Crime News: ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో.. ఆదివారం ఉదయం ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. అక్కపల్లె గ్రామ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారు. మృతులు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన భారతి, రాముడుగా పోలీసులు గుర్తించారు.
భారతికి రెండు సంవత్సరాల క్రితమే వివాహం కాగా, పలు కారణాలతో భర్తతో విభేదాలు ఏర్పడి పుట్టింట్లోనే నివాసం ఉంటోంది. అదే సమయంలో గ్రామంలోనే ఉండే రాముడుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరి మధ్య కొద్దికాలంగా సన్నిహిత సంబంధాలు ఏర్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారడంతో, కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది.
ఇద్దరి మధ్య కొనసాగుతున్న ఈ అనైతిక సంబంధాన్ని.. పెద్దలు గమనించి వారిని మందలించడంతో, ఇద్దరూ మానసికంగా కృంగిపోయారు. మిత్రులు, బంధువుల ఎంత నచ్చజెప్పిన వినలేదు. వ్యక్తిగత అభ్యంతరాలు, కుటుంబ ఒత్తిడులు, కారణంగా తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.
ఆదివారం ఉదయం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనకు సంబంధించి నిందితుల బంధువులు, గ్రామస్తుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేస్తున్నారు. ఇద్దరూ ముందే చనిపోవాలని నిర్ణయించుకుని ఉరివేసుకున్నట్టు.. పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, మరిన్ని వివరాలు పోస్టుమార్టం నివేదిక వచ్చాక వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read: మరో ఘోరం.. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు.. భర్తను చంపిన భార్య
ఇలాంటి ఘటనలు సమాజానికి గుణపాఠంగా నిలవాలి. వ్యక్తిగత సమస్యలు ఎంత భారంగా ఉన్నా, చర్చల ద్వారా పరిష్కారం పొందవచ్చు. అవివేకంగా తీసుకునే నిర్ణయాలు జీవితాల్ని కోల్పోయేలా చేస్తాయి. ప్రేమ, సంబంధాల విషయంలో బాధ్యతాయుతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
వీరి మరణంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. ఇద్దరి కుటుంబాలూ శోకసంద్రంలో మునిగిపోయాయి.