Bachupally Crime: బంధాలకు అర్థం లేకుండా పోయింది. ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఆలోచన లేక కొందరు.. ఆవేశంలో ఇంకొందరు. బంధాలను పక్కనపెట్టి బరితెగిస్తున్నారు. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. కత్తి పోట్లు తప్ప.. కట్టుబాట్లు లేవు! వ్యక్తిగత స్వార్థం తప్ప.. మానవతా విలువల్లేవ్! జీవిత భాగస్వామి అనే పదానికే అర్థం మారిపోయిందిప్పుడు. మగాళ్ల జీవితాల్లోకి భార్యల్లా వచ్చి.. మరొకరి భాగస్వామిగా మారాలనే కోరికలతో రగిలిపోయే.. నీచమైన మనస్తత్వాలు ఉన్న కొందరు ఆడవాళ్లు.. అనవసరంగా భర్తల ప్రాణాలు తీసేస్తున్నారు.
ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు కట్టుకున్న భర్తను.. భార్యే గొంతు నులిమి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మండలం.. కోటకొండకు చెందిన కంపిలి అంజిలప్ప (32) కు పదేళ్ల క్రితం ధన్వాడ మండలం రామకిష్టయ్యపల్లికి చెందిన రాధతో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. బతుకుదెరువు కోసం రెండు నెలల క్రితం ముంబైకి వలస వెళ్లి కూలి పనులు చేశారు.
అక్కడే పనిచేస్తున్న ధన్వాడ మండలానికి చెందిన.. ఓ యువకుడితో రాధకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలియటంతో అంజిలప్ప తన భార్యను మందలించాడు. తర్వాత స్వగ్రామానికి తిరుగు పయన మయ్యారు. అయితే గ్రామానికి వెళ్తే పరువు పోతుందని భావించిన రాధ.. హైదరాబాద్‌లో పని చేసుకొందామని భర్తను ఒప్పించింది. దీంతో బాచుపల్లిలోని ఓ అపార్ట్ మెంట్‌లో ఇద్దరు పనిలో కుదిరారు. మళ్లీ రాధా తిరిగి తన ప్రియుడితో మాట్లాడటం అంజిలప్ప గమనించాడు. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ గొడవలు జరిగాయి.
జూన్ 23వ తేదీ రాత్రి, మద్యం సేవించిన అంజిలప్ప, ఇంటికి వచ్చి మత్తులో పడుకున్నాడు. ఇదే సమయంలో తన భర్తను శాశ్వతంగా తొలగించాలనే ఉద్దేశంతో.. రాధా అతడి గొంతు నులిమి హత్య చేసింది. హత్య అనంతరం ఏమీ తెలియనట్లుగా పక్కనే ఉన్న వేరే గుడిసెలో వెళ్లి పడుకుంది. తెల్లవారుజామున లేచి భర్త చనిపోయాడని విలపిస్తూ, స్థానికుల సహాయంతో ప్రైవేట్ అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వగ్రామమైన కోటకొండకు తీసుకువచ్చింది.
Also Read: స్నేహితుల హేళన.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని
ఐతే మృతుడి సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ.. నారాయణపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణ పేట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కేసును బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. బాచుపల్లి పోలీసులు.. మృతుడి భార్యపై అనుమానంతో విచారణ చేపట్టటంతో తన భర్తను తానే చంపానని రాధా అంగీకరించింది. తన ప్రియుడితో మాట్లాడొద్దంటూ భర్త తరచూ అనుమానిస్తూ ఉండటంతో.. మనస్తాపానికి గురై హత్యకు పాల్పడినట్లు రాధ ఒప్పుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.