Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరోసారి విషాదం నీడలు ముసురుకున్నాయి. ప్రకృతి ఒడిలో సరదాగా గడుపుదామని వెళ్లిన చిన్నారులను విధి వెక్కిరించింది. పెదబయలు మండలం పన్నెడ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
మొన్నటికి మొన్న ఏజెన్సీలోని మరో వాగులో స్నానానికి దిగి ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే, ఇప్పుడు పన్నెడలో ముగ్గురు బాలురు నీటి సమాధి కావడం అత్యంత బాధాకరం. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కోసం, సరదాగా ఈత కొడదామని ఐదుగురు బాలురు స్థానిక వాగులోకి దిగారు. అయితే నీటి లోతును అంచనా వేయలేక వారు గల్లంతయ్యారు.
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పిల్లలను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఇద్దరిని ప్రాణాలతో కాపాడగలిగారు. కానీ, మిగిలిన ముగ్గురు బాలురు అప్పటికే నీట మునిగి విగతజీవులుగా మారారు. కళ్లముందే ఆడుతూ పాడుతూ తిరిగిన పిల్లలు ఇలా శవాలై తేలడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల కన్నీరు మున్నీరవుతున్న తీరు అక్కడి వారిని కలచివేస్తోంది.
ఏజెన్సీ ప్రాంతంలోని వాగులు, వంకలు పైన చూడటానికి ప్రశాంతంగా కనిపించినా.. లోపల ఉండే గుంతలు, సుడిగుండాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం తర్వాత లేదా ఇలాంటి వేసవి సమయంలో నీటి నిల్వలు ఉన్న చోట పిల్లలను ఒంటరిగా పంపడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటనలు హెచ్చరిస్తున్నాయి. ఇకనైనా అధికారులు, తల్లిదండ్రులు అప్రమత్తమై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: ఆవలింతలు ఒకరి నుంచి ఒకరికి ఎందుకు వస్తాయి? దీని వెనుకున్న ‘షాకింగ్’ సైన్స్!