన్ చేసిన వెంటనే.. అఖిల్ తాను బస చేసిన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ALSO READ: Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు హతం
కుటుంబ సభ్యులు హుటాహుటిన ఓయో రూంకు చేరుకునే సరికి అఖిల్ విగతజీవిగా కనిపించాడు. వెంటనే ఈ విషయాన్ని రామచంద్రాపురం పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. యువకుడి మరణానికి ఆన్‌లైన్ బెట్టింగుల ద్వారా వచ్చిన అప్పులే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల యువతరం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక, మానసిక సమస్యలను, దాని పర్యవసానాలను మరోసారి కళ్ళకు కట్టింది. యువత ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీసులు మరియు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Vanga Chats NAG : సందీప్ రెడ్డి వంగా అంటే రాంగోపాల్ వర్మ కి బాప్