AP Woman Molested: ప్రజల్ని కాపాడాల్సిన రక్షక భటులే కామాంధులుగా మారారు. మహిళలకు అండగా ఉండాల్సిన పోలీసులే అత్యాచారానికి ఒడిగట్టారు. తమిళనాడులోని తిరువణ్ణామలై(అరుణాచలం) పుణ్య క్షేత్రానికి వెళ్తున్న ఏపీ యువతిపై పోలీస్ కానిస్టేబుళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు.
మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న యువతిని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యువతిని తిరువణ్ణామలైలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులే యువతిపై అత్యాచారం చేశారని తెలిసి అంతా షాక్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ మహిళ తన 18 ఏళ్ల కూతురితో కలిసి అరుణాచలం ఆలయానికి వెళ్తున్నారు. వీరిద్దరూ మార్గమధ్యలో టమాటాల రవాణా చేస్తున్న వాహనంలో ఎక్కారు. ఆ గూడ్స్ వాహనంలో తల్లీకూతురు, డ్రైవర్ ముగ్గురే ఉన్నారు. ఈ వాహనం సోమవారం రాత్రికి ఎంథాల్ బైపాస్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో బైపాస్‌పై పెట్రోలింగ్ చేస్తున్న సురేశ్ రాజ్, సుందర్ అనే ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు టమాటాల వాహనాన్ని ఆపారు. తనిఖీ చేయాలని చెప్పి తల్లీకూతురుని కిందకు దింపారు.
పోలీసులను చూసి భయపడిన గూడ్స్ వాహనం డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. తల్లీకూతురు తాము అరుణాచలం వెళ్తున్నామని, దారిలో ఈ వాహనం ఎక్కామని చెప్పారు. వారిద్దరినీ తమ వాహనం మీద అరుణాచలం తీసుకెళ్తామని చెప్పిన పోలీసులు విల్లుపురం రోడ్డుకు తీసుకెళ్లారు. అక్కడ యువతి తల్లిని ముళ్లపొదల్లోకి తోసేశారు.
యువతిని విల్లుపురం సమీపంలోని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. యువతి తల్లి స్థానికంగా ఉన్న వారికి జరిగిన విషయం చెప్పడంతో వాళ్లు 108కు ఫోన్ చేశారు. గ్రామస్థులు యువతిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరిద్దరిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులే యువతిపై అత్యాచారానికి పాల్పడడంతో ఈ ఘటన స్థానికంగా సంచలనం అయింది. రక్షించాల్సిన వాళ్లే ఇలా దారుణానికి పాల్పడితే ఎవరిని నమ్మాలని మహిళలు ప్రశ్నిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.