Hussainsagar Accident : రెండు రోజుల క్రితం భారత మాతకు హారతి కార్యక్రమం చూసేందుకు వచ్చి, అగ్నిప్రమాదంలో చిక్కుకుని తప్పిపోయిన అజయ్ అనే యువకుడి మృత దేహాన్ని ఎట్టకేలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికి తీశాయి. దాదాపు 45 గంటలకు పైగా సుదీర్ఘ గాలింపు తర్వాత అజయ్ మృత దేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి, పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హుస్సేన్ సాగర్ లో నిర్వహించిన భారత మాతకు హారతి కార్యక్రమం విషాదంగా మారింది. రంగు రంగుల బాణాసంచాలతో వేడుకలు ప్రారంభం కాగా.. కొద్ది సేపట్లోనే ఆనందాలు పంచిన బాణా సంచాలు ప్రాణాంతకంగా మారిపోయాయి. ఏ బోట్ల నుంచి కాల్చుతున్నారో అదే బోటులోకి నిప్పు రవ్వలు ఎగిసి పడగా, రెండు భారీ బోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.
ఊహించని ఈ ఘటనలో కొందరు చిన్నచిన్న కాలిన గాయాలతో బయటపడగా, అజయ్ అనే యువకుడు మాత్రం కనిపించలేదు. అతని ఆచూకీ గల్లంతైనట్లు గుర్తించిన అధికారులు.. హుస్సేన్ సాగర్ లో గాలింపు చర్యలు చేపట్టారు. సాధారణ గజ ఈతగాళ్లతో పాటుగా డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. సుదీర్ఘంగా 45 గంటల పాటు హుస్సేన్ సాగర్ ను జల్లెడ పట్టగా.. మంగళవారం సాయంత్రం వేళ అజయ్ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి.
బోటుకు మంటలు అంటుకోగానే భయంతో నీటిలోకి దూకినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అనుమతి లేకుండా ముగ్గురు స్నేహితులు సాగర్ లోపలికి వెళ్లగా, అందులో.. ఇద్దరు సురక్షితంగానే బయటపడ్డారు. అజయ్ అనే కుర్రాడు మాత్రం నీటిలో మునిగిపోయాడు. యువకుడు తప్పిపోయిన వార్త తెలిసినప్పటి నుంచి ఎనిమిది బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టగా రెండు రోజుల తర్వాత మృతదేహం లభ్యమైంది.
నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటనతో హుస్సేన్ సాగర్ లో బోట్ల ప్రయాణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహా బోటులో బాణా సంచా కాల్చిన విషయమై చర్చ జరుగుతోంది. వాస్తవానికి బోటులోపలికి మండే స్వభావమున్న వస్తువులు తీసుకెళ్లకూడదు. కాదని.. ఎవరైనా బాణా సంచా తీసుకువెళ్లాలి అంటే ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ఘటన సమయంలో ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని గుర్తించిన డిస్ట్రిక్ట్ ఫైర్ సేఫ్టీ అధికారులు బోటు నిర్వహకులు, ఈవెంట్ మేనేజర్లపై కేసులు నమోదు చేశారు.
Also Read : ఇన్ఫోసిస్ కో-ఫౌండర్‌పై ఎస్టీ, ఎస్సీ కేసు.. ఎందుకు?
యువకుడు తప్పిపోయిన వార్త తెలిసినప్పుటి నుంచి అతని కుటుంబ సభ్యులు.. అజయ్ ఆచూకీ కోసం హుస్సేన్ సాగర్ గట్టుపైనే ఎదురు చూస్తున్నారు. తన కొడుకు ప్రాణాలతో వచ్చే అవకాశాలు లేవని తెలిసి అతని తల్లి గుండెలు బాదుకుంటూ విలపిస్తుండగా, ఆ దృశ్యాలు చూసిన చూపరులను కన్నీరు పెట్టిస్తోంది.